Srinivas Goud : తెలంగాణలోని ఏపీ ప్రజలను.. సెటిలర్స్ అని ఎప్పుడూ అనలేదు

ఏపీ నాయకులు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించవద్దని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. ఉద్యమకాలంలోనూ తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలను సెటిలర్స్ అనలేదని అన్నారు.

Srinivas Goud : తెలంగాణలోని ఏపీ ప్రజలను.. సెటిలర్స్ అని ఎప్పుడూ అనలేదు

Srinivas Goud

Srinivas Goud : ఏపీ నాయకులు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించవద్దని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. ఉద్యమకాలంలోనూ తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలను సెటిలర్స్ అనలేదని అన్నారు. ఏపీ సర్కార్ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు కడుతూ, నీటిని దోచుకుంటోందని ఆరోపించారు. క్యాచ్ మెంట్ ఏరియా ఎక్కువున్న ప్రాంతానికి ఎక్కువ నీళ్లు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

జలవివాదాల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్స్‌ను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని కొంత మంది ఏపీ నేతలు మాట్లాడుతున్నారని, వారు ఒకప్పుడు సెటిలర్స్‌ కావచ్చేమో కానీ ఇప్పుడు కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వారంతా తెలంగాణకు చెందిన వారేనని స్పష్టం చేశారు. వారు ఇప్పటికీ సెటిలర్స్‌ అనే ముద్ర మీరే వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ కాలంలోనూ తాము సెటిలర్స్ అనే పదం వాడలేదన్నారు. ఏపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు.

అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ నీటిని ఏపీ దోచుకుంటోందని, నీటి పంపకాల్లో కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి ఆరోపించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రధాని మోడీ చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. కృష్ణా నదిలో 26 శాతం క్యాచ్‌మెంట్ ఏరియా ఉన్న ఏపీకి 66 శాతం నీళ్లు పోతున్నాయని చెప్పారు. జీవోల ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడుకుంటోందని, విద్యుత్ ప్రాజెక్టులున్న దగ్గర నుండి నీటిని వాడుకోవచ్చని నిబంధనలు చెబుతున్నాయని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

తాము ఏపీ ప్రభుత్వం అక్ర‌మంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల‌కే వ్య‌తిరేకం, ఆంధ్రా ప్ర‌జ‌ల‌కు కాద‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లో సీమాంధ్ర ప్ర‌జ‌లు ఉన్నార‌ని ఏపీ సీఎం జ‌గ‌న్, మంత్రులు మాట్లాడ‌టం బాధాక‌ర‌మ‌న్నారు. తెలంగాణ‌లో ఉన్న ఆంధ్రా ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌టం లేద‌న్నారు. హైద‌రాబాద్‌లో ఉన్న ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటామ‌న్నారు. అనుమతులు లేకుండా ఏపీ ప్ర‌భుత్వం అక్ర‌మంగా ప్రాజెక్టుల‌ను నిర్మిస్తుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

పాల‌మూరు జిల్లాను ఎడారిని చేసేందుకు ఏపీ సీఎం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కృష్ణా బేసిన్‌ను కాద‌ని పెన్నా న‌దికి నీటిని త‌ర‌లించ‌డం మంచిది కాదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్ప‌త్తిని ఆప‌మ‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టు కాదు.. ఈ విష‌యం కృష్ణా బోర్డుకు తెలియ‌దా? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగితే సీఎం కేసీఆర్ స‌హించ‌రని అన్నారు. రెండు రాష్ట్రాలు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవాల‌ని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ప‌ష్టం చేశారు.