కోహినూర్ పుట్టిన జిల్లా.. వలసలకు కేరాఫ్‌గా మారిపోయింది: షర్మిల

కోహినూర్ పుట్టిన జిల్లా.. వలసలకు కేరాఫ్‌గా మారిపోయింది: షర్మిల

తెలంగాణలో రాజన్న రాజ్యం తేస్తానంటూ ప్రకటన చేసిన వైఎస్‌ షర్మిల.. పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్రతి జిల్లాకు వెళ్తూ.. జిల్లాల్లో భేటీలు నిర్వహిస్తోన్న షర్మిల.. లేటెస్ట్‌గా పాలమూరు జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. ఈ సంధర్భంగా.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు.. అధికార పార్టీపై ప్రశ్నల వర్షం కురిపించారు.

తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై వైఎస్‌ షర్మిల వేగం పెంచగా.. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌ అభిమానులతో సమావేశం అయ్యారు. ఈ భేటీకి అనేక మంది అభిమానులు తరలిరాగా.. షర్మిల నివాసం వద్ద కోలాహలం నెలకొంది. బంజారా వేషధారణలో వచ్చిన మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. వారి వేషాన్ని షర్మిల కూడా ధరించారు.

కోహినూర్ వజ్రం పుట్టిన పాలమూరు జిల్లా.. నేడు వలసలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని చెప్పిన వైఎస్‌ షర్మిల.. 150 మంది వలస కార్మికులు గల్లంతయ్యారనే వార్త విన్నప్పుడు గుండె తరుక్కు పోయిందని అన్నారు. ఇన్నేళ్ల పాలనలో ఏం మారలేదంటూ విమర్శించారు.. ఈ భేటీలో పాలమూరు నేతల సలహాలు, సూచనలు తెలుసుకున్నారు షర్మిల. అలాగే ఈనెల 8న మహిళా దినోత్సవాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ నెల 9న ఉమ్మడి ఆదిలాబాద్‌, 12న ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.
ఈ సమావేశాలను చూస్తుంటే.. పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో బిజీగా ఉన్నట్టు కనిపిస్తున్నారు.. షర్మిల పార్టీ ఏర్పాటుకు ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 9న పార్టీ ఏర్పాటు ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై స్పష్టమైన ప్రకటన చేస్తారని షర్మిల సన్నిహితులు చెబుతున్నారు.

అంతేకాదు జులై 8న హైదరాబాద్‌‌ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని షర్మిల భావిస్తున్నారని సమాచారం.. సుమారు 4 లక్షల మందితో నిర్వహించే ఆ సభలో పార్టీ పేరును అఫీషియల్‌గా అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జులై 8వ తేదీన వైఎస్ఆర్ జయంతి. అదే రోజున పార్టీ పేరును ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని ఆమె భావిస్తున్నారు. షర్మిల పెట్టబోయే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆమె వ్యూహాలు రచించే పనిలో బిజీగా ఉన్నారు.. ఇందులో భాగంగానే తెలంగాణలోని సమస్యలు జిల్లాల వారీగా గుర్తించే పనిలోపడ్డారు. ఇందుకోసం జిల్లాల కార్యకర్తలతో వైఎస్‌ షర్మిల వరుస భేటీలు జరుపుతున్నారు.