చేపల కోసం వలవేసి బుడతడికి కరెన్సీ నోట్ల కట్టలే కట్టలు పడ్డాయి!!

  • Published By: nagamani ,Published On : May 13, 2020 / 05:16 AM IST
చేపల కోసం వలవేసి బుడతడికి కరెన్సీ నోట్ల కట్టలే కట్టలు పడ్డాయి!!

చేపలు పట్టటానికి వలతో చెరువుకు వెళ్లిన ఓ బుడతడికి వలలో చేపలకు బదులు కట్టలకు కట్టలు కరెన్సీ నోట్లు పడ్డాయి. అవన్నీ రూ.500, రూ.2వేల నోట్లు. వాటిని చూసిన ఆ బుడతడికి నోట మాట రాలేదు..ఆహా..ఏమి నా భాగ్యము..ఏమి నా అదృష్టం..ఈరోజుతో నా జీవితం మారిపోతుందనుకుని తెగ  సంబరపడిపోయాడు. కానీ సామెత చెప్పినట్లు చేతిదాకా వచ్చింది నోటికి అందనట్లుగా..రీసెంట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమన్ శ్రీనివాస్ చెప్పినట్లుగా ‘అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చే లోపు..దరిద్రం వచ్చి ఏదో చేసినట్లుగా అయిపోయింది పాపం ఆ బుడతడి పరిస్థితి.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఆ అదృష్ట దురదృష్టాల బుడతడి కరెన్సీ కట్టలు కథా కమామీషు ఏంటో మీరూ తెలుసుకోండి..

 మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలోని అరుద్ గ్రామానికి చెందిన ఓ బాలుడు పొద్దుపొద్దున్నే లేచి వల పట్టుకుని చేపలు పట్టటానికి చెరువుకు వెళ్లాడు. అలా చెరువులోకి వల విసిరాడు. తరువాత కొంతసేపటికి లాగాడు. వలలో  ఏదో చిక్కినట్లు బరువుగా అనిపించింది. ఎంతో సంబరపడిపోతూ వలను పైకి లాగాడు. అందులో చేపలు కాదు..కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి. అంతే ఒక్కసారిగా కళ్లు చెదిరిపోయాయి. వెంటనే వలనుంచి బైటకు తీసాడు. అన్నీ రూ.500రూ.2వేల నోట్ల కట్టలు. నీటిలో తడిసిపోవటంతో వాటిని నేలపైన ఆరబెట్టాడు. తడి ఆరిపోవటంతో అదే సమయంలో గాలి వేయడంతో కొన్ని నోట్లు ఎగిరిపోయాయి. వెంటనే గబగబా నోట్లన్నింటినీ సంచిలో వేసుకుని ఇంటికి పరుగెట్టకుంటూ వెళ్లిపోయాడు. 

కానీ గాలికి ఎగిరిపోయిన నోట్లు అటుగా వచ్చిన స్థానికుల కళ్లబడ్డాయి. ఆనందంగా వాటిని చూసిన కొందరు వాటిని ఏరుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం అలా అలా క్షణాల్లో గ్రామం మొత్తం తెలిసిపోయింది. ఇంకేముంది…జనాలు పెద్ద ఎత్తున చెరువు దగ్గరకొచ్చి కంటపడిన నోట్లను ఏరుకోవటం మొదలుపెట్టారు.  

నోట్లు ఏరుకునే హడావిడిలో గ్రామస్తులు ఉంటే ఓ యువకుడు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే చెరువు దగ్గరకు వచ్చిన పోలీసులతో..సదరు యువకుడు తాను ఉదయం వాకింగ్‌కు వెళ్తున్నప్పుడు గుర్తుతెలియని ఓ వ్యక్తి చెరువులో ఏదో పడేస్తూ కనిపించాడని..కానీ అతను ఏం పాడేస్తున్నాడనేది తాను చూడలేదన్నాడు. వాకింగ్ నుంచి తిరిగి వచ్చేసరికి చెరువు వద్ద జనాలు నోట్ల కట్టలు ఏరుకుంటూ ఉండటం చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. దీంతో పోలీసులు ఆ డబ్బులు తీసుకున్నవారంతా తిరిగి ఇచ్చేయాలని ఆర్డరేశారు. దీంతో అంతా తమకు దొరికిన నోట్లను పోలీసులకు తిరిగి ఇచ్చేశారు. అసలే కరోనా భయం వెంటాడుతుండటంతో ఆ నోట్లకు కరోనా వైరస్ ఉంటుందనే భయంతో ఎందుకొచ్చిన గోలరా బాబూ అనుకుంటూ భయపడి..వారికి దొరికిన నోట్లను పోలీసులకు ఇచ్చేశారు. 

అలా పోలీసులకు డబ్బుల కట్టలు వలలో పడ్డ  బాలుడి గురించి తెలిసింది. వెంటనే  బాలుడి ఇంటికెళ్లి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని చెరువులో ఆ నోట్లను పాడేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అయితే, చెరువులో ఎంత మొత్తాన్ని పడేశాడనేది ఇంకా తెలియరాలేదు.  కరెన్సీ నోట్లు కనిపించాయి కదాని గబగబా ఏరేసుకున్నాం గానీ..కక్కుర్తి పడినందుకు నోట్లు సొంతం కాలేదు..పైగా తాము ఏరుకున్న నోట్లకు కరోనా వైరస్ ఉందేమో..ఉంటటే తమ పరిస్థితి ఏమిటని భయపడిపోతున్నారు ఆ గ్రామస్తులు.

Read Here>> మరో వారం ఇలానే ఉంటే కుటుంబాలు గడవని పరిస్థితి ఖాయం