ఆయన సర్పంచ్‌గా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

ఆయన సర్పంచ్‌గా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

minister kodali nani to leave politics: ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయాలను వేడెక్కించాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో లోకల్ వార్ మరింత రసవత్తరంగా మారింది. మరీ ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి కొడాలి నాని తన మాటలతో మంట పుట్టిస్తున్నారు. వరుసగా చాలెంజ్ లు విసురుతున్నారు. టీడీపీ నేత నారా లోకేష్ సర్పంచ్ గా గెలిస్తే ఈ రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని సవాల్ చేసిన కొడాలి నాని, ఈసారి ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మరింత వేడి పెంచారు.

రెండో ద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. మొత్తం 3వేల 327 గ్రామాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ మ‌ద్ద‌తుదారులు 2,635 గ్రామాల‌ను గెలుచుకున్నారు. ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ కేవ‌లం 558 స్థానాల‌తో స‌రిపెట్టుకుంది. వాస్తవానికి ఈ ఫ‌లితాలతో తెలుగుదేశం శ్రేణులు బాధ‌లో ఉండాలి. కానీ, టీడీపీ శ్రేణులు ఖుషిగా ఉన్నాయి. మంత్రి కొడాలి నాని స్వ‌గ్రామంలో టీడీపీ మద్దతుదారులు గెలవ‌డ‌మే ఇందుకు కార‌ణం.

టీడీపీ శ్రేణులు మిగ‌తా ఫ‌లితాల‌ను ప‌క్క‌న‌పెట్టి కొడాలి నాని స్వ‌గ్రామంలో వైసీపీ ఓడింద‌ని, కొడాలికి షాక్ అని అంటున్నాయి. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం య‌ల‌మ‌ర్రు గ్రామంలో వైసీపీపై టీడీపీ అభ్య‌ర్థి గెలిచార‌ని, ఇది కొడాలి నాని స్వ‌గ్రామం అని ప్ర‌చారం చేశాయి.

ఈ విష‌య‌మై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. కృష్ణా జిల్లాలోని యలమర్రు తమ పూర్వీకుల స్వగ్రామమని స్పష్టం చేశారు. తాను, త‌న తండ్రి గుడివాడ‌లోనే పుట్టామ‌ని, త‌మ‌ది గుడివాడ‌నేన‌ని తేల్చి చెప్పారు. యలమర్రులో వైసీపీ బలపర్చిన అభ్యర్థి ఓడిపోయినట్టు కొన్ని చానళ్లు, పత్రికలు, వాటి అధిపతులు పిచ్చిరాతలు రాస్తున్నారని కొడాలి నాని ఫైర్ అయ్యారు. వాస్తవానికి య‌ల‌మ‌ర్రు పంచాయతీ గుడివాడ నియోజవర్గంలో లేదని, పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంలో ఉందని వివరించారు. యలమర్రు గ్రామంలో ఎవరు ఏ పార్టీకి చెందినవాళ్లో కూడా తనకు తెలియదన్నారు. అక్కడ వైసీపీ ఓడిపోతే అది నాకు ఎదురుదెబ్బ అంటూ సంబరాలు చేసుకోవడం కామెడీగా ఉందన్నారు. య‌ల‌మ‌ర్రు రాజ‌కీయాలు తాను ప‌ట్టించుకోను అన్నారు.

పంచాయతీ ఎన్నికల సమయంలో యలమర్రుకు వెళ్లలేదని, అక్కడ ఎవరినీ ఓటు అడగలేదని మంత్రి తెలిపారు. దమ్ముంటే యలమర్రు రావాలని, ఆ గ్రామంలో తాను ఓట్లు అడిగినట్లు గానీ, తనను అక్కడ చూసినట్టుగానీ నిరూపిస్తే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని స‌వాల్ చేశారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గంలో 58 పంచాయతీలకు గాను 43 పంచాయతీల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారన్నారు. పత్రికా సమావేశాల్లో మాట్లాడవద్దన్న ఎస్‌ఈసీ ఆదేశాల వల్లే పత్రికా సమావేశాల్లో మాట్లాడటం లేదన్నారు. అందువల్ల ఎన్నికలు 21వ తేదీన ముగియగానే తన నియోజకవర్గంలో వైసీపీ బలపర్చిన అభ్యర్థులకు ఎంతెంత మెజార్టీలు వచ్చాయి…యలమర్రు తన స్వగ్రామమా కాదా.. అనేది తేలుద్దామని మంత్రి చెప్పారు.