నువ్వు నాలోనే ఉన్నావు చిరు.. కంటతడి పెట్టిస్తున్న మేఘనా రాజ్ పోస్ట్..

తన భర్తకు కన్నీటి వీడ్కోలు పలుకుతూ మేఘనా రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది..

  • Published By: sekhar ,Published On : June 18, 2020 / 11:06 AM IST
నువ్వు నాలోనే ఉన్నావు చిరు.. కంటతడి పెట్టిస్తున్న మేఘనా రాజ్ పోస్ట్..

తన భర్తకు కన్నీటి వీడ్కోలు పలుకుతూ మేఘనా రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది..

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, పాపులర్ కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భార్య మేఘనా రాజ్, ఆమె తల్లిదండ్రులు కూడా చిత్ర పరిశ్రమకు చెందిన వారే. మేఘనా రాజ్ తెలుగులో ‘బెండు అప్పారావు R.M.P’, ‘లక్కీ’ సినిమాలు చేసింది. పదేళ్ల రిలేషన్ తర్వాత 2018 మే 2న ఆమె చిరంజీవి సర్జాను పెళ్లాడింది. రెండేళ్లకే భర్తను కోల్పోయిన మేఘనా రాజ్ తాజాగా తన భర్తను తలచుకుంటూ ఓ భావోద్వేగ లేఖను ట్వీట్ చేసింది. ఇందులో ఆమె చెప్పిన ప్రతి మాట చేర్చిన ప్రతి అక్షరం కూడా నిజంగా చిరంజీవి సర్జాకు కన్నీటి వీడ్కోలు‌లా ఉంది. చదివే వారిచేత కంటతడి పెట్టిస్తోంది. చిరంజీవి సర్జాను తను ఎంతగా ప్రేమించిందో, ఏం కోల్పోయిందో, ఏం పొందబోతోందో కూడా ఆమె ఈ లేఖలో తెలియజేసింది.

Chiranjeevi Sarja, Meghana Raj

‘‘చిరు.. నీకు ఎన్నో విషయాలను చెప్పాలని ఉంది. కానీ ఎలా చెప్పాలో ఎంత ప్రయత్నించినా తెలియడం లేదు. నువ్వు నాకు ఎంత ముఖ్యమో ఈ ప్రపంచంలో దేనితో వర్ణించలేను. ఫ్రెండ్‌వి, ప్రేమికుడివి, జీవిత భాగస్వామివి, నాకు చంటి పిల్లాడివి, నా ధైర్యానివి.. ఇలా ఏదని చెప్పను?. వీటన్నింటి కంటే నువ్వు నాకు ఎక్కువే. నువ్వే నా ప్రాణం. కానీ ఏదో బాధ అర్థం కావడం లేదు కానీ ప్రతీక్షణం నన్ను కృంగదీస్తోంది. నువ్వు లేవని తలుచుకుంటేనే చిత్రవధలా ఉంది. వేల రెట్లు నరకం అనుభవిస్తున్నంత బాధగా ఉంది. నా చుట్టూ ఏదో వలయం అల్లుకున్నట్లుంది. నేను బాధపడుతున్న పతిసారి నువ్వు నా చుట్టూనే ఉన్నావనే ఫీలింగ్ కలుగుతుంది.. నన్ను ఎంతగానో ప్రేమించాను అన్నావు. ఎప్పటికీ నా చేయి వదలనంటూ మాటిచ్చావు. కానీ ఇలా చేశావేంటి?

Chiranjeevi Sarja, Meghana Raj

అయినా మన ప్రేమకు చిహ్నంగా నాకో చిన్నారిని ఇస్తున్నందుకు జీవితాంతం నీకు కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటాను. నా నుంచే మళ్లీ నిన్ను భూమిపైకి తీసుకువచ్చేందుకు ఎంతో ఎదురుచూస్తున్నాను. మళ్లీ నీ తోడు ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని తహతహలాడుతున్నాను. నీ నవ్వు కోసం, ఆ నవ్వులతో విరజిమ్మే కాంతుల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. నేను నీకోసం, నువ్వు నాకోసం ఎదురుచూస్తూనే ఉంటాం. నీవు చనిపోయావని అనుకోవడం లేదు. నా ఊపిరి ఉన్నంత వరకు నీవు బతికే ఉంటావు. ఎందుకంటే నువ్వు నాలోనే ఉన్నావు. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను..’’ అని మేఘనా రాజ్ తన ట్వీట్‌లో పేర్కొంది. ఈ ట్వీట్ చదివిన నెటిజన్లు చిరంజీవి సర్జాకు నివాళులర్పిస్తూ తమ సంతాపం తెలియచేస్తున్నారు.