సోషల్ మీడియాలో పరిచయం-స్నేహంతో ఇంటికి వచ్చి దోచుకెళ్లారు

సోషల్ మీడియాలో పరిచయం-స్నేహంతో ఇంటికి వచ్చి దోచుకెళ్లారు

Karnataka social media friend gang robbery in hyderabad :  టెక్నాలజీ పెరిగి మంచి కన్నా కొన్నిసందర్భాల్లో చెడే ఎక్కువగా జరుగుతున్నట్లు కనపడుతోంది.   సోషల్ మీడియాను ఉపయోగించుకుని పలువురు అసాంఘిక కార్యకలాపాలకు నేరాలకు పాల్పడుతున్నఘటనలు చూస్తూనే ఉన్నాము. తాజాగా హైదరాబాద్ ఎల్బీనగర్ లో నివసించే సతీష్ అనే స్వచ్చంధ సంస్ధ నిర్వాహకుడికి ఇన్ స్టాగ్రాంలో పరిచయం అయిన వ్యక్తులు స్నేహితులుగా ఇంటికి వచ్చి దోపిడీకి పాల్పడ్డ ఉదంతం వెలుగు చూసింది.

వనస్ధలిపురంలో హెల్ప్‌ కిడ్స్‌  హ్యాపీ కిడ్స్‌ అనే స్వచ్చంద సంస్థ నడిపే సతీష్ కి కర్ణాటకకు చెందిన నిఖిల్ అనే వ్యక్తి ఇన్ స్టాగ్రాంలో పరిచయం అయ్యాడు. నిఖిల్ కు వినయ్ చౌదరి, ఉదయ్‌ కుమార్, బ్రహ్మ తేజ అనే వారు చిన్నానాటి స్నేహితులు. ఈ నలుగురూ జులాయిగా తిరుగుతూ నేరాలు చేయటం మొదలెట్టారు. సతీష్ తో పరిచయం పెంచుకున్న నిఖిల్ సతీష్ ఆర్ధిక లావాదేవీల గురించి తెలుసుకున్నాడు. అతని వద్ద డబ్బు ఉంటుందని… అది కొట్టేయాలని చూశాడు. తన మిత్రులకు ప్లాన్ చెప్పాడు. అందరూ ఓకే అనుకుని కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చారు.

డిసెంబర్ 15న బొమ్మ పిస్తోల్ తీసుకుని సతీష్ ఇంటికి వచ్చారు. మంచి, చెడూ మాట్లాడుతూ ఆకలవుతోందని అన్నం కావాలని అడిగారు.  సతీష్  వారికి ఆహారం రెడీ చేసే క్రమంలో ఉండగా నలుగరూ కలిసి అతడి మీద దాడి చేసి తాడుతో కాళ్లు చేతులు కట్టేసి, మాట్లాడకూండా నోటిని టవల్ తో కట్టేసి ఇంట్లోని రూ. నగదు. రూ.1.18 లక్షల నగదు, విదేశీ, కరెన్సీ, రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు మొబైల్‌ ఫోన్లు, సిల్వర్‌ నెక్లెస్‌ దోపిడీ చేసి బళ్లారి పారిపోయారు. ఈ విషయమై సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మళ్లీ హైదరాబాద్ లో దొంగతనం చేసేందుకు ఈ గ్యాంగ్  21వ తేదీ సోమవారం శంషాబాద్ కు వచ్చారు.  అప్పటికే బాధితుడు సతీష్ ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. శంషాబాద్ వచ్చిన నలుగురు నిందితులను గుర్తించిన ఎల్బీ నగర్ సీసీఎస్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 26 లక్షలు విలువ చేసే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.