రక్తదానం చేస్తే… కిలో చికెన్ ఫ్రీ

  • Published By: nagamani ,Published On : December 7, 2020 / 12:10 PM IST
రక్తదానం చేస్తే… కిలో చికెన్ ఫ్రీ

Mumbai : MBC Blood Donation Offer 1 kg chicken free: రక్తదానం చేద్దాం..ప్రాణదానం చేద్దాం.. అనే మాట ఎంతోమంది ప్రాణాల్ని నిలుపుతోంది. ఎంతో మంది కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. రక్తదానం చేయటమంటే ఓ మనిషికి పునర్జన్మను ఇచ్చినట్లే. దీంతో చాలామంది రక్తదానం చేస్తుంటారు. అలా రక్తదానం చేసినవారికి వెంటనే శక్తి రావటానికి ఓ పండు ఇస్తారు. లేదా ఫ్రూట్ జ్యూస్ ఇస్తారు. కానీ మహారాష్ట్రలోని బృహన్ ముంబై కార్పొరేషన్ (MBC) మాత్రం ‘‘రక్తదానం చేయండీ..కిలో చికెన్..లేదా పన్నీర్ ఫ్రీగా పట్టుకెళ్లండీ’’ అని పిలుపునిస్తోంది.



బృహన్ ముంబై కార్పొరేషన్ (BMC)లోని ఓ కార్పొరేటర్…ఈ ఆఫర్ ప్రకటించారు. డిసెంబర్ 16న న్యూ ప్రభాదేవి లేని రాజాభావ్ సాల్వీ మైదాన్‌లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇందులో రక్తందానం చేయాలనుకునేవారు డిసెంబర్ 11 లోపు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.



లోయర్ పారెల్‌లోని KEM ఆస్పత్రి వర్గాలు… ఈ బ్లడ్ డొనేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా దగ్గరుండి నిర్వహించనున్నాయి. ప్రభాదేవీ స్థానం నుంచి BMCకి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ సమాధాన్ సర్వాంకర్… శివసేన నేత సదా సర్వాంకర్ కుమారుడు. తన ఏరియాలోని ప్రజలు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొని… చికెన్ లేదా పన్నీర్ తీసుకెళ్లాల్సిందిగా ఆయన కోరారు. మాంసాహారం తినని వారు చికెన్ కు బదులుగా పన్నీరు తీసుకెళ్లాలని ప్రకటించారు.



ఈ సంరద్భంగా సమాధాన్ సర్వాంకర్ మాట్లాడుతూ..ఈకరోనా కాలంలో రక్తదానం చేస్తే ఇమ్యూనిటీ పెంచుకోవటానికి చికెన్ లేదా పన్నీర్ ను దాతలకు ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు. ఇటు రక్తదానం కార్యక్రమం అటు కరోనాతో కుదేలైన పౌల్ట్రీ పరిశ్రమలకు ఉపయోగం కలిగేలా ఇలా చేయాలనుకుంటున్నామని తెలిపారు.



ఇమ్యూనిటీ పెంచుకోవటానికి చికెన్, పన్నీర్ లు ఉపయోగపడతాయని డబ్ల్యూ హెచ్ వో కూడా తెలిపిందని గుర్తుచేశారు. తమ పిలుపుతో 1000మంది దాతలను లక్ష్యంగా పెట్టుకున్నామని..దీనికి సంబంధించి ఆసక్తి ఉన్న దాతలు ముందుగానే రిజిస్టర్ చేయించుకోవాలని..దానికి సంబంధి ప్రక్రియ డిసెంబర్ 5న ప్రారంభించామని రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 11న ముగుస్తుందని తెలిపారు.