ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజే నర్సుల దినోత్సవం: లేడి విత్ ది లాంప్  

  • Published By: nagamani ,Published On : May 12, 2020 / 10:05 AM IST
ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజే నర్సుల దినోత్సవం: లేడి విత్ ది లాంప్  

రోగులకు వైద్యులు ఇచ్చే మందు  ఎంత ముఖ్యమో, నర్సులు చేసే సేవలు అంతకంటే ముఖ్యం. నర్సులు సేవలకు ఆద్యురాలు..నర్స్ అంటే సేవ..సేవ అంటే నర్స్ అనేలా సేవలు చేసిన అసామాన్య సేవామూర్తి ఫ్లోరెన్స్ నైటింగేల్. నర్సుగా ఆమె చేసిన సేవలు ఆమెను ‘లేడి విత్ ది లాంప్’ గా పేరొందింది. 

యుద్ధంలో గాయపడిన సైనికులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలు..
ఫ్లోరెన్స్ నైటింగేల్ యుద్ధంలో దెబ్బ తిన్న సైనికులకు సేవలు చేసేది. ఆమె చేసిన సేవలతో మరణించే రోగుల సంఖ్య బాగా తగ్గింది. ప్రతి సైనికుడికి తాను బ్రతుకుతాను అన్న ఆశ చిగురించేది. గొప్పింటిలో పుట్టినా ఫ్లోరెన్స్ నైటింగేల్ కు రోగులకు సేవ చేయాలనే తప్పించిపోయేది. అందుకే నర్సింగ్ చేయడానికే నిశ్చయించుకుంది. అభివృద్ధి చెందిన దేశాలు ఆడవారి చిన్నచూపు చూడటంలో అతీతం కాదు. ఆడవాళ్లు ఇంటికే పరిమితం అనే రోజుల్లోనే కట్టుబాట్లను ఛేదించింది. పెళ్లికాని అమ్మాయిలు ఇంటి పనులు చేయాలనీ..లేదా చర్చిల్లో పనులే చేయాలనే రోజుల్లోనే  పనులే చేయాలనీ ఆరోజుల్లో ఫ్లోరెన్స్ నైటింగేల్ కట్టుబాట్లను లెక్కచేసేది కాదు. 
 
ఫ్లోరెన్స్ నైటింగేల్ మే 12 1820లో ఇటలీలో జన్మించింది. తల్లి నైటింగేల్ నీ స్మిత్. తండ్రి విలియం ఎడ్వర్డ్ అత్యంత శ్రీమంతుడు. ధనవంతురాలైనా..పేదలకు, అనాథలకు సేవ చేయాలన్న అభిలాష ఫ్లోరెన్స్ నైటింగేల్ తపించిపోయేది. కుటుంబంతోపాటు పలు ప్రాంతాలు తిరిగిన ఆమె ఆస్పత్రులు ఎంత అధ్వాన్న స్ధితిలో ఉన్నాయో గమనించింది. ఏమాత్రం శుభ్రత ఉండేవికావు. అయినాకూడా ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగు పని చేయడానికే నిర్ణయించుకుంది. ఫ్లోరెన్స్ నైటింగేల్ పెద్ద సాహితీవేత్త కావాలని తల్లి ఆశపడింది. కానీ ఆమె మాత్రం నర్సింగ్ అంటేనే ఇష్టపడింది. అదే చదివింది. 

కలరా రోగుల సేవల్లో ఫ్లోరెన్స్ నైటింగేల్
అలా 1852 లో ఐర్లాండ్ వెళ్ళింది. అక్కడి ఆసుపత్రులను చూడగానే చాలా మార్పులు తీసుకురావాలనుకుంది. 1853 లో సిస్టర్స్ ఆఫ్ చారిటికి వెళ్ళి..తిరిగి వృద్ధాప్యంలో ఉండే తన నాయనమ్మకు సేవ చేయటానికి లండన్ వచ్చింది. ఈ క్రమంలో కలరా వ్యాపించింది. వెంటనే ఆసుపత్రులకు వెళ్లి రోగులకు, పగలు, రాత్రి అనక సేవలు చేసేది.  రోగులకు మంచి ఆహారం అందించేది. 1854-56 లో క్రిమియాలో ఘోర యుద్ధం జరిగింది.  తోటి నర్సులను కూడగట్టుకొని యుద్ధంలో గాయాలైన సైనికులకు చిరునవ్వుతో ఎనలేని సేవలందించింది. వారికీ ధైర్యం చెప్పింది. ఎప్పుడూ చిరునవ్వుతో సేవలు చేసే ఆమెను చూసిన సైనికులు తాము త్వరగా కోలుకుంటామనే ధైర్యాన్ని పొందేవారు. కానీ ఆమెతో పాటు వచ్చిన సాటి నర్సులు ఏ పని దొరక్క ఈ పనికి వచ్చాం అనేకుంటూ విసుక్కునేవారు. 

