Mirabai Chanu : ఒలింపిక్స్ పతకం సాధించిన మీరాకు రూ.కోటి నజరానా ప్రకటించిన సీఎం

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు పతకాల బోణీ చేసిన మణిపూర్ మణిపూస మీరాబాయి చానుపై యావత్ దేశం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దేశ ప్రధాని మోదీ సైతం చానుని ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ చానుకి భారీ నజరానా ప్రకటించారు.

Mirabai Chanu : ఒలింపిక్స్ పతకం సాధించిన మీరాకు రూ.కోటి నజరానా ప్రకటించిన సీఎం

Mirabai

Mirabai Chanu : టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు పతకాల బోణీ చేసిన మణిపూర్ మణిపూస మీరాబాయి చానుపై యావత్ దేశం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దేశ ప్రధాని మోదీ సైతం చానుని ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ చానుకి భారీ నజరానా ప్రకటించారు. దేశ, రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తూ వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో రజతం(సిల్వర్ మెడల్) గెలిచిన మీరాబాయి చానుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.1 కోటి అందించనున్నట్టు తెలిపారు.

ఈశాన్య రాష్ట్రాల సీఎంల సమావేశం జరుగుతుండగా చాను పతకం నెగ్గిందన్న సమాచారం అందిందని సీఎం బీరేన్ వెల్లడించారు. ఇదే విషయాన్ని ఆయన చానుకు స్వయంగా ఫోన్ చేసి వివరించారు. మిగతా రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఈ వార్త తమకు ఎంతో ఆనందం కలిగించిందని ఆమెకు చెప్పారు.

“ఇకపై నువ్వు రైల్వే స్టేషన్ల దగ్గర టికెట్ కలెక్టర్ గా పనిచేయాల్సిన అవసరం లేదు… నీ కోసం ప్రత్యేక ఉద్యోగం సిద్ధం చేసి ఉంచాం. హోంమంత్రితో సమావేశం అనంతరం నిన్ను ఆశ్చర్యపరిచే అంశం వెల్లడిస్తాం” అని చానుకు వివరించారు. 49 కేజీల స్నాచ్ అండ్ క్లీన్ జెర్క్ విభాగంలో చాను రజతం గెలవడంతో దేశవ్యాప్తంగా సంతోషం వెల్లివిరుస్తోంది. తన ప్రదర్శన పట్ల చాను ట్విట్టర్ లో స్పందించింది. తన కల నిజమైనట్టుగా ఉందంది. ఈ రజత పతకాన్ని దేశానికి అంకితం ఇస్తున్నానని తెలిపింది. ఈ పోటీల్లో స్వర్ణం సాధించేందుకు చివరి వరకు ప్రయత్నించానని, కానీ రజత పతకం కూడా విలువైనదేనని చాను చెప్పింది.

ఐదేళ్ల తన కృషి ఫలించినందుకు గర్వంగా ఉందని తెలిపింది. తాను కేవలం మణిపూర్ అమ్మాయిని కాదని, యావత్ భారతావనికి చెందుతానని మీరాబాయి చాను అంది. తన ప్రస్థానంలో వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించింది. ముఖ్యంగా తన తల్లికి రుణపడి ఉంటానని, ఆమె తన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని కొనియాడింది.

వెయిట్ లిఫ్టింగ్‌లో ఒలింపిక్ క్రీడల చరిత్రలో రెండవ పతకాన్ని మీరాబాయి చాను భారత్‌కు ఇచ్చింది. వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన తొలి మహిళా క్రీడాకారిణి మాత్రం మీరాబాయే. ఈ ఏడాది ఫస్ట్ ఒలింపిక్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది చాను. ఒలింపిక్స్ రెండవ రోజునే, భారతదేశం పతకాల జాబితాలో తన ఖాతాను తెరవగలిగింది.