Kanika Tekriwal : ఎవరీ కనికా టేక్రివాల్? రూ.400 కోట్ల విలువ చేసే విమానయాన సంస్థకు యజమాని ఎలా అయ్యింది?

ఎవరీ కనికా టేక్రివాల్? జెట్ సెట్ గో ను ఎప్పుడు స్థాపించింది? ఏ విధంగా ఆమె సక్సెస్ అయ్యింది? ఆమె లైఫ్ జర్నీ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది.

Kanika Tekriwal : ఎవరీ కనికా టేక్రివాల్? రూ.400 కోట్ల విలువ చేసే విమానయాన సంస్థకు యజమాని ఎలా అయ్యింది?

Kanika Tekriwal : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాఫ్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్ విమానాల్లో డబ్బు తరలించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఈసారి కనికా టేక్రివాల్ అనే మహిళ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కనికా టేక్రివాల్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి భార్య. ఈమెకు జెట్‌ సెట్ గో పేరుతో ప్రైవేట్ చార్టర్డ్ విమానాలు అద్దెకు ఇచ్చే కంపెనీ ఉంది. ఏపీతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా అద్దెకు తీసుకునే విమానాలు, చార్టర్డ్ ఫ్లైట్లు ఈ కంపెనీనే సమకూరుస్తుందని తెలుస్తోంది.

ఈ స్కామ్ కి సంబంధించి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ద్వారా కీలక సమాచారం సేకరించింది ఈడీ. శరత్ చంద్రా రెడ్డి భార్య కనికా టేక్రివాల్ కి చెందిన జెట్ సెట్ గో విమానాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డబ్బును హైదరాబాద్ కు తరలించినట్లుగా గుర్తించింది ఈడీ. దీంతో జెట్ సెట్ గో విమాన సర్వీసులు, అందులో ప్రయాణించిన వారిపై ఈడీ నజర్ పెట్టింది. ఆ వివరాలు సేకరించే పనిలో పడింది.

ఈ క్రమంలో కనికా టేక్రివాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎవరీ కనికా టేక్రివాల్? జెట్ సెట్ గో ను ఎప్పుడు స్థాపించింది? ఏ విధంగా ఆమె సక్సెస్ అయ్యింది? ఆమె లైఫ్ జర్నీ ఏంటి? అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.

కలలు కనడమే కాదు వాటిని సాకారం చేసుకునే సత్తా కూడా ఉండాలి. అది కొందరికే సాధ్యం. అలాంటి కోవకే వస్తారు భోపాల్‌కు చెందిన కనికా టేక్రివాల్‌. 33ఏళ్ల వయసుకే 10 చార్టర్డ్‌ ఫ్లయిట్స్‌కు ఆమె ఓనర్ అయ్యారు. పదేళ్ల క్రితం ఆమె స్థాపించిన ‘జెట్‌సెట్‌గో (JetSetGo)’ విమానయాన సంస్థ నికర విలువ రూ. 420 కోట్లు. ఓ సంస్థ విడుదల చేసిన ‘దేశంలోనే అత్యంత సంపద కలిగిన 100 మంది మహిళల జాబితా’లో అతిపిన్న వయస్కురాలిగా నిలిచింది టేక్రివాల్.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పురుషుల ఆధిక్యం ఉండే ఆటోమొబైల్‌ రంగంలో సత్తా చాటింది కనికా. నిండా పాతికేళ్లు కూడా లేని ఆమె సొంతంగా ఓ సంస్థను స్థాపించింది. అది కూడా విమానయానానికి సంబంధించి. పదేళ్ల క్రితం ఆమె చేసిన ప్రయత్నం ఏవియేషన్‌ రంగంలో కొత్త మార్పునకు శ్రీకారం చుట్టింది. మనకు ఆటోనో, కారో అవసరమైనప్పుడు ఉబెర్‌, ఓలా ఎలా బుక్‌ చేసుకుంటామో అచ్చం అలాగే చార్టర్డ్‌ ఫ్లయిట్లనూ నడపగలిగితే బాగుంటుందన్నది ఆమె ఆలోచన. సులభంగా బుక్‌ చేసు కోవడానికి వీలుగా.. వెబ్‌సైట్‌, యాప్‌ రూపొందించింది. ‘జెట్‌సెట్‌గో’ అనే సంస్థను నెలకొల్పింది.

ఈ సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎక్కడి నుంచి ఎక్కడికెళ్లాలి? ఎంతమంది వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి? తదితర వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది. ఆ సమయంలో ఏయే చార్టర్డ్‌ ఫ్లయిట్లు అందుబాటులో ఉన్నాయో, చార్జీలు ఎంతో తెలిసిపోతుంది. బుక్‌ చేసుకోవడమే ఆలస్యం. జెట్‌సెట్‌గో విమానయాన రంగంలోకి అడుగుపెట్టక ముందు పరిస్థితి ఇలా ఉండేది కాదు. సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు.. ప్రత్యేకంగా ఫ్లయిట్‌ బుక్‌ చేసుకోవాలంటే దళారులను ఆశ్రయించాల్సి వచ్చేది.

ముంబైలో విజువల్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసేప్పుడూ, ఆ తర్వాత యూకేలో ఎంబీఏ చదివేప్పుడూ కొన్ని విమానయాన సంస్థలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో పనిచేశారు కనిక. ఆ సమయంలోనే సాంకేతిక అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేశారు. అదే సమయంలో ఆమె క్యాన్సర్‌ బారినపడ్డారు. దాని నుంచి కోలుకోవడానికి ఏడాదికి పైగా పట్టింది. అలా 2012లో 5వేల 600 రూపాయల పెట్టుబడి పెట్టి ఉబెర్‌, ఓలా తరహాలో చార్టర్డ్‌ ఫ్లయిట్లను బుక్‌ చేసుకునేందుకు ఒక యాప్‌ను డెవలప్‌ చేయించుకున్నారు.

సొంత నిధులతో రెండేళ్లు సంస్థను నడిపించారు. తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్న చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సుధీర్‌ పెర్లా ఈ సంస్థలో భాగస్వామిగా మారారు. ప్రస్తుతం సంస్థ దగ్గర పది ఫ్లయిట్లు ఉన్నాయి. ఢిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరు తదితర నగరాల్లో ఆఫీసులున్నాయి.