ట్రైన్ లో గర్భిణికి డెలివరీ చేసిన దివ్యాంగుడు

ట్రైన్ లో గర్భిణికి డెలివరీ చేసిన దివ్యాంగుడు

MP : రైలులో ప్రయాణం చేస్తుండగా ప్రసవ వేదనతో బాధ పడుతున్న ఓ గర్భిణికి ఓ దివ్వాంగుడు డెలివరీ చేసిన ఘటన శనివారం (జనవరి 16) సంపర్క్‌ క్రాంతి కోవిడ్‌-19 స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. సునీల్ ప్రజాపతి అనే 30 ఏళ్ల దివ్యాంగుడు చొరవతోను..వీడియో కాల్ లో డాక్టర్ చెప్పిన సలహాలతో గర్భిణికి డెలివరీ చేయగా ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

మధ్యప్రదేశ్ కు చెందిన దివ్యాంగుడైన సునీల్‌ ప్రజాపతి ఢిల్లీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. తన పెళ్లికి ముహూర్తం పెట్టుకోవటానికి డేట్ ఫిక్స్ చేసుకోవటానికి గత శనివారం తన సొంత రాష్ట్రం అయిన మధ్యప్రదేశ్‌కు జబల్‌పూర్‌- మధ్యప్రదేశ్‌ రైలులో బయల్దేరాడు. ట్రైన్ లో జర్నీ చేస్తున్న సునీల్ కు రాత్రి సయమంలో ఓ మహిళ బిగ్గరగా ఏడ్వటం వినిపించింది. ఏంటాని లేచి చూశాడు. అది ఎక్కడనుంచి వస్తుందోనని పరిశీలనగా విన్నాడు.

వెంటనే బీ3 కోచ్‌లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి చూశాడు. అక్కడ పురిటి నొప్పులతో తీవ్రంగా బాధపడుతున్న ఓ గర్భిణి కనిపించింది. ఆమెను అలా చూసేసరికి సునీల్ కు బాధ వేసింది. ఆమెకు తానేమైనా చేయగలిగితే బాగుండు..తల్లీ బిడ్డ క్షేమంగా ఉండాలి భగవంతుడా? అని ప్రార్థించాడు.

ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లే సమయంలో కూడా లేదు. పురిటినొప్పులు తీవ్రంగా వస్తున్నాయి. అవి భరించలేక పాపం ఆమె అల్లాడిపోతోంది. అటువంటి సమయంలతో ఆమెకు సాయం చేయటానికి ఆ బోగీలో ఎవరైనా తోటి మహిళలున్నారేమోనని చూశాడు. కానీ ఒక్క మహిళ కూడా కనిపించలేదు. అప్పటికే ఆమెకు రక్తస్రావం అవుతోంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా తల్లీ బిడ్డలకు ప్రమాదం జరుగుతుందని భావించాడు.

వెంటనే తన సుపీరియర్‌ డాక్టర్‌ సుపర్ణ సేన్‌కు ఫోన్‌ చేశాడు. వీడియోకాల్‌లో మొత్తం విషయం వివరించి చెప్పాడు. పరిస్థితి విన్న డాక్టర్‌ సుపర్ణ తాను చెప్పినట్లుగా జాగ్రత్తగా చేయమంటూ..వీడియోకాల్ లో సూచనలు చెబుతుండగా..వాటిని అత్యంత జాగ్రత్తగా పాటిస్తూ ఎలాగైతేనే ఆ గర్భిణికి ప్రసవం చేశాడు. శాల్‌(శాల్వ)కు ఉన్న దారాలు, ఓ ప్యాసింజర్‌ షేవింగ్‌ కిట్‌లో ఉన్న కొత్త బ్లేడ్‌ తీసుకుని ఆమెకు డెలివరీ చేశాడు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నందుకు సంతోషించాడు సునీల్. అనంతరం మథుర స్టేషన్‌లో ట్రైన్ ఆగగానే ఆర్పీఎఫ్‌ సిబ్బందికి విషయం తెలియజేసి తల్లీబిడ్డను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిద్దరు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని పసిబిడ్డకు ప్రాణం పోసి..ఆ తల్లికి పునర్జన్మనిచ్చిన సునీల్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

