పోలీసుల వేధింపులు తట్టుకోలేక చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

  • Published By: bheemraj ,Published On : December 8, 2020 / 07:39 PM IST
పోలీసుల వేధింపులు తట్టుకోలేక చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

police harassment Man commits suicide : నిజామాబాద్ జిల్లా న్యావనందిలో విషాదం నెలకొంది. మూడు రోజుల క్రితం గంగాధర్ అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపుల వల్లే గంగాధర్ చనిపోయాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చేయని తప్పును ఒప్పుకోవాలని గంగాధర్‌ను పోలీసులు వేధించారని చెబుతున్నారు. మృతదేహాన్ని కిందకు కూడా దించకుండా మూడు రోజులుగా గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. అయినా కూడా.. ఇప్పటి వరకు పోలీసులు కానీ.. అధికారులు పట్టించుకోలేదు.



న్యావనందిలో అక్టోబర్ 3న వివాహిత మమత తన పొలం వద్ద దారుణ హత్యకు గురయ్యారు. ఆ కేసు విచారణ చేస్తున్న సమయంలో అనుమానితుడైన గంగాధర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈ విచారణలో పోలీసులు తీవ్రంగా కొట్టారని, వారి వేధింపుల కారణంగానే తన భర్త ఉరి వేసుకున్నారని మృతుని భార్య ఆరోపిస్తోంది.



పోలీసుల వేధింపుల వల్లే గంగాధర్ ఆదివారం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులను గ్రామస్తులు, కుటుంబీకులు అడ్డుకుని వారితో చర్చలు జరుపకుండా వెనక్కి పంపారు.

ఈ రోజు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేస్తున్నామని డీఐజీ ప్రకటించడంతో ఘటనాస్థలానికి అడిషనల్ డీసీపీ విశ్వనాథ్ చేరుకుని గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు.



మమతను హత్య చేసిన నిందితుడిని పట్టుకోవాలి, గంగాధర్ ను వేధించి తీవ్రంగా కొట్టిన వారిని సస్పెండ్ చేయాలి, మృతుని కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియాతోపాటు అతని కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అక్కడి నుంచి శవాన్ని తీయనీయకుండా ఆర్డీవో ను కూడా అడ్డుకున్నారు. చివరకు చర్చలు సఫలం కావడంతో పోలీసుల సమక్షంలో మృతుడి శవాన్ని చెట్టుపై నుంచి కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.