ఇంటర్నెట్ లేని విద్యార్థులకు టీవీల్లో క్లాసులు చెబుతున్న కేరళ

  • Published By: srihari ,Published On : June 3, 2020 / 11:29 AM IST
ఇంటర్నెట్ లేని విద్యార్థులకు టీవీల్లో క్లాసులు చెబుతున్న కేరళ

కరోనాను విజయవంతంగా కట్టడి చేసిన కేరళకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కష్టాలను అధిగమిస్తూనే ఇతర రాష్ట్రాలకు కేరళ ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు విద్యపై కూడా కేరళ దృష్టిపెడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలు తెరిచే పరిస్థితి లేదు. ప్రత్యేకించి విద్యార్థుల కోసం ఆన్ లైన్ క్లాసులు చెప్పిస్తోంది కేరళ ప్రభుత్వం. అయితే చాలామంది విద్యార్థులకు కనీసం ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేదు. అలాంటి విద్యార్థుల కోసం వర్చువల్ క్లాసులను చెబుతోంది.

అందరికి విద్య అందేలా చర్యలు చేపడుతోంది. కేరళ విద్యా శాఖ ‘First Bell’ పేరుతో ఆన్ లైన్ సెషన్లను మొదలుపెట్టింది. VICTERS TV ఛానల్ ద్వారా ఈ ఆన్ లైన్ సెషన్స్ టెలిక్యాస్ట్ చేస్తున్నారు. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు వారాంతాల్లో ఉదయం 8.30 గంటల నుంచి 5.30 గంటలు వరకు క్లాసులు చెప్పిస్తోంది. కేబుల్ నెట్ వర్క్ ఉన్నవారికి ఇంటర్నెట్ పై, డీటీహెచ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ క్లాసులు ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. 

గత సోమవారం నుంచే ఈ క్లాసులు మొదలయ్యాయి. కేరళ వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాల్లో 2.6 లక్షల మంది విద్యార్థులకు ఆన్ లైన్ సౌకర్యాలు అందుబాటులో లేవని ఓ అధ్యయనం రివీల్ చేసింది. కనీసం టెలివిజన్ కూడా లేని విద్యార్థుల కోసం కేరళ సీఎం.. పొరుగు ప్రాంతాల్లో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ స్టడీ సెంటర్లలో రాయితీతో కూడిన టీవీలను అందిస్తారు. VICTERS ఛానల్ ద్వారా టెలివిజన్ లో ప్రసారం అవుతుంది. 

సామాజిక దూరాన్ని పాటిస్తూనే విద్యార్థులు క్లాసులు వినేలా సౌకర్యాలు కల్పించారు. ఈ క్లాసులకు సంబంధించి టైమ్ టేబుళ్లను కూడా Kerala Infrastructure and Technology for Education (KITE) ఏర్పాటు చేసింది. ఈ సెషన్స్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని క్లాసులను ఛానల్ ద్వారా ప్రసారం చేస్తోంది. మొదటివారంలోనే 1.2 లక్షల ల్యాప్ టాప్ లు, 7వేల ప్రొజెక్టర్లు, దాదాపు 4,545 టెలివిజన్లను విద్యార్థుల కోసం కేరళ అందించింది. 

Read: వలస కార్మికులకు కేంద్రం రూ.10వేలు ఇవ్వాలి: సీఎం