మనవరాలి చదువు కోసం ఇంటిని అమ్మేసిన ఆటోవాలా తాత కష్టాలు తీరాయి.. రూ.24లక్షల ఆర్థిక సాయం

మనవరాలి చదువు కోసం ఇంటిని అమ్మేసిన ఆటోవాలా తాత కష్టాలు తీరాయి.. రూ.24లక్షల ఆర్థిక సాయం

mumbai elderly auto wala life changed: పేదరికంతో చదువు మానేస్తానన్న మనవరాలికి ధైర్యం చెప్పి ఆమె చదువు కోసం ఉన్న ఏకైక ఇంటినే అమ్మేసిన ఆటోవాలా గుర్తున్నాడు కదూ. ఇప్పుడు ఆయనకు కొత్త జీవితం లభించింది. ఆ వృద్ధుడి దీన గాథపై స్పందించిన దాతలు ఏకంగా రూ.24 లక్షలు సమకూర్చారు. దీంతో ఆ బక్క పల్చని వృద్ధుడి ఆనందానికి అవధులు లేవు.

74ఏళ్లు వృద్ధుడు కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు:
ముంబైకి చెందిన ఆ ఆటోవాలా పేరు దేశ్ రాజ్. వయసు 74ఏళ్లు. ఆరేళ్ల క్రితం పెద్ద కొడుకును కోల్పోయిన దేశ్ రాజ్, కొద్ది కాలానికే చిన్న కొడుకుని కూడా కోల్పోయాడు. దీంతో ఇద్దరు కోడళ్లు, వారి నలుగురు పిల్లల జీవితం అగమ్యగోచరంగా మారింది. మరో దారి లేకపోవడంతో ఆ వృద్ధుడు కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. ఆటో నడిపి వారిని పోషిస్తున్నాడు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచే ఆటో నడుపుతూ అర్ధరాత్రి వరకూ కష్టపడేవాడు. నెలంతా కష్టపడితే రూ.10 వేలు వచ్చేవి. అందులో రూ.6 వేలు పిల్లల ఫీజులకు పోగా, మిగతా డబ్బుతోనే ఆ కుబుంబం నెలంతా నెట్టుకొచ్చేది.

మనవరాలి చదువు కోసం ఇంటి త్యాగం:
కాగా, టీచర్‌ కావాలనేది దేశ్‌రాజ్‌ మనవరాలి ఆశయం. కానీ ఇంటి ఆర్థిక పరిస్థితులు చూసిన ఆమె చదువు మానేస్తానని తాతతో చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు మానొద్దని చెప్పిన దేశ్‌రాజ్‌, మనవరాలి చదువు కోసం పెద్ద త్యాగమే చేశాడు. వారు ఉంటున్న ఇంటిని కూడా అమ్మేశాడు. మనవరాలిని ఢిల్లీలోని ఓ కాలేజీలో బీఈడీ కోర్సులో చేర్పించాడు. మిగతా కుటుంబసభ్యులను తన సొంతూరిలోని బంధువుల ఇంటికి పంపించాడు.

ఆటోలోనే భోజనం, ఆటోలోనే నిద్ర, ఆటోలోనే నివాసం:
దేశ్‌రాజ్‌ మాత్రం ముంబైలోనే ఉంటూ ఆటో నడుపుతూ అందులోనే జీవించేవాడు. ఆటోలోనే భోజనం. అందులోనే పడుకునేవాడు. దేశ్‌రాజ్‌ గురించి తెలుసుకున్న ప్రముఖ సోషల్ మీడియా పేజీ ”హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే” చేసిన పోస్టు వైరల్‌గా మారింది. వృద్ధుడి దీన గాథ చదివిన నెటిజన్లు చలించిపోయారు. ఆ తర్వాత ఓ ఫేస్‌బుక్‌ యూజర్‌ మరో అడుగు ముందుకేసి.. ఫండ్‌రైజింగ్ చేపట్టగా… దాతలు పెద్దఎత్తున స్పందించారు. తమకు చేతనైన నగదు సాయం చేశారు. అలా మొత్తం రూ.24 లక్షలు సమకూరాయి. ఆ డబ్బు చెక్కుని దేశ్ రాజ్ చేతికి అందించారు. దీంతో ఆ వృద్ధుడి ఆనందానికి అవధులు లేవు. దాతలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు.