మా పార్టీకి మద్దతు ఇస్తే..నీకు పిల్లనిచ్చి పెళ్లిచేస్తాం : బ్రహ్మచారికి నాయకుడికి బంపరాఫర్

మా పార్టీకి మద్దతు ఇస్తే..నీకు పిల్లనిచ్చి పెళ్లిచేస్తాం : బ్రహ్మచారికి నాయకుడికి బంపరాఫర్

Karnataka jds members support for marriage offer  : గతంలో ఆడపిల్లకు పెళ్లి చేయలంటే చెప్పులరిగిపోయేవని సామెత. కానీ ఇప్పుడు మగపిల్లలకు పెళ్లి కావటమే కష్టంగా ఉంది. ఇదిలా ఉంటే ఓ రాజకీయ పార్టీలో పనిచేస్తు వార్డు మెంబర్ అయిన చోటా మోటా నాయకుడిగా ఎదిగిన బ్రహ్మచారి యువకుడికి మరో రాజకీయ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ‘‘నువ్వు మా పార్టీకి మద్దతు ఇస్తే నీకు ఓ చక్కని పిల్లను వెదికి పెళ్లి చేసే బాధ్యత మాది’’ అంటూ ఆఫర్ ఇచ్చింది. దీంతో సదరు బ్రహ్మచారి ఎగిరి గంతేసాడు.

అప్పటి వరకూ తాను పనిచేసే పార్టీకి ఝలక్ ఇచ్చాడు. పెళ్లి ఆఫర్ ప్రకటించిన పార్టీలో జంప్ అయిపోయేందుకు సిద్ధపడ్డాడు. దీంతో పార్టీలో పెద్ద పెద్ద నాయకులు సైతం అతడిని ఆపటానికి చూసినా..‘పార్టీ లేదు పచ్చి పులుసూ లేదు..పెళ్లి చేస్తామని అంత పెద్ద ఆఫర్ ఇస్తుంటే నేను ఇక్కడుండుదేందీ..నేనుండా’’ అంటూ ఝలక్ ఇచ్చారు. దీంతో ఏకంగా మాజీ సీఎం రంగంలోకి దిగి ఫోన్ చేసి మాట్లాడినా వినలేదు.

పెళ్లి చేసుకోవటాని ఏనాటినుంచో అనుకుంటూ పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదరని ఆ చోటామోటా యువకుడికి మరో పార్టీ ఇచ్చిన ‘పిల్లనిచ్చే ఆఫర్’ తెగ నచ్చేసింది. దీంతో ‘‘ ‘ఆహనా పెళ్లి అంట.. ఓహో నా పెళ్లి అంట.. అంటూ రవి అనే ఆ వార్డు సభ్యుడు ఏనుగెక్కినంత సంబరపడిపోతున్నాడు. పెళ్లి పేరు చెప్పేసరికి ఇంత ఆనందపడిపోతున్న అతడి వాలకం చూసిన ఆపార్టీవారు ఔరా పెళ్లి ఇంత పనిచేస్తుందనుకోలేదంటూ తలపట్టుకుని కూర్చున్నారు.

అసలు విషయానికి వస్తే…కర్ణాటకలో ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. రామనగర్‌ జిల్లా కోడంబళ్లి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేందుకు జనవరి 11న షెడ్యూలు ఖరారు చేశారు. బీసీ ఏ కేటగిరికి అధ్యక్ష స్థానం రిజర్వు కాగా, కాంగ్రెస్ కు చెందిన ఓ వ్యక్తి రేసులో ఉన్నారు. అతనికి ఇదే పంచాయతీలో జేడీఎస్‌కు చెందిన వార్డు సభ్యుడు రవి మద్దతు అవసరమైంది.

రవి బ్రహ్మచారి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్ని సంబంధాలు చూసినా కుదరటం లేదు. ఈ విషయం తెలుసుకున్న రామనగర్‌ జిల్లా గ్రామీణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ‘మాకు మద్దతు ఇస్తే..నీకు మంచి పిల్లను చూసి పెళ్లి చేసే బాధ్యత మాది’ అంటూ రవికి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. దీంతో రవి సై అన్నాడు. దీంతో జేడీఎస్‌ నాయకులు ఖంగుతిన్నారు. పెళ్లి కోసం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయొద్దంటూ హెచ్చరించారు.

చివరికి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చేత కూడా ఫోన్‌ చేయించారు. అయినా రవి ససేమిరా అన్నాడు. నాకు రాజకీయం కంటే పెళ్లిపీటలే ముఖ్యమని తేల్చిచెప్పేశాడు. ఈ జగమొండి బ్రహ్మచారి తీరుతో మండిపడ్డ కుమారస్వామి అతడిపై వేటు వేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కానీ..స్థానిక నాయకత్వం మాత్రం జనవరి 11 దాకా వేచి చూద్దాం అనే ధోరణి లో ఉన్నట్టు సమాచారం. చూశారా జీవితంలో పెళ్లి ఎంత ఇంపార్టెంటో..రాజకీయం కంటే పెళ్లే ముఖ్యమని పార్టీ అధిష్టానాన్నే బేఖాతరు చేశాడు ఓ సాధారణ వార్డు మెంబరు..