మర్కుక్ పంప్ హౌస్ ప్రారంభం..పూజలు చేసిన సీఎం కేసీఆర్..చిన జీయర్ 

  • Published By: madhu ,Published On : May 29, 2020 / 05:28 AM IST
మర్కుక్ పంప్ హౌస్ ప్రారంభం..పూజలు చేసిన సీఎం కేసీఆర్..చిన జీయర్ 

తెలంగాణలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయ్యింది.. ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లు చేరాయి. గోదారమ్మ వందల కిలోమీటర్లు ప్రయాణించి సాగుభూములను సస్యశ్యామలం చేసేందుకు కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేరుకుంది. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో… సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన రిజర్వాయర్‌ను సీఎం కేసీఆర్, త్రిదండి చిన జీయర్ స్వామిలు ప్రారంభించారు. 

2020, మే 29వ తేదీ శుక్రవారం ఈరోజు ఉదయం 7గంటల 45నిమిషాలకు కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌తో పాటు.. మంత్రులు హరీశ్‌ రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌ కూడా కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. 

కొండ పోచమ్మ ఆలయం వద్ద.. గోపూజ నిర్వహించిన కేసీఆర్ దంపతులు.. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన చండీ యాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ దంపతులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి.. వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. కొండపోచమ్మ ఆలయం వద్ద పూర్ణాహుతి అనంతరం సీఎం కేసీఆర్‌ దంపతులు తమ వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరారు. 

వ్యవసాయ క్షేత్రం నుంచి.. మర్కుక్ పంప్‌హౌస్‌ చేరుకున్న ముఖ్యమంత్రి… అక్కడికి హెలికాప్టర్‌లో చేరుకునే చిన్నజీయర్ స్వామిని ఆహ్వానించారు. ఆ తర్వాత మర్కుక్‌ పంప్‌హౌజ్‌ వద్ద జరిగే సుదర్శనహోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పంప్‌ హౌస్ స్విచ్‌ ఆన్‌ చేసి రిజర్వాయర్‌ ప్రారంభించారు. మర్కుక్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోసేందుకు 34 మెగావాట్ల సామర్ధ్యంగల 6 మోటార్లు బిగించారు. తుక్కాపూర్‌లో 2 పంపులు, అక్కారంలో 2 పంపులు, మర్కూక్‌లో 2 పంపులు ఏకకాలంలో నడిచేలా కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అధికారులు ఏర్పాట్లుచేశారు. ఒక్కోమోటరు 1250క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తాయి. 

పంప్‌హౌజ్‌ ప్రారంభోత్సవం తర్వాత చిన్నజీయర్‌ స్వామితో కలిసి కొండపోచమ్మ సాగర్‌ కట్ట మీద డెలివరీ సిస్టమ్‌ దగ్గరకు చేరుకోనున్న ముఖ్యమంత్రి… 11గంటల 35 నిమిషాలకు డెలివరీ సిస్టమ్‌ దగ్గర గోదావరి జలాలకు స్వాగతం పలుకుతారు. అక్కడ నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి వరదరాజుపూర్‌ గ్రామంలోని వరద రాజేశ్వరస్వామి దేవాలయానికి వెళ్తారు. 12 గంటల 40నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి మర్కుక్‌ పంప్‌ హౌస్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్‌ అధికారులతో సమావేశమవుతారు. 

ఐదు జిల్లాల వరప్రదాయిని కొండపోచమ్మ రిజర్వాయర్‌. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని సాగు, తాగునీటి అవసరాలను ఈ రిజర్వాయర్‌ తీర్చనుంది. ఐదుజిల్లాలో మొత్తం 2లక్షల 85 వేల 280 ఎకరాలకు సాగునీరు అందనున్నది. 15.8 కిలోమీటర్లు వలయాకారంలో చేపట్టిన ఈ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తిచేశారు. రిజర్వాయర్‌కు మూడు ప్రధాన స్లూయిస్‌ గేట్లు ఉన్నాయి. సంగారెడ్డి కెనాల్‌ నుంచి సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాలకు నీటిని పంపిస్తారు. జగదేవ్‌పూర్‌ కెనాల్‌ నుంచి యాదాద్రి జిల్లాకు నీటిని అందిస్తారు.

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట దగ్గర నిర్మిస్తున్న కేశవపూర్‌ రిజర్వాయర్‌తో జంటనగరాలకు తాగునీరు అందనుంది. 557 మీటర్ల ఎత్తులోని రంగనాయక్‌సాగర్‌ నుంచి తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌ ఆ తర్వాత అక్కారం, మర్కూక్‌ పంప్‌హౌజ్‌లలో ఎత్తిపోయడంతో గోదావరి జలాలు 618 మీటర్ల ఎత్తులోని 15 టీఎంసీల సామర్థ్యమున్న కొండపోచమ్మకు చేరుకుంటాయి. లక్ష్మీ బ్యారేజ్‌ నుంచి సుమారు  214 కిలోమీటర్లు ప్రవహించి ప్రాజెక్టులోనే అత్యంత ఎత్తుకు చేరుకుంటాయి. 

Read: శిఖరాగ్రానికి గోదావరి : కొండపోచమ్మ ఆలయంలో CM KCR దంపతులు