ట్రాన్స్‌జెండర్లు నడిపే వాటర్ ప్లాంట్ : అవమానాల నుంచి సాధికారతవైపు అడుగులు

ట్రాన్స్‌జెండర్లు నడిపే వాటర్ ప్లాంట్ : అవమానాల నుంచి సాధికారతవైపు అడుగులు

‘Maha’Transgenders Water Plant : ట్రాన్స్‌జెండర్లంటే సమాజంలో చాలా చులకన భావం ఉంది. వీరిపట్ల ఇప్పుడిప్పుడే కాస్త మార్పు వస్తోందని చెప్పాలి. పలు రంగాల్లో ట్రాన్స్‌జెండర్లు ప్రతిభను కనబరుస్తున్నారు. అవమానాలను ఎదుర్కొని సాధికారతవైపు అడుగులు వేస్తున్నారు. దీనికి మరో ఉదాహరణగా నిలుస్తోంది మహారాష్ట్ర లోని వాఘోలి సమీపంలో ఒక వాటర్ ప్లాంట్. ఈ వాటర్ ప్లాంట్ ను ట్రాన్స్‌జెండర్లే నడుపుతున్నారు. ఈ ప్లాంట్ ప్రతిరోజూ 200 డబ్బాల నీటిని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని ద్వారా పూణే -అహ్మద్ నగర్ రోడ్ లో గల మల్టీనేషనల్ కంపెనీలకు నీటి సరఫరా చేయబడుతున్న ఆప్లాంట్ లో అంతా ట్రాన్స్ జెండర్లే కావటం విశేషం.

భారత ప్రభుత్వం మిషన్ పానీ కార్యక్రమంలో అన్ని వర్గాల వారు భాగస్వాములవుతున్నారు. దీంట్లో భాగంగానే..మహారాష్ట్ర లోని వాఘోలి సమీపంలో కైనర్ సర్వీసెస్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ తాగునీటి ప్లాంట్ ను ప్రారంభించింది. ఈ ప్లాంట్ లో ట్రాన్స్జండర్లను నియమించి వారితోనే నడిపిస్తోంది. ఈ ప్లాంట్ ని పూణేకి చెందిన ట్రాన్స్ జండర్స్ నడుపుతూ.. ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ట్రాన్స్జండర్స్ కు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడంతో పాటు, వారిని సరైన మార్గంలో నడపడటానికి ఈ ప్లాంట్ వేదికైంది.

కైనర్ సర్వీసెస్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ వాటర్ ప్లాంట్ ను పూణే-అహ్మద్‌నగర్ రహదారి పక్కనే ఏర్పాటు చేశారు. కైనర్ సర్వీసెస్ సంస్థను ప్రముఖ ట్రాన్స్జండర్ కార్యకర్త లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి నడుపుతున్నారు. ఈ ప్లాంటును నడపడానికి మమతా, రాణితై పటేల్ శక్తి,ప్రేర్నా అనే నలుగురు ట్రాన్స్జెండర్లను నియమించారు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి.

ట్రాన్స్జెండర్లను నియమించడంపై లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి మాట్లాడుతూ..సమాజంలో ట్రాన్స్జెండర్ల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతోంది. కానీ వారు కూడా అందరిలా గౌరవంగా బతకడానికి ఆశపడుతున్నారు. అటువంటివారి ఆశల్ని గౌరవించి ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే వారు మరోమార్గం వైపు ఆలోచించే అవకాశాలున్నాయి. ఇది సమాజానికి ఏమాత్రం మంచిదికాదు.

కాబట్టి వారికి ఉద్యోగం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే ఈ ప్లాంట్ ను ప్రారంభి..నలుగురు ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. మమతా అనే 33 ఏళ్ల ట్రాన్స్జెండర్ ను ఈ ఉద్యోగంలోకి తీసుకోవడంతో ఆమె జీవితమే మారిపోయింది. భిక్షాటన చేసే మమతా ఇప్పుడు ఆ పని మానేసింది.చక్కగా ఉద్యోగం చేసుకుంటోంది. తనలాంటివారికి ఆదర్శంగా నిలిచింది.

గత ఆగస్టు వరకు..మమతా ఇతర ట్రాన్స్‌జెండర్లతో కలిసి దుకాణాల వద్ద భిక్షాటన చేసేది. వివాహ కార్యక్రమాలలో డ్యాన్సులు చేసి డబ్బు సంపాదించేది. ఈ క్రమంలో మమత ఎన్నో అవమానాలకు గురైంది. కానీ ప్లాంట్ లో ఉద్యోగం దొరటంతో ఆమె ఇప్పుడు గౌరవంగా బతుకుతోంది. ఈ ఉద్యోగం ద్వారా ఆమె గౌరవంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ తనలాంటివారికి గౌరవంగా బతకటం పట్ల అవగాహన కల్పిస్తోందని తెలిపారు. మమత ప్లాంట్‌లో చేరిన తరువాత, సెక్యూరిటీ గార్డుల నుండి ఉన్నతాధికారుల వరకు అందరూ ఆమెను గౌరవిస్తున్నారని తెలిపారు.

ప్లాంట్ ను నడుపుతున్న మరో ట్రాన్స్ జెండర్ 37 ఏళ్ల రాణితై కామర్స్ గ్రాడ్యుయేట్. చదువయ్యాక కొంత కాలం మార్కెటింగ్ లో పనిచేసింది. ఆ ఉద్యోగం ఎంతో కాలం నిలవలేదు. ట్రాన్స్ జెండర్ కావటంతో ఉద్యోగం పోయింది. దీంతో..88 ఏళ్ల వయసున్న ఆమె తల్లిని చూసుకోవటం కష్టంగా మారింది. కైనర్ సర్వీసెస్ సంస్థ ఉద్యోగం కోసం ఆమెను సంప్రదించి ఉద్యోగం కల్పించారు. దీంతో ఆమె కూడా చక్కగా గౌరవంగా జీవిస్తూ..తన తల్లిని చక్కగా చూసుకుంటుంది.

ఇలా పలువురు ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగం కల్పించటంపై కైనర్ సర్వీసెస్ కోఆర్డినేటర్ మనీష్ జైన్ మాట్లాడుతూ..ఈ ప్లాంట్ పూర్తిగా ట్రాన్స్‌జెండర్లచే నడుపబడుతోంది. వారంతా ఈ ప్లాంట్ ద్వారా ఉపాధి పొందుతూ సమాజంలో గౌరవంగా జీవిస్తున్నారు. ట్రాన్స్జెండర్ ని ఈ ఉద్యోగాల్లోకి తీసుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ట్రాన్స్జెండర్స్ కు మరిన్ని అవకాశాలు కల్పించి, సమాజంలో లింగ వివక్ష పట్ల అంతరాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ దిశగా వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ ప్లాంట్ ను మరింత విస్తరించి మరికొంతమంది ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు కల్పించాలనుకుంటున్నామని..అన్నారు.