సొంత డబ్బులతో సేవలు 
ఆమెనుచూసి అధికారులు కోపగించుకునేవారు. తరువాత ఆమె సేవలను అర్థం చేసుకున్నారు.రోగులకు అవసరమయ్యే కావాల్సిన మందులు పరికరాలను పంపమని అధికారులను  అభ్యర్ధించేది. చాల సార్లు తన స్వంత డబ్బుతోనే తెప్పించేది. ఆసుపత్రులలో చోటు సరిపోకపోతే, అధికారులను ఒప్పించి పాత ఇళ్ళను, భవంతులను ఆసుపత్రులుగా మార్చేది. పగలు రాత్రి తేడా లేకుండా సేవలు చేసేది. రోజుకు కేవలం మూడు గంటలే పడుకుని పని చేసి చేసి నీరసించిపోయేది. ఆమె సేవలు చూసినవారు ఆమెను ఓ దేవతలా భావించేవారు. రోగులు ఆమెను ఎంతగా ఆరాధించేవారు అంటే విక్టోరియా రాణి మరణిస్తే ఫ్లారెన్స్ ను రాణి చేస్తామని” అనేవారట.

ఫ్లోరెన్స్ నైటింగేల్‌ను అడవిపూలతో గౌరవించిన సైనికులు 
ఆమె ఎక్కడికి వెళ్ళినా సైనికులు అడవి పూలతో పుష్ప గుచ్చాలనిచ్చేవారట. అది చూసి తోటి డాక్టర్లు,నర్సులు ఈర్ష్య పడేవారట. సైనికులకు సేవలు చేసి చేసి ఆమెకు కూడా సైనికులకు వచ్చిన జ్వరమే వచ్చింది. దీంతో ఆమెను  కాసిల్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను చూసి మిగతా రోగులు, కన్నీరు కార్చారు. ఆమెకు వెంటనే బాగవ్వాలని ప్రార్థనలు చేసేవారు. కొద్దిగా కోలుకోగానే ఆమె తిరిగి క్రిమియా, స్కుటారి ఆసుపత్రుల మధ్య తిరుగుతూ రోగుల సేవల్లో మునిగిపోయింది. మీ కష్టార్జితాన్ని మద్యం తాగటానికి ఖర్చు పెట్టొద్దు..మీ ఇళ్ళకి డబ్బు పంపండి. అని సైనికులకు చెప్పేదట నైటింగేల్. ఆమె నోట్స్ఆన్ హాస్పిటల్స్, నోట్స్ ఆన్ నర్సింగ్, అనే గ్రంథాలను వ్రాయడమే కాకుండా, విక్టోరియా రాణికి, ప్రభుత్వ అధికారులకి హాస్పిటల్స్ బాగు కోసం ఎన్నో వినతిపత్రాలు పంపేది. 

‘మదర్ ఆఫ్ మోడరన్ నర్సింగ్’ గా గుర్తింపు
రోగులకు సేవలు ఎంత ఓర్పుగా చేయాలో నర్సులకు ట్రైనింగ్ ఇచ్చేది. 1860 జూన్ 24 న నైటింగేల్ ట్రైనింగ్ స్కూల్ ఫర్ నర్సేస్ అనే సంస్థను లండన్ లో స్థాపించారు. ఆమెను’ మదర్ ఆఫ్ మోడరన్ నర్సింగ్’ గా గుర్తించారు..

భారత్ లో ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలు  
ఆమె సేవలు భారత దేశానికి కూడా విస్తరించాయి. 1859 లో విక్టోరియా రాణి ఆరోగ్య సంస్కరణల కొరకు ఒక కమిషన్ను నియమించింది. చెన్నై నగరపు మేయర్ ఆడ నర్సులకు శిక్షణను ప్రోత్సహించారు. నగర పారిశుధ్యం మెరుగు పడేలా చేసింది.  ఫ్లారెన్స్ సలహాలతో భారత్ లో మరణాల రేటు తగ్గింది. 1910 ఆగస్ట్ 13 లో ఫ్లారెన్స్ మరణించిన, సేవా నిరతిగల ప్రతి నర్సు లోను ఆమె కలకాలం జీవించి ఉంటుంది. రోగుల పాలిన దేవత ఫ్లోరెన్స్ నైటింగేల్. 

1859లో ‘నోట్స్‌ ఆన్‌ నర్సింగ్‌’ అనే పుస్తకాన్ని ప్రచురించిన నైటింగేల్‌, ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణ కాలేజీని కూడా స్థాపించింది. నైటింగేల్‌ సేవలను గుర్తించిన ‘ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నర్సెస్‌’ సంస్థ 1965 నుండి నైటింగేల్‌ పుట్టినరోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు. అంతటి నిరుపమాన సేవానిరతికలిగిన ఫ్లోరెన్స్ నైటింగేల్ ను  లేడి విత్ ది లాంప్ గా పేరొందటం నర్సులంతా గర్వించాల్సిన విషయం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 

Read Here>> కరోనా కల్లోలంలో నర్సుల సేవలకు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్న ప్రపంచం