ఏలూరులో అంతుచిక్కని వ్యాధి.. ఇంట్లోనే భయంతో వణికిపోతున్న జనం

  • Published By: bheemraj ,Published On : December 8, 2020 / 05:31 PM IST
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి.. ఇంట్లోనే భయంతో వణికిపోతున్న జనం

mystery illness Eluru : అంతు చిక్కని వ్యాధి ఏలూరును బెంబేలెత్తిస్తోంది. అసలేం జరుగుతుందో తెలియదు. ఎలా వస్తుందో తెలియదు. అప్పటికప్పుడే జనాలు కుప్పకూలిపోతున్నారు. వాంతులు చేసుకుంటున్నారు. కళ్లు తిరిగి కింద పడిపోతున్నారు. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి.



ఇప్పటికే 548 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఓవైపు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. కానీ.. పక్కాగా ఇదే వ్యాధి అని నిర్ధారించలేకపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్స్‌ కొరత ఏర్పడింది. ఆశ్రమ ఆస్పత్రిలో వంద పడకలు ఏర్పాటు చేశారు. అదనంగా మరో 500 బెడ్స్‌ అధికారులు సిద్ధం చేస్తున్నారు.



అంతు చిక్కని వ్యాధి.. అంతుచిక్కకపోవడంతో.. జనం భయాందోళనలకు గురవుతున్నారు. ఏలూరు మొత్తం భయం గుప్పిట్లో బిగుసుకుపోయింది. ఇళ్లల్లోనుంచి రావాలంటేనే జంకుతున్నారు. ఏలూరులో ఏ వీధి చూసినా.. ఖాళీగా కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది.



దక్షిణపు వీధి, తూర్పు వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే.. కుటుంబాలకు కుటుంబాలే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయి. నాలుగు రోజులైనా అసలు వ్యాధి ఏంటో.. కారణమేంటో తెలియక గందరగోళ పరిస్థితి ఏర్పడింది.



ఏలూరులో ప్రబలిన అంతుచిక్కని వింత వ్యాధి అంతకంతకు విస్తరిస్తోంది. ముందుగా ఏలూరులోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ వ్యాధి ఇతర ఏరియాలతో పాటు జిల్లాలకూ వ్యాపించింది.

పశ్చిమగోదారిజిల్లాలోని నారాయణపురం, కొవ్వలి, దెందులూరుతో పాటు కృష్ణా జిల్లాలోని నూజివీడు, కైకలూరులో ఫిట్స్‌ కేసులు నమోదవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.



ఏలూరులో మొదటి కేసు నమోదైన దక్షిణపు వీధి, రెండో కేసు గుర్తించిన తూర్పువీధిలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. వ్యాధి ప్రబలిన ప్రాంతాలు లాక్‌డౌన్‌ సమయంలో ఉన్నట్టు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.