గోదారి నీళ్లు కొండెక్కిస్తాన్నాడు…కాళేశ్వరం కట్టాడు..నీరు పారించాడు

  • Published By: madhu ,Published On : May 29, 2020 / 05:56 AM IST
గోదారి నీళ్లు కొండెక్కిస్తాన్నాడు…కాళేశ్వరం కట్టాడు..నీరు పారించాడు

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఎన్నో ఎండ్ల కల నెరవేరింది. నీళ్లు – నిధులు – నియామకాలు పేరిట తెలంగాణ ఉద్యమం సాగింది. కోటి ఎకరాల మాగాణి చేయడమే లక్ష్యం అన్న సీఎం కేసీఆర్..మాట నిజం అయ్యింది. గోదావరి నీళ్లను తీసుకొస్తానని స్పష్టంగా చెప్పిన కేసీఆర్..అనుకున్నట్లుగానే చేశారు.

2020, మే 29వ తేదీ శుక్రవారం మెదక్ జిల్లాలో కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభంలో భాగంగా మర్కూక్ పంప్ హౌస్ ను సీఎం కేసీఆర్, త్రిదండి చిన జీయర్ స్వామిలు ప్రారంభించారు. మీట నొక్కిన తర్వాత…గల గల పారుతున్న గోదారిని చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో ఎళ్లుగా కరువు కాటకాలతో అల్లాడిన ఆ రైతు..గోదావరి జలాలను చూస్తూ..ఉబ్బితబ్బిబై పోతున్నారు. ఈ నీటితో పంటలు పండించుకోవచ్చని, ఇక ఏ బాధ ఉండదంటున్నారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో కొండపోచమ్మ రిజర్వాయర్ చివరది. సముద్రమట్టానికి వందల మీటర్ల ఎత్తుకు గోదారిని తరలించడం ఇందులో స్పెషాల్టీ. తొలుత అందరూ అసాధ్యమని అనుకున్నారు.

కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అకుంఠిత దీక్షతో అనుకున్న పనులు పూర్తి చేశారు. అపరభగీరుథుని వలే..వందల మీటర్ల ఎత్తుకు నీటిని తరలించారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనే ఈ రిజర్వాయర్ ఉండడం గమనార్హం. మొత్తానికి ఈ రిజర్వాయర్ ద్వారా..సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాలో ఉన్న రైతులకు నీరు అందనుంది. కరువు కాటకాలకు కేరాఫ్ అడ్రస్ గా పిలవడే సిద్ధిపేట..ఇప్పుడు రిజర్వాయర్లతో కళకళలాడనుంది.

సమైక్య పాలనలో ఎలాంటి పాలన సాగిందో అందరికీ తెలిసిందే. వ్యవసాయం కోసం ఇతర ప్రాంతాలకు రైతులు వలసవెళ్లే వారు. వ్యవసాయం దండగా అనే అభిప్రాయానికి వచ్చే దశ కనిపించింది. కానీ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత గలది.

రైతులకు నీరు తప్పకుండా అందిస్తామని ప్రభుత్వం చెప్పినా తొలుత వినిపించుకోలేదు. కానీ అనుకున్న పనులు పూర్తి చేసి..నీటిని విడుదల చేయడంతో ప్రతొక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి కరువు కాటకాలు లేకుండా..మూడు పంటలు పండించుకోవచ్చని అంటున్నారు.

భూగర్భ జలాల మట్టం కూడా పెరుగుతుందని, దీనిద్వారా బోరు బావుల్లో నీరు వస్తుందని అంటున్నారు. మొత్తానికి సవాలక్ష సమస్యలను అధిగమించి…స్వప్నాన్ని సాకారం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల రాత మారనుంది. 

Read: మర్కుక్ పంప్ హౌస్ ప్రారంభం..పూజలు చేసిన సీఎం కేసీఆర్..చిన జీయర్