Kokapet Lands : వామ్మో.. ఒక్క ఎకరం రూ.60కోట్లు.. కోకాపేట భూములు కోట్లు కురిపించాయి

హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములకు నిర్వహించిన వేలంలో రికార్డు ధరలు నమోదయ్యాయి. ఈ భూములు కోట్లు పలికాయి.

Kokapet Lands : వామ్మో.. ఒక్క ఎకరం రూ.60కోట్లు.. కోకాపేట భూములు కోట్లు కురిపించాయి

Kokapet Lands

Kokapet Lands : హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములకు నిర్వహించిన వేలంలో రికార్డు ధరలు నమోదయ్యాయి. ఈ భూములు కోట్లు పలికాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. 49.92 ఎకరాలకు ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌ ద్వారా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) గురువారం వేలం నిర్వహించగా రికార్డు స్థాయిలో ధర పలికింది.

ఈ భూముల్లో ఒక ఎకరానికి అత్యధికంగా రూ.60.2 కోట్లు పలికింది. అత్యల్పంగా ఒక ఎకరం రూ.32కోట్లు పలికింది. యావరేజ్ గా ఒక్కో ఎకరం ధర రూ.40కోట్లు పలికినట్లు అయ్యింది.

ఒక్కో ఎకరం కనీస ధర రూ.25 కోట్లుగా నిర్ధారించగా.. వేలంలో గరిష్ఠంగా రూ.60.2 కోట్లు పలికింది. తాజా వేలంతో హెచ్‌ఎండీఏకు రూ.2వేల కోట్ల ఆదాయం సమకూరింది. అధికారులు ఊహించిన ధరకంటే కోకాపేట భూములు రెట్టింపు ధర పలకడం గమనార్హం. రాజపుష్ప రియల్ ఎస్టేట్ సంస్థ గరిష్ఠ ధరతో 1.65 ఎకరాలు దక్కించుకుంది.

కోకాపేటలోని భూములను వేలం వేయడానికి ప్రభుత్వం ఏడాది కిందట నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే 49.92 ఎకరాలను అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వెంచర్‌గా మార్చే పనిని హెచ్‌ఎండీఏ తీసుకుంది. ఈ మొత్తం భూమిని ఎనిమిది ప్లాట్లుగా విభజించింది. ఒక్కో ఎకరం కనీసం ధర రూ.25 కోట్లుగా నిర్ధారించింది. దీనికి అనుగుణంగా ఈ-వేలం నిర్వహించింది. ఈ వెంచర్‌కు నియోపొలిస్‌ పేరు పెట్టింది. ఔటర్ పక్కనే ఈ వెంచర్‌ ఉంది.

ప్రస్తుతం ఈ వెంచర్‌లోకి ఔటర్ నుంచి నేరుగా రావడానికి వీలు లేదు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్ నుంచి కోకాపేటకు రావాలంటే ఇంటర్‌ ఛేంజ్‌లో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేకంగా ట్రంపెట్‌ నిర్మిస్తున్నారు. దీనివల్ల ఎయిర్‌పోర్టు వైపు నుంచి ఔటర్ మీదుగా నేరుగా నియోపోలిస్‌ లేఔట్‌లోకి రావొచ్చు. దీనికి రూ.82 కోట్లను వ్యయం చేస్తున్నారు. దీంతో ఈ నియోపోలిస్‌కు పెద్దఎత్తున డిమాండ్‌ ఏర్పడింది.

కోకాపేటలో ప్రభుత్వం ఆధీనంలో 634 ఎకరాల భూములు ఉన్నాయి. 2007లో 167 ఎకరాలు వేలం వేశారు. ఆ సమయంలో గరిష్ట బిడ్ రూ.14.25కోట్లు. కాగా, గతంలో కోకాపేట చుట్టుపక్కల వేలం వేసినప్పుడు ఎకరా రూ.40 కోట్ల ధర పలికింది. మరోవైపు ఖానామెట్‌లోని 15.01 ఎకరాలను రేపు(జూలై 16,2021) వేలం వేయడానికి టీఎస్‌ఐఐసీ ఏర్పాట్లు చేసింది. ఈ వెంచర్‌కు గోల్డెన్‌ మైల్‌ అని పేరు పెట్టారు. ఈ భూములకు కూడా భారీ ధర దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. కోకాపేట భూములు చాలా ఏళ్లు లీగల్ చిక్కుల్లో పడ్డాయి. 2017లో హెచ్ఎండీఏకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హెచ్ఎండీఏ 110 ఎకరాలు ఎస్ఈజెడ్ కి, ఇతర సంస్థలకు 55 ఎకరాలు కేటాయించింది. మిగిలిన 300 ఎకరాల్లో లేఔట్ అభివృద్ధి చేసింది. రోడ్లు, ఇతర మౌలిక వసతులకు పోను.. 110 ఎకరాల్లో ప్లాట్లు డెవలప్ చేశారు.