కరోనా కల్లోలంలో నర్సుల సేవలకు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్న ప్రపంచం  

  • Published By: nagamani ,Published On : May 12, 2020 / 06:43 AM IST
కరోనా కల్లోలంలో నర్సుల సేవలకు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్న ప్రపంచం  

వైద్యోనారాయణ హరి అన్నారు పెద్దలు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వైద్యుడి రూపం అని. వైద్య సేవలు అందించేవారిలో నర్సులకు అత్యంత కీలక పాత్ర. డాక్టర్లకు ఏమాత్రం తీసిపోని సేవలు..రోగి మంచి చెడ్డలు చూసుకోవటమేకాదు..కన్న తల్లిలా చూసుకునే నర్సులు కన్నతల్లిలా ఆదరించి అక్కున చేర్చుకోవటం వారి ప్రత్యేకత. కేవలం వృత్తిపరంగానే కాక.. రోగుల్లో మానసిక ధైర్యాన్ని నింపుతారు. ఆదరంగా మాట్లాడి ఆత్మీయుల్లా సేవలు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తు కల్లోలం సృష్టిస్తున్న ఈ అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా నర్సులు చేస్తున్న సేవలకు జగతి మొత్తం శిరస్సు వంచి ప్రణామం చేస్తోంది.  

మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఇంకా మందు రాని కరోనావైరస్‌పై ఆయుధం లేకుండా పోరాటం కొనసాగిస్తున్నారు ప్రపంచంలోనే నర్సులు. వారి సేవలకు యావత్తు ప్రపంచం శిరసు వంచి ప్రణమిల్లుతోంది. కరోనా రోగులకు వైద్యం చేస్తున్న సేవల్లో భాగంగా ఎంతోమంది నర్సులు ఈ మహహ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలో వారి పేరు సువర్ణాక్షరాలతో లిఖించినా వారి చేసిన సేవల ముందు తక్కువ అనక తప్పదు. ప్రాణాలకు పణంగా పెట్టి వారు చేసిన సేవలు అసమాన్యం..అనితరసాధ్యం,అనిర్వచనీయం, అభినందనీయం.

మానవ సేవే మాధవ సేవగా భావిస్తు రోగులకు సేవలు చేస్తున్న నర్సులు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కల్లోలాన్ని సృష్టిస్తూనే ఉంది. కరోనా పేరు చెబితే రక్తసంబంధీకులు కూడా అల్లంత దూరం పారిపోతున్నారు. కానీ కరోనా సొకినవారికి దగ్గరుండే అన్నీ తామే అయి చూసుకుంటూ సేవలు చేస్తున్నారు నర్సులు. కరోనా రక్కసి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న బాధితులకు నర్సులు అందిస్తున్న సేవలు ఎనలేనివి.

నర్సులు చేసే సేవలకు కుల-మతాలు తేడాలు లేవు. పేద-ధనిక తేడాలు కూడా లేవు. సేవే వారి ధర్మం.  రోగం ఏదైనా సేవల చేసేందుకు మేమున్నామంటున్నారు. సేవల్లో భాగంగా..రోగులను ఆత్మీయంగా పలకరిస్తూ, సపర్యలు చేస్తూ, వారికి సమయానికి తగ్గట్టు మందులు ఇస్తూ వారు అందిస్తున్న సేవ నిజంగా కొనియాడదగింది. హాస్పిటల్ లో నర్సులు లేనిదే ఎటువంటి వైద్య సేవలు జరగవు అంటే వారు చేసే సేవలు ఎటువంటివో ఊహించుకోవచ్చు. తల్లి లేని ఇల్లు..నర్సులు లేని హాస్పిటల్ లను ఊహించుకోగలమా? 

కరోనా మహమ్మారి పంజా విసురుతున్నా, తమకు కరోనా సోకే ప్రమాదం ఉందని తెలిసినా వారి సేవా ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలని మహోన్నత సేవామూర్తులు నర్సులు. నర్సులు కాదు నర్సు అమ్మలకు ప్రపంచం అంతా చెబుతోంది హ్యాట్సాఫ్. 

Read Here>> 9నెలల నిండు గర్భిణీతో ఉన్నా..సేవలు మానని నర్సుకు హ్యాట్సాఫ్