గొడ్డళ్లు, కత్తులతో పార్థీ ముఠా అరాచకాలు : రుద్రాక్షలతో రెక్కీ..రాత్రిళ్లు చోరీలు..ఏడాదిలో 11 నెలలు దోపీడీలే..

గొడ్డళ్లు, కత్తులతో పార్థీ ముఠా అరాచకాలు : రుద్రాక్షలతో రెక్కీ..రాత్రిళ్లు చోరీలు..ఏడాదిలో 11 నెలలు దోపీడీలే..

Party gang thefts : మధ్యప్రదేశ్‌ కట్నీ జిల్లా పార్థీ ముఠా నేరాల గురించి వింటేనే వెన్నులో ఒణుకు పుడుతుంది. అర్థరాత్రి గొడ్డళ్లు, కత్తులతో విరుచుకుపడతారు. ఏడాదిలో 11 నెలలు దోపిడీలు చేయటమే ఈ పార్థీ ముఠా చేసే పనులు. మిగత నెల రోజులు ఏం చేస్తారనే కదూ..డౌటు? ఏడాదిలో 11 నెలలు దోపిడీలు చేసే పార్థీ ముఠా రాఖీ పండుగ 15 రోజులు అలాగే హోలి పండుగ 15 సందర్భంగా ఇంట్లోనే ఉంటారు. అలా మూడు నెలల్లో 20 దోపిడీలు చేస్తారు. అడ్డువస్తే ఏమాత్రం కనికరం లేకుండా అత్యంత కిరాతకంగా నరికిపారేస్తారు..ఈ పార్థీ ముఠా చేసే దారుణాలు గురించి తెలిస్తే ఒళ్లు గగ్గుర్పొడుస్తుంది..శివారు ప్రాంతాల్లో తాత్కాలిక గుడారాలు వేసుకుని పగలంతా రుద్రాక్ష మాలలు ధరించి రెక్కీలు చేయటం..అర్థరాత్రి విరుచుకుపడి దోపిడీలతో హడలెత్తించటం ఈ ముఠాప్రత్యేకత..

మధ్యప్రదేశ్‌కు కట్నీ జిల్లా ప్రాంతానికి చెందిన పార్థీ గ్యాంగ్‌ పేరు చెబితే ప్రజలకే కాదు పోలీసులకు కూడా భయపడాల్సిందే. సంవత్సరంలో 11 నెలలు చోరీలకు పాల్పడుతూనే ఉంటారు.. ఒక్క నెల మాత్రం నేరాలకు దూరంగా ఉంటారు..అది వారి సెంటిమెంట్. రాఖీ పౌర్ణమికి 15 రోజులు, హోలీ పండుగకు 15 రోజులు ఇంటి వద్దనే ఉంటారు. అస్సలు దొంగతనాలజోలికే వెళ్లరు. చాలా బుద్ధిగా ఉంటారు. మిగతా 11 నెలలు మాత్రం రెచ్చిపోతారు. ఈ ముఠాల చోరీలు ఒక్క మధ్యప్రదేశ్ లోనే కాదు..దేశంలోని అన్ని రాష్ర్టాల్లోని ప్రధాన నగరాల్లో వారి ప్రతాపం ఉంటుంది. నగర శివార్లలో తాత్కాలిక గుడారాలను వేసుకుని నివసిస్తుంటారు. రాత్రి వేళలో దొంగతనాలకు పాల్పడుతుంటారు.. అలా గత మూడు నెలలుగా దాదాపు 20 చోరీలకు పాల్పడ్డారని సైబరాబాద్‌ పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్ నగరంలో పార్థీ ముఠా హల్ చల్ ను పోలీసులు ఛేదించారు.

హైదరాబాద్ శివార్లలో కొంపల్లి-బొల్లారం రోడ్డులో మకాం..పలు ప్రాంతాల్లో చోరీలు
పార్థీ గ్యాంగ్‌.. దాదాపు 15 మంది కుటుంబ సభ్యులతో కలిసి నగర శివారు కొంపల్లి-బొల్లారం రోడ్డులో మకాం వేశారు. నిర్మానుష్య ప్రాంతంలో తాత్కాలిక గుడారాలు వేసుకుని అర్థరాత్రి సమయాల్లో గుడారాల నుంచి బయలుదేరి..అల్వాల్‌, పేట్‌ బషీరాబాద్‌, మేడ్చల్‌, దుండిగల్‌ తదితర ప్రాంతాల్లో 20 దోపిడీలు చేశారు. ఇలా నగరంలోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలు జరగటంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు.. రంగంలోకి దిగారు.

చోరీలు జరిగిన ప్రాంతాల్ని విశ్లేషించారు. అక్కడ జరిగిన నేరాల తీరును పరిశీలించారు. పలు ప్రాంతాల్లో జరిగిన చోరీలతో పోల్చారు. కానీ ఎక్కడ కూడా ఒక్క క్లూ దొరకలేదు. అదే పార్థీ గ్యాంగ్ స్లైల్..చివరకు హైదరాబాద్ పోలీసులు టెక్నాలజీ ఆధారంగా..తీగను లాగితే మధ్యప్రదేశ్‌ కట్నీ జిల్లా పార్థీ గ్యాంగ్‌గా తేలింది.

