Munugode Bypoll 2022 : మునుగోడుపై టీఆర్ఎస్ సైలెంట్… ఎందుకీ మౌనం? అసలు గులాబీ వ్యూహం ఏంటి?

ఓవైపు బీజేపీ, కాంగ్రెస్ హడావుడి చేస్తుంటే.. మునుగోడు ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది? అసలు గులాబీ వ్యూహం ఏంటి?

Munugode Bypoll 2022 : మునుగోడుపై టీఆర్ఎస్ సైలెంట్… ఎందుకీ మౌనం? అసలు గులాబీ వ్యూహం ఏంటి?

Munugode Bypoll 2022 : తెలంగాణ రాజకీయాలు మొత్తం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించడంతో ఉపఎన్నిక అనివార్యం కానుంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నిక సెమీఫైనల్స్ గా మారనున్నాయి. ఈ ఉపఎన్నికలో గెలిస్తే వచ్చే ఊపుతో రానున్న జనరల్ ఎలక్షన్స్ లో సులువుగా విజయం సాధించి అధికారం చేపట్టవచ్చని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఇక్కడ గెలిచి రాష్ట్రంలో తమకు తిరుగులేదని చాటి చెప్పేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.

ఇందులో భాగంగా కాంగ్రెస్, బీజేపీలు సభలు, సమావేశాలతో హడావుడి చేస్తుంటే.. టీఆర్ఎస్ మాత్రం మౌనం వహిస్తోంది. ఇంతకీ టీఆర్ఎస్ ఎందుకు సైలెంట్ అయ్యింది? మునుగోడు నియోజకవర్గంలో జెండా పాతాలని బీజేపీ, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉన్నాయి. మునుగోడులో బీజేపీ తరుఫున మరోసారి పోటీ చేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిద్ధమవుతుంటే.. తమ సిట్టింగ్ సీటుని నిలుపుకోవడానికి కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది.

BJP Leader Ttarun Chugh :బీజేపీలోకి చేరికల లిస్ట్ చాలాఉంది..ఇది ట్రైలర్ మాత్రమే..సినిమా ముందుంది..

రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందకముందే చండూరులో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ కూడా నిర్వహించింది. ఈ నెల 21న బీజేపీ కూడా సభను నిర్వహించబోతోంది. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మునుగోడుకి తీసుకురాబోతోంది. అమిత్ షా సమక్షంలోనే రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోనున్నారు.

ఓవైపు బీజేపీ, కాంగ్రెస్ హడావుడి చేస్తుంటే.. మునుగోడు ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ఏమి ఆలోచిస్తోంది అనేది అంతు చిక్కడం లేదు. హుజూరాబాద్ లో ఎదురైన అనుభవాలతో మునుగోడులో బీజేపీకి షాక్ ఇచ్చేలా పక్కా ప్లాన్ తో టీఆర్ఎస్ వెళ్తున్నట్లు చెబుతున్నారు. హుజూరాబాద్ లో చేసినంత హడావుడి చేయకుండా ప్రత్యర్థి పార్టీల చూపు తమవైపు డైవర్ట్ కాకుండా గులాబీ దళం జాగ్రత్తలు తీసుకుంటోంది. గులాబీ బాస్ కేసీఆర్ చాపకింద నీరులా మునుగోడులో పనులు చక్కబెడుతున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారనే వార్త బయటకు రాగానే సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి, ఉపఎన్నిక వ్యూహంపై ముఖ్య నేతలతో చర్చలు జరిపారు.

ఉపఎన్నికపైనా త్వరలో సమన్వయ కమిటీ నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. త్వరలో నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్ నేతలు, ఇతర నాయకులతో చర్చించాలని టీఆర్ఎస్ అగ్రనాయకత్వం భావిస్తోంది.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఇంకా ఆమోదం పొందకపోయినా.. ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఆయనేనని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆశావహులు పెద్దఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. నియోజకవర్గంలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బీసీ అభ్యర్థిని బరిలో దింపే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Komatireddy Raj Gopal Reddy: వాళ్ళు టీఆర్ఎస్‌లోకి వెళ్తే ఎవ్వ‌రూ మాట్లాడ‌లేదు.. నాపై మాత్రం నిందలా?: రాజ‌గోపాల్ రెడ్డి

జిల్లాలో రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆ సామాజికవర్గం నేతలు టికెట్ పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. బీసీలలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, కర్నాటి విద్యాసాగర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రెడ్డి అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా ఆయన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని పోటీలో నిలుపుతారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు శ్రవంతి లేదా పలువురు బీసీ నేతల అభ్యర్థిత్వాలను ఆ పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ హస్తం గూటికి చేరడంతో కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆయనకే దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

మొత్తానికి మునుగోడును కేవలం ఒక ఉపఎన్నికగానే టీఆర్ఎస్ చూస్తోందా? గత ఉపఎన్నికలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటుందా? అనే చర్చ కూడా సాగుతోంది. హుజూరాబాద్ ఉపఎన్నికకు అనవసరంగా ఎక్కువ హైప్ ఇచ్చామని, ఈసారి అలా జరక్కుండా చూడాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఉపఎన్నిక టీఆర్ఎస్ కు కూడా కీలకమే. మరి.. గులాబీ పార్టీ బీజేపీ తరహాలోనే సీరియస్ గా ఈ సీటుపై ఫోకస్ చేస్తుందా? లేక మునుగోడును తేలిగ్గా తీసుకుంటుందా? వేచి చూడాలి.