పైనాపిల్ కాదు, కేరళలో ఏనుగు మృతి కేసు విచారణలో కొత్త విషయం

10TV Telugu News

కేరళలో ఏనుగు మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ఏనుగుని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. ఏనుగు మృతి కేసు విచారణలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్‌ తినడం వల్ల ఏనుగు చిన‌పోయింద‌ని అందరూ భావిస్తున్నారు. కాగా, ఏనుగు తిన్నది పైనాపిల్ కాద‌నే విష‌యం వెల్ల‌డైంది. ఏనుగు మ‌ర‌ణించింది పేలుడు ప‌దార్థాలు నింపిన‌ పైనాపిల్ తిన‌డం వ‌ల్ల కాద‌ని, పేలుడు ప‌దార్థాలు కూర్చిన కొబ్బ‌రి బోండాం తిన‌డం వ‌ల్ల‌ అని అటవీశాఖ అధికారి సునీల్‌ కుమార్‌ తెలిపారు.

నాటు బాంబులు తయారీ:
ఏనుగు మృతి కేసుకు సంబంధించి సాక్ష్యాల సేకరణలో భాగంగా అధికారులు నిందితుడిని పేలుడు పదార్థాలు తయారు చేసే ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్క‌డ కేసు ద‌ర్యాప్తున‌కు అవ‌స‌ర‌మైన సాక్ష్యాల‌ను సేక‌రించారు. ప్ర‌స్తుతం త‌మ అదుపులో ఉన్న నిందితుడు విల్సన్ చెట్ల నుంచి రబ్బరు తీసే ప‌ని చేసేవాడ‌ని అధికారులు చెప్పారు. ఇటీవ‌ల‌ మరో ఇద్దరితో క‌లిసి నాటు బాంబులు తయారు చేస్తున్నాడ‌ని, ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రు ప‌రారీలో ఉన్నారని, త్వరలోనే వాళ్ల‌ను కూడా పట్టుకుంటామ‌ని తెలిపారు.

జంతువుల నుంచి పంటలను కాపాడుకునేందుకు పేలుడు పదార్ధాల వినియోగం:
పాల‌క్క‌డ్, దారి ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌లు.. క్రూరమైన అడవి జంతువుల నుంచి తమ పంటలను రక్షించుకునేందుకు పేలుడు ప‌దార్థాల‌ను నింపిన పండ్లు, జంతువుల కొవ్వు ఉప‌యోగిస్తారు. ఈ క్రమంలో పేలుడు పదార్థాలు నింపిన కొబ్బరి బోండాన్ని ఏనుగు తినడంతో దాని నోటికి తీవ్ర గాయ‌మైంది. దీంతో గ‌త‌ కొన్ని రోజులుగా ఆహారం, నీరు తీసుకోకుండా ఇబ్బంది పడింది. ఈ క్ర‌మంలో నొప్పి భ‌రించ‌లేక‌ పాలక్కాడ్‌లోని వెల్లార్ నదిలోకి దిగిన ఏనుగు నీరసంతో చ‌నిపోయింది.

ఏనుగు మృతిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు:
ఓ ఫారెస్ట్ ఆఫీసర్ తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేయడంతో పాలక్కాడ్‌లో ఏనుగు మృతి ఘటన వెలుగులోకి వచ్చింది. గర్భంతో ఉన్న 15 సంవత్సరాల వయసున్న ఏనుగు ఇలా దారుణంగా చనిపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. బాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి కేంద్ర మంత్రుల వరకు తీవ్రంగా స్పందించారు. వ్యాపారవేత్తలు, సాధారణ ప్రజలు కూడా మండిపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏనుగు మృతి ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగడంతో కేరళ సీఎం పినరయి విజయన్‌ విచారణకు ఆదేశించారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా విచారణ జరుపుతున్నారు. దోషులను అరెస్ట్ చేసిన న్యాయస్థానం ముందు నిలబెట్టి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. మే 23న ఆ ఏనుగును స్థానికులు గుర్తించారు. తర్వాత అది అడవిలోకి వెళ్లి.. మళ్లీ 25న తిరిగొచ్చింది. అది చనిపోయే ముందు ఒక రోజు మొత్తం వెల్లియార్‌ నదిలోనే ఉంది. కాగా, ఉద్దేశపూర్వకంగా పేలుడు పదార్ధాలు పెట్టి ఏనుగుకు తినిపించారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Read: రెస్టారెంట్ వాటర్‌ట్యాంక్‌లో శవాలై తేలిన సిబ్బంది..