వైసీపీకి ఓటు వేయలేదని ఇళ్ల మెట్లు కూల్చివేత, గుంటూరు జిల్లాలో దారుణం

వైసీపీకి ఓటు వేయలేదని ఇళ్ల మెట్లు కూల్చివేత, గుంటూరు జిల్లాలో దారుణం

municipal officials demolish house steps for not voting ycp: గుంటూరు జిల్లా నరసరావుపేటలో అధికారులు రెచ్చిపోయారు. విధ్వంసం సృష్టించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఓటు వేయలేదనే కారణంతో ఓ బిల్డర్ నిర్మించిన ఇళ్ల ముందు మెట్లు, ర్యాంప్ లను ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అధికారులు కూల్చివేశారు. ఇసప్పాలెం పంచాయతీలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

గోగులపాడు గ్రామానికి చెందిన జవ్వాజి రమేష్ బిల్డర్. ఇళ్లు నిర్మించి వాటిని విక్రయిస్తుంటాడు. నరసరావుపేట శివారులోని ఇసప్పాలెంలో ఇళ్లు కట్టి వాటిని విక్రయించాడు. అందులో చాలామంది గోగులపాడుకి చెందిన వారు నివాసం ఉంటున్నారు. వీరిలో అత్యధికులు టీడీపీ మద్దతురాలే ఉన్నారు. ఇటీవల సొంత ఊరిలో వీరంతా ఓటు వేసి వచ్చారు. ఇక్కడ వైసీపీ మద్దతుపలికిన అభ్యర్థే గెలిచాడు. అయినా సరే, ఇసప్పాలెం వారు తమకు వ్యతిరేకంగా ఓటు వేశారంటూ అధికార పార్టీ నేతలు కక్ష పెంచుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు బిల్డర్ నుంచి స్థానిక ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.

అధికారులు మెట్లు కూల్చేస్తున్న సమయంలో రమేష్ ఇంటి దగ్గర లేకపోవడంతో అత్తామామలు జేసీబీకి అడ్డుగా నిలిచారు. అన్ని అనుమతులు ఉన్నాయని, ఎందుకు కూల్చుతున్నారని ప్రశ్నించారు. యంత్రాలకు అడ్డుగా పడుకున్నారు. పోలీసులు వారిని పక్కకు లాగేశారు. ఇళ్ల ముందున్న మెట్లు, ర్యాంపులు, అరుగులను కూల్చేశారు. కాసేపటికి వచ్చిన రమేష్ అధికారులను ప్రశ్నించగా, ఓ ప్రజాప్రతినిధితో మాట్లాడుకోవాలని వారు జవాబిచ్చారు. వైసీపీకి ఓటు వేయాలని ఎన్నికలకు ముందు నుంచి ఒత్తిడి చేశారని, వారికి అనుకూలంగా వ్యహరించకపోవడంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్టు రమేష్ కుటుంబసభ్యులు ఆరోపించారు.

రొంపిచర్ల మండలంలోని గోగులపాడుకు చెందిన జవ్వాజి రమేష్ బిల్డర్. ఏడాది క్రితం ఇసప్పాలెంలోని సరస్వతి శిశుమందిర్ సమీపంలో పది ఇళ్లు నిర్మించి అందులో కొన్నింటిని విక్రయించాడు. అందులోని ఓ ఇంట్లో రమేష్ కుటుంబం నివసిస్తోంది.

గోగులపాడు సర్పంచ్ ఎన్నికల్లో తన బంధువులు టీడీపీ మద్దతుదారులకు ఓట్లు వేశారని తెలిసి తనపై గ్రామ పెద్దలు కక్ష కట్టారని, ప్రజా ప్రతినిధితో ఒత్తిడి తెచ్చి తాను నిర్మించిన ఇళ్ల మెట్లను కూల్చివేశారని రమేష్ ఆరోపించారు. కూల్చివేత సమయంలో తాను ఇంట్లో లేనని, తన అత్తమామలు జేసీబీకి అడ్డంపడినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తాను నిర్మించిన ఇళ్లకు అన్ని అనుమతులు ఉన్నాయని రమేష్ స్పష్టం చేశారు. కూల్చివేతల విషయం తెలిసి ఇంటికి వచ్చి అధికారులను ప్రశ్నిస్తే ప్రజాప్రతినిధి పేరు చెప్పి ఆయనతో మాట్లాడుకోవాలని అధికారులు చెప్పారని రమేష్ వాపోయారు.

అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. మరీ ఇంత దారుణమా అని మండిపడుతున్నారు. టీడీపీ నేతలు దీనిపై తీవ్రంగా స్పందించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.