దీని గురించి సునీల్‌ మాట్లాడుతూ..‘‘రైలు ఫరీదాబాద్‌ దాటిన తర్వాత తాను కూడా తెచ్చుకున్న భోజనం చేద్దామని బాక్స్‌ తెరిచాను. సరిగ్గా అదే సమయంలో ఓ మహిళ బాధతో కేకలు వేస్తున్న శబ్దం వినిపించింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్లాను. ఆమె పక్కనే ఓ చిన్నమ్మాయి. ఆమె సోదరుడు మాత్రమే ఉన్నారు.వాళ్లు దోమోకు వెళ్తున్నారని వాళ్లు చెప్పారు. తను పేరు కిరణ్‌ అని, జనవరి 20న ఆమెకు డెలివరీ డేట్‌ ఇచ్చారని చెప్పారు. కానీ ప్రయాణం వల్ల ఆమెకు ముందుగానే పురిటి నొప్పులు నెమ్మదిగా వచ్చి ఉంటాయనుకున్నానని..ఒకవేళ వాళ్లకు ఏదైనా సహాయం కావాలంటే నన్ను పిలవమని చెప్పి తిరిగి నా బోగీ దగ్గరకొచ్చేశారు. కానీ ఆమెకు నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో పెద్ద పెద్దగా కేకలు వినిపించటంతో మళ్లీ వెళ్లాను.

అప్పటికే ఆమె నొప్పులు భరించలేకపోతోంది. మా డాక్టర్‌కు ఫోన్‌ చేసి పరిస్థితి గురించి చెప్పాను. కానీ అప్పటికే ఆమెకు రక్తస్రావం మొదలైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే డాక్టర్‌ సుపర్ణ సేన్‌కు వీడియోకాల్‌ చేశాను. ఆమె చెప్పినట్లుగానే జాగ్రత్తగా అన్నీ వింటూ డెలివరీ చేసేందుకు ప్రయత్నించాను. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రసవం జరిగింది. కానీ..అటువంటి పరిస్థితుల్లో నాకు ఒకటే భయం వేసింది. ఏదన్నా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటో నని ఆలోచించాను. కానీ వేరే దారి లేదు..ధైర్యం చేసి ఓ పక్క భయంతోనే..ప్రసవం చేశానని తెలిపాడు. అంతా మంచే జరిగినందుకు ఇప్పుడు సంతోషంగాఉన్నాననీ..తల్లీ బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారనీ..ఇటువంటి ఓ విచిత్ర పరిస్థితులను ఫేస్ చేస్తానని ఎప్పుడు లనుకోలేదని సునీల్ తెలిపాడు.

సునీల్‌కు సూచనలిచ్చిన డాక్టర్‌ సుపర్ణ సేన్‌ మాట్లాడుతూ..సునీల్ నిజంగా చాలా మంచి పనిచేశాడు. ఓ బిడ్డకు ఊపిరి పోశాడు. ఆ తల్లికి పునర్జన్మనిచ్చాడు. అతడికి హ్యాట్సాఫ్ అని తెలిపారు.

తాను కలలో కూడా ఊహించన ఇటువంటి ఘటన గురించి ప్రసవం జరిగిన కిరణ్‌ మాట్లాడుతూ..‘‘నాకు ఇలా ప్రసవం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఇప్పటికే నాకు మూడుసార్లు గర్భస్రావం అయ్యింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో పుట్టిన నా బిడ్డను నేను చూసుకోగుతున్నాను..ఇదంతా సునీల్ నాకు చేసిన సహాయం వల్లననీ..నాకు సాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నా’’ అని ఉద్వేగానికి గురైంది.