అకస్మాత్తుగా గిలగిలా కొట్టుకుని చనిపోతున్న కోళ్లు, కాకులు, కుక్కలు.. వికారాబాద్‌లో వింత వ్యాధి కలకలం

అకస్మాత్తుగా గిలగిలా కొట్టుకుని చనిపోతున్న కోళ్లు, కాకులు, కుక్కలు.. వికారాబాద్‌లో వింత వ్యాధి కలకలం

mystery diesease in vikarabad: వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వింత వ్యాధి ప్రబలింది. ఈ వ్యాధితో కోళ్లు, కాకులు, కుక్కలు చనిపోతున్నాయి. దారూర్ మండలం దోర్నాలలో వింత వ్యాధికి మూగజీవాలు బలవుతున్నాయి. అకస్మాత్తుగా గిలగిలా కొట్టుకుని ప్రాణాలు వదులుతున్నాయి. దీంతో బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిందేమోనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

కోళ్లతోపాటు కాకులు కూడా చనిపోవటంతో బర్డ్‌ ఫ్లూ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. వారం రోజులుగా దారూర్‌ మండలం దోర్నాల, యాలాల మండలంలోని పలు గ్రామాల్లో భారీ సంఖ్యల్లో కోళ్లు చనిపోతున్నాయి. వాటిని పాతిపెట్టకుండా బయట పడేయడంతో అవి తిని కుక్కలు, కాకులు చనిపోతున్నాయి. దీంతో జిల్లాలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వింత వ్యాధి విషయాన్ని పశు సంవర్ధక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

పెద్ద ఎత్తున పక్షులు, మూగజీవాలు మరణించడంతో ఆ వ్యాధికి కార‌ణ‌మేంటో తెలియ‌క స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బ‌ర్డ్ ఫ్లూ కార‌ణంగా చనిపోతున్నాయా? మ‌రేదైనా కార‌ణ‌మా? అనేది అంతు చిక్కడం లేదంటున్నారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పశుసంవర్థక శాఖ అధికారులు ఈ విషయమై ఆరా తీస్తున్నారు. చనిపోయిన పక్షుల కళేబరాలను ల్యాబ్ కి తరలించారు.