Gnana Saraswati : చదువుల తల్లి…జ్ఞాన సరస్వతి

Gnana Saraswati : చదువుల తల్లి…జ్ఞాన సరస్వతి

Basara

Gnana Saraswati : భారత దేశంలో ప్రముఖ మైన సరస్వతీ దేవాలయాలు మూడు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి తెలంగాణా రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం. ఎంతో చారిత్రక ప్రసిద్ధి కలిగిన క్షేత్రం ఇది. బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్టించినట్లు స్ధలపురాణం ద్వారా తెలుస్తుంది. కురుక్షేత్రం యుద్ధం తరువాత వేదవ్యాసుడు గోదావరి తీరంలో తపస్సు చేయడం ప్రారంభించారు. వ్యాస మహర్షికి స్వప్నంలో అమ్మవారు దర్శనమిచ్చి ముగ్గురు అమ్మలకు ఆలయాన్ని నిర్మించమని కోరటంతో ఆయన నదిలోనుండి మూడు గుప్పళ్ళతో ఇసుక తీసుకువచ్చి సరస్వతి, లక్ష్మీ, కాళిక ముగ్గురు దేవతా మూర్తులను ప్రతిష్టించాడట.

వ్యాసుడు తపస్సు చేసినందున ఈ ఊరిని వ్యాసపురి, వ్యాసరగా పిలిచేవారు. కాలను క్రమంలో మహారాష్ట్ర వాసుల ప్రభావంతో వ్యాసర కాస్త బాసరగా మారిపోయింది. ఆదికవి వాల్మికి రామాయణాన్ని ఇక్కడే రచించి సరస్వతి దేవిని ప్రతిష్టించాడని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. 6వ శతాబ్ధంలో నందగిరి ప్రాంతాన్ని నందేడుని రాజధానిగా చేసుకుని పాలించిన రాజు బిజలుడు బాసరలోని ఈ ఆలయాన్ని నిర్మించాడని అంతా చెప్తుంటారు. ఆలయానికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధితోపాటు, ఆయన తపస్సు చేసిన గుమలు నేటికీ ఉన్నాయి.

బాసర సరస్వతీ దేవి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందన్న నమ్మకం భక్తుల్లో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక , ఇతర రాష్ట్రాల నుండి బాసరలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు తరలివస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో అక్షరాభ్యాసం చేయించి అమ్మవారికి పలక, బలపము, పుస్తకము, కలము వంటి కానుకలను సమర్పిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞాన ప్రసూనాంబ చేతిలో అఖండ జ్యోతికి నూనెను భక్తులు సమర్పిస్తారు.

దేవీనవరాత్రులు, మహాశివరాత్రి, వ్యాసపూర్ణిమ,వసంతపంచమి, అక్షరాభ్యాసం వంటి ఉత్సవాలు బాసర క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తారు. ఉత్తరముఖంగా ఉండే ఈ ఆలయంలో సరస్వతీ దేవికి ఎదురుగా లక్ష్మీదేవి, పశ్చిమ దిశగా మిట్టమీద కాళీదేవి దర్శనమిస్తారు. ఆలయానికి ఆగ్నేయ దిశలో పాపహరిణిలో దక్షిణంగా వ్యాసమహర్షి ఆలయం ఉంది. ఉదయం 4 గంటల నుండి రాత్రి 8.30గంటల వరకు ఆలయం సందర్శకులకోసం తెరచి ఉంటుంది. నిర్మల్ పట్టణానికి 35కిలో మీటర్ల దూరంలో ఈ బాసర క్షేత్రం ఉంది.