ప్రాణం తీసిన కోడి పందెం.. మర్మాంగాలకు తగిలి మరణం

ప్రాణం తీసిన కోడి పందెం.. మర్మాంగాలకు తగిలి మరణం

man stabbed to death with cock knife: సరదా కోసం ఆడే కోడి పందెం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఊహించని విధంగా జరిగిన ఘటనతో ఓ నిండు ప్రాణం బలైంది. కోడి పుంజు కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. కోడి పందేలు ఆడటానికి కోడి కాలికి కత్తి కట్టగా.. అనుకోకుండా కోడి జంప్ చేసింది. దీంతో మర్మాంగాలకు కత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి చెందాడు.

జగిత్యాల జిల్లా గొల్లపల్లి పరిధిలోని లొత్తునూర్ శివారులో కోడి పందేలకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు తరలివచ్చారు. వెల్గటూరు మండలం కొండాపూర్ కు చెందిన తనుగుల సతీష్(45) తాను పెంచుకుంటున్న కోడితో అక్కడికి వచ్చాడు. సతీష్ తన కోడిని పందేనికి రెడీ చేసేందుకు దాని కాలికి కత్తి కట్టాడు. ఓ చోట కూర్చుని కోడిని కాళ్ల మధ్యలో పెట్టుకుని కాళ్లకు కోడికత్తులను కట్టేందుకు యత్నించాడు. ఓ కాలికి కత్తిని కట్టాడు. రెండో కాలికి కట్టేందుకు ట్రై చేస్తుండగా, కోడి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కోడిని గట్టిగా పట్టుకునేందుకు సతీష్ ప్రయత్నించాడు. అయితే ఆ కోడి తప్పించుకునే క్రమంలో అప్పటికే దాని కాలికి కట్టిన కత్తి సతీష్ మర్మాంగానికి తగిలింది.

దీంతో అతడి పురుషాంగం, వృషణాలు బాగా దెబ్బతిన్నాయి. తీవ్ర గాయాలతో సతీష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వారు వెంటనే అతడిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకపోయింది. మార్గంమధ్యలోనే సతీష్ మరణించాడు.