చోరీలకు పాల్పడేది 15 మంది ఉండగా… వారి కుటుంబ సభ్యులందరూ కలిపి దాదాపు 60 మంది నగర శివార్ల గుడారాలు వేసుకుని నగరం చీకటి పడే వేళవైపుగా ఎదురు చస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారని తేలింది. ఈ గ్యాంగ్‌లోని పురుషులు చోరీలు చేసి తెచ్చిన సొత్తును మహిళలు, చిన్న పిల్లలు దాచిపెడుతుంటారు. ఆ తరువాత ఆ సొత్తును మహారాష్ట్రలోని ఓ రిసీవర్‌కు ఈ బంగారం, వెండి ఆభరణాలను తరలించి అక్కడ అమ్మేసి అందరూ సమానంగా పంచుకుంటారు. అలా చోరీ చేయగా వచ్చిన సొత్తును డబ్బుగా మార్చుకుని జల్సా చేస్తుంటారని పోలీసుల విచారణలో తేలింది.

రుద్రాక్షలను పట్టుకుని రెక్కీ..రాత్రి వేళ్లల్లో చోరీలు
పార్థీ ముఠా ఎక్కడ చోరీ చేస్తే భారీగా సొత్తు దొరుకుతుందో తెలుసుకోవటానికి ఉదయాన్నే లేస్తారు.చక్కగా రుద్రాక్షలు అమ్మేవారిలా గెటప్ వేసుకుంటారు. నగరంలోకి వచ్చి గల్లీ గల్లీ తిరుగుతారు. కానీ ఎక్కడా రుద్రాక్షల్ని అమ్మరు. పోలీసుల దృష్టిని మళ్లించేందుకు రుద్రాక్షలు అమ్ముతున్నట్లుగా నటిస్తుంటారు. అలా రుద్రాక్షలు పట్టుకుని గల్లీ గల్లీ తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తారు. అలాగే అపార్ట్‌మెంట్లను గుర్తిస్తారు.

ఆ తరువాత చీకటి పడే వేళ్లలో వారు గుర్తించిన ఇళ్లలో చోరీలు చేయాలని నిర్ణయించుకుని పక్కాగా ప్లాన్ వేసుకుంటారు. ఏ ఇంటికి ఎలా వెళ్లాలి? ఎలా దోపిడీ చేయాలి? తరువాత సేఫ్ గా ఎలా వచ్చేయాలి? అని పక్కాగా ప్లాన్ వేసుకుంటారు. ఆ తర్వాత రాత్రి 1 గంట దాటిన తర్వాత పెద్ద కత్తులు, గొడ్డళ్లు తీసుకొని తాళాలను పగుల గొట్టి దొంగతనాలకు పాల్పడుతారు.

అదే అపార్ట్‌మెంట్‌లో ఫ్లోర్‌కు రెండు ఫ్లాట్‌లకు తాళాలు ఉంటే 15 మంది ఫ్లోర్‌లను పంచుకుని చోరీలకు తెగబడుతారు. ఎవరైనా చూసి వీరిని అడ్డుకునేందుకు యత్నిస్తే ఆయుధాలతో భయపెడతారు. అంతకూ వాళ్లు అడ్డుకున్నా..పోలీసులకు సమాచారం అందించాలని చూసినా..దాడి చేస్తున్నట్లు నటిస్తారు. అంతకూ వినకపోతే దాడిచేస్తారు. అలా ఈ ముఠా టార్గెట్‌ చేసిన ప్రాంతానికి 15 మంది గుంపుగా కలిసి వెళ్తారు. తెల్లవారు జాము 3 గంటల వరకు చోరీలను పూర్తి చేసుకుని..చక్కగా వాళ్ల నివాసాలుండే గుడారాలకు వచ్చేసి హాయిగా ఎండ ఎక్కేవరకూ పడుకుంటారు.

11 మంది అరెస్ట్‌.. పరారీలో నలుగురు..గాలిస్తున్న పోలీసులు
పార్థీ ముఠా తెలంగాణాలో ని ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌తో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాల్లో తమ పంజా విసిరారు. చివరకు సైబరాబాద్‌ పోలీసులు పక్కా ప్లాన్ లో చిక్కుకున్నారు. ఇటీవల పార్థీ ముఠాలోని 11 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ ముఠాలోని ప్రధాన సూత్రధారులు పరారీలో ఉన్నారు. ప్రధాన సూత్రధారులు బల్వ, ఠాకూర్‌, పెక్‌లోడ్‌, కలాంలు పోలీసులకు చిక్కారు. వీరి వయస్సు కేవలం 20 సంవత్సరాలే కావటం గమనించాల్సిన విషయం. ఇంత చిన్న వయస్సులోనే దోపిడీల్లో ఆరితేరిపోయారని పోలీసులు తెలిపారు.