అదేపనిగా 2గంటలు కదలకుండా కూర్చుంటే.. గుండెకు ప్రమాదమే

అదేపనిగా 2గంటలు కదలకుండా కూర్చుంటే.. గుండెకు ప్రమాదమే

long hours sitting very dangerous to heart: ఇప్పుడు అందరి లైఫ్ స్టైల్ బాగా మారిపోయింది. శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. గ‌తి త‌ప్పిన ఇలాంటి జీవ‌న విధానం వ‌ల్ల ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు వస్తున్నాయి. ఈ రోజుల్లో ఏసీ రూముల్లో కూర్చుని చేసే ప‌నులు పెరిగిపోయాయి. చాలామంది కంప్యూట‌ర్ల ముందు కూర్చుని గంట‌ల త‌ర‌బ‌డి ప‌ని చేస్తూ ఉండిపోతారు. పని ఒత్తిడి కారణంగా వారు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.

అయితే, అలా ఒకేచోట కూర్చుని పనిచేసేవారు చాలాసేపు అలాగే కదలకుండా కూర్చుంటే వెన్ను, నడుము, మెడ నొప్పులు వస్తాయనే విషయం అందరికి తెలిసిందే. కానీ, ఇప్పుడు అంతకంటే భయపెట్టే విషయం మరొకటి ప‌రిశోధ‌నలో వెలుగుచూసింది. అదే పనిగా రెండు గంటల పాటు కదలకుండా కుర్చీలో కూర్చుంటే గుండె సంబంధ వ్యాధులు వచ్చే చాన్స్ ఉందని పరిశోధనలో తేలింది.

రోచెస్టర్, మిన్నెసోటాకు చెందిన మయో వైద్య పరిశోధక బృందం.. కూర్చుని ప‌నిచేసే వారిపై అధ్య‌య‌నం చేసి ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. దాదాపు రెండు గంటల పాటు లేవ‌కుండా కూర్చొని ఉండటం వల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని పరిశోధకులు చెప్పారు. కూర్చుని పనిచేసేవారు కనీసం రెండు గంటలకోసారి అయినా లేవకపోతే హృద్రోగాలు, ఆస్తమా, పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని తెలిపారు.

ఈ ప‌రిశోధ‌న‌లో భాగంగా 2వేల మందికి పైగా వ్యక్తులను ఆరోగ్య ప‌రిస్థితుల‌ను అధ్య‌యం చేశారు. అంతేకాదు మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా తిరిగి కుర్చీలో కూర్చోకుండా కాసేపు న‌డవాల‌ని పరిశోధకులు సూచించారు. మొత్తంగా, మ‌నం 20 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే ఎంత‌ ఆరోగ్యక‌రంగా త‌యారవుతామో రెండు గంటల పాటు లేవకుండా కూర్చొని ఉండటం వల్ల అంతటి న‌ష్టాన్ని కొని తెచ్చుకుంటామ‌ని పరిశోధకులు తేల్చారు.

సో, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కూర్చుని జాబ్ చేసే వారంతా అలర్ట్ అవ్వాలి. అదే పనిగా కదలకుండా కూర్చోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీ చేతులారా ప్రమాదంలోకి నెట్టేసినట్టు అవుతుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నా, కచ్చితంగా కుర్చీలోంచి లేవడం మర్చిపోకూడదు. అలాగే, రోజూ కొన్ని ఎక్సర్ సైజులు చేయాలి. వాకింగ్ ను జీవితంలో భాగంగా చేసుకోవాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంతో హ్యాపీగా జీవించగలమని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ సమయం కదలకుండా ఉండటం, శారీరక శ్రమ లేకుండా ఉన్నప్పుడూ ఊబకాయం(ఒబెసిటీ) ఎదురవుతుంది. దానివల్ల అనారోగ్య సమస్యలు తప్పవు. పైగా రోజులో ఎనిమిది గంటలకు పైగా కూర్చుని పనిచేసేవారి జీవితకాలం తగ్గుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ లెక్కన పొగతాగడం వల్ల మరణించేవారితో పోలిస్తే ఊబకాయుల్లోనే మరణ రేటు ఎక్కువని పరిశోధనలు తేల్చాయి.

ఎక్కువ సేపు కూర్చుంటే కలిగే ఆరోగ్య సమస్యలు:
* రక్తపోటు పెరుగుతుంది.
* నడుము, పొట్ట, తొడలు, పిరుదల దగ్గర కొవ్వు పేరుకుపోతుంది.
* చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగిపోతాయి.
* గుండె జబ్బులు, క్యాన్సర్‌ లాంటివి వచ్చే ప్రమాదముంది.
* జీవక్రియల వేగం మందగిస్తుంది.
* అలసట, బడలికలతో శరీరం నిస్సత్తువగా మారుతుంది.
* శరీరాకృతిలో కూడా స్పష్టమైన మార్పు వస్తుంది.
* నడుము, వెన్ను సమస్యలు బాధిస్తాయి.
* ఒంటరితనం, ఆందోళన వంటి మానసిక సమస్యలు దరి చేరతాయి.

ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసిన విషయమే. అందుకే ఎన్ని గంటలు పని చేయాల్సి ఉన్నా, ఏ పనిచేసినా….సరే! ఆ విషయాన్ని మరిచిపోవద్దు. మధ్యమధ్యలో లేచి నడవడం, చిన్న చిన్న స్ట్రెచెస్‌ చేయడం వంటివన్నీ బాధ్యతలా పెట్టుకోవాలి. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి పనితో పాటు చిన్న చిన్న వ్యాయామాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి.

కాసేపు నడిస్తే…
* గంటకోసారైనా కూర్చున్న చోటు నుంచి లేచి అటూ ఇటూ నాలుగడుగులు వేయాలి. ఇలా ఓ 5 నిమిషాల పాటు చేస్తే మేలు. అందుకోసమే ఈ మధ్య కొన్ని సంస్థలు స్టాండింగ్‌ డెస్క్‌లు రూపొందిస్తున్నాయి.
* ఇక ఫోను మాట్లాడేటప్పుడు సోఫాలోనో, కూర్చీలోనో కూర్చోవడం కంటే నడుస్తూ మాట్లాడటం మంచిది. టీ తాగాక, మధ్యాహ్నం భోజనం చేశాక, సాయంత్రం అల్పాహారం తీసుకున్నాక నేరుగా వచ్చి సీట్లో కూర్చోవద్దు. ఓ పది నిమిషాలైనా అటూ ఇటూ తిరగండి. దీనివల్ల జీర్ణశక్తి మందగించకుండా ఉంటుంది.
* ఇంట్లో ఉన్నా, ఆఫీసుకి వెళ్లినప్పుడైనా లిఫ్ట్‌కు బదులుగా మెట్లెక్కేయండి. అలానే బయట ఏ చిన్న పని ఉన్నా…బండిని వాడే బదులు నడిచి వెళ్లడానికే ప్రాధాన్యం ఇవ్వండి.

పనిచేసేటప్పుడు నడుస్తున్నాం కదా అని దానికే పరిమితం అవ్వొద్దు. కేవలం అరగంటో, గంటకోసారి అటూ ఇటూ నడవడం వల్ల పూర్తి ప్రయోజనం ఉండదు. మీ దినచర్యలో ఇతర పనుల మాదిరిగానే వ్యాయామానికి కనీసం ఓ అరగంటైనా సమయం కేటాయించుకోవాలి. అలాని జిమ్‌కే వెళ్లక్కర్లేదు. ముందు నడకతో మొదలుపెట్టండి. కాస్త అలవాటు అయ్యాక వ్యాయామాలు చేయొచ్చు.