Marriage : రెండో పెళ్లి కోసం అద్భుతమైన కట్టుకథ అల్లాడు

రెండోపెళ్లి కోసం ఓ వ్యక్తి అద్భుతమైన కట్టుకథ అల్లాడు. తనకు కవల సోదరుడు ఉన్నాడని.. అతడు అచ్చం తనలాగే ఉంటాడని కట్టుకథ అల్లాడు

Marriage : రెండో పెళ్లి కోసం అద్భుతమైన కట్టుకథ అల్లాడు

Marriage

Marriage : తన తోటి ఉద్యోగినిపై మనసుపారేసుకొని.. తనకు పెళ్లైందనే విషయం దాచి ఆమెను రెండోపెళ్లి చేసుకున్నాడో వ్యక్తి. ఇందుకోసం అద్భుతమైన స్టోరీ అల్లాడు. ఇదివరకే పెళ్లైందన్న విషయం దాచి, తనకు అచ్ఛం తనలాంటి కవల సోదరుడు ఉన్నాడని.. రెండవ భార్యకు అబద్దం చెప్పాడు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చెన్నై, అరుంబాక్కానికి చెందిన వాల్లాండర్‌ బెన్నెట్‌ రెయాన్‌ ఓ కంపెనీలో పని చేస్తున్నాడు.

అదే కంపెనీలో పనిచేసే 21 ఏళ్ల యువతితో అతనికి పరిచయం ఏర్పడింది.. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. మాయమాటలు చెప్పి ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో కట్నంగా రూ.3.5 లక్షలు ఇచ్చారు. అయితే రెయాన్‌ స్నేహితులు అతడికి ఇంతకు ముందే పెళ్లి అయిందని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని సదరు యువతికి తెలిపారు. దీంతో ఆమె రెయాన్‌ ను నిలదీసింది. దొరికిపోయానని అనుకున్న రెయాన్ కట్టుకథ అల్లాడు.

తనకు అచ్చం తనలాంటి కవల సోదరుడు ఉన్నాడని.. అతడు దుబాయ్ లో ఉంటాడని తెలిపారు. నకిలీ ఓటర్‌ ఐడీ, ఆధార్‌, బర్త్‌ సర్టిఫికేట్‌ను సృష్టించి ఇవి తన తమ్ముడివని మాయమాటలు చెప్పాడు. అయితే కొద్దిరోజుల తర్వాత అమ్మాయి బంధువు ఒకరు మరోసారి రెయాన్‌ పెళ్లి గురించి చెప్పారు. ఈ సారి ఆమె కట్నం డబ్బులు వెనక్కు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. దీంతో కోపగించిన అతడు యాసిడ్‌ దాడి చేస్తానని బెదిరించాడు. ఆమె పోలీస్‌ స్టేషన్‌లో అతడిపై, అతడి తల్లి సెలినా రెయాన్‌పై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.