Alampur jogulamba : 15వందల ఏళ్ల చరిత్ర .. ప్రపంచంలో ఎక్కడాలేని బ్రహ్మ తొమ్మిది రూపాలలో కొలువున్న పుణ్యక్షేత్రం

15వందల ఏళ్ల చరిత్ర కలిగి.. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా విధాత అయిన బ్రహ్మదేవుడు తొమ్మిది రూపాలలో కొలువున్న పుణ్యక్షేత్రం అలంపూర్. అంతేకాదు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ పూజలందుకునే దేవాలయం కొలువైన పుణ్యక్షేత్రం అలంపూర్.

Alampur jogulamba : 15వందల ఏళ్ల చరిత్ర .. ప్రపంచంలో ఎక్కడాలేని బ్రహ్మ తొమ్మిది రూపాలలో కొలువున్న పుణ్యక్షేత్రం

Alampur jogulamba : ఈ సృష్టికి మూలం బ్రహ్మ. సమస్త జీవరాశి పుట్టుకకు కారణమైన బ్రహ్మదేవుడి ఆలయాలు మన దేశంలో చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో జోగులాంబ ఒకటి.. ఇక్కడ కొలువైన నవబ్రహ్మ ఆలయ సముదాయంలోనే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకరైన జోగులాంబను పూజిస్తుంటారు.బాదామి చాళుక్యుల చేతిలో రూపుదిద్దుకున్న ఈ ఆలంపూర్‌.. నవబ్రహ్మ ఆలయాలకు ప్రసిద్ధి. బ్రహ్మ తొమ్మిది వేర్వేరు రూపాలలో ఉండటం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. కుమార, ఆర్క, వీర, విశ్వ, తారక, గరుడ, స్వర్గ, పద్మ బ్రహ్మేశ్వర ఆలయాలుగా వాటిని పిలుస్తారు. ఆలయాలపై పంచత్రంత కావ్య కథాశిల్పాలు, ఆదిత్య హృదయం, రామాయణ మహాభారత గాథల శిల్పాలు దర్శన మిస్తాయి. బాలబ్రహ్మశ్వర దేవాలయం ఆలయాలన్నింటిలో పెద్దది. తారక బ్రహ్మ దేవాలయం శిథిలమై ఉంటుంది. ఇక్కడ గర్భగుడిలో ఎటువంటి విగ్రహం ఉండదు. స్వర్గ బ్రహ్మ దేవాలయం అత్యంత సుందరంగా తీర్చిదిద్దబడి ఉంటుంది. 15వందల సంవత్సరాల క్రితం కట్టిన ఈ దేవాలయాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా కనిపిస్తాయి.

ఇక్కడ బాల బ్రహ్మేశ్వరుడు లింగాకారంలో కాకుండా గోస్పాద ఆకారంలో కనిపిస్తాడు. దీనికి ఓ పురాణ ఇతిహాసం ఉంది. పూర్వం బ్రహ్మదేవుడు ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇక్కడ తపస్సు చేశాడట. బ్రహ్మ తపస్సుకు మెచ్చిన శివుడు బ్రహ్మ దగ్గరికి బయల్దేరుతాడు.. అయితే ఈశ్వరుడు కైలాసం వదిలి వెళ్లడం పార్వతీదేవి, నందీశ్వరులు సహా ఎవరికీ ఇష్టం ఉండదు. అయినా వినకపోవడంతో నంది ఎలాగైనా శివుడిని ఆపాలని శివుడు ఉద్భవించే చోట పాదం అడ్డుగా పెట్టాడు. దీంతో ఆ పాదం వదిలి శివుడు పక్కనుంచి వెలిశాడట. అందుకే ఇక్కడ ఈశ్వరుడు గోస్పాద ముద్రితంగా కనిపిస్తాడు. శివుడు ఇక్కడ బ్రహ్మకి తొమ్మిది రూపాల్లో దర్శనమిచ్చాడని.. అందుకే ఆరూపాలలో తొమ్మిది ఆలయాలు వెలిశాయని చెబుతారు. బ్రహ్మదేవుని తపస్సు ద్వారా పరమేశ్వరుడు ఉధ్బవించినందున బ్రహ్మని బాల బ్రహ్మేశ్వరునిగా కొలుస్తుంటారు. సాధారణంగా శైవ క్షేత్రాల్లో శివ లింగాలు స్థూపాకారంగా ఉంటాయి. అలంపూర్‌లో మాత్రం గోస్పాద ముద్రిక, రసాత్మ లింగంగా వెలిసింది. ఇక్కడి శివ లింగం జ్యోతిర్‌జ్వాలమయం. మూలవిరాట్‌ అయిన స్వామివారి లింగము రుద్రాక్షలతో రూపొందించిన అద్భుత లింగం. భక్తులు ఎంతనీటితో అభిషేకం చేసినా ఒక్క నీటి బిందువు కూడా బయటికి రాదని చెబుతుంటారు. ఈ లింగాన్ని పూజిస్తే అంతు లేని పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.

రెండవ పులేశి కాలంలో ఈ నవబ్రహ్మ ఆలయ నిర్మాణం మొదలైంది.. నవబ్రహ్మ ఆలయాల ఆర్కిటెక్చర్‌ అబ్బురపరుస్తుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు కాబట్టి పూర్తిగా రాతితో కట్టిన ఆలయాలు కావడంతో బయట ఎంత ఎండగా ఉన్నా లోపలికి వెళ్లగానే చల్లాగా ఉండి మనసంతా దేవుడిమీద లగ్నమయ్యేలా ప్రశాంతతను కలిగిస్తాయి. ఎర్ర ఇసుక రాళ్లను ఉపయోగిస్తూ నవబ్రహ్మ ఆలయాలను నిర్మించారు. బ్రహ్మేశ్వరుని గుడి ఆవరణలోని మ్యూజియంలో విజయాదిత్యుడు వేయించిన శాసనం ఇప్పటికీ ఉంది. స్వర్గ బ్రహ్మాలయ ద్వార పాలకుని మీద వినయాదిత్యుని కాలం నాటి శాసనం ద్వారా చరిత్రకు తెలియని ఒక లోకాధిత్యుడి విగ్రహం కనిపిస్తుంది.. ఆర్క బ్రహ్మా ఆలయంలోని మంటప స్తంభంపై ఒకటవ విక్రమాదిత్యుని భార్య శాసనం ఉంది.

క్రీస్తు శకం 9వ శతాబ్దానికి చెందిన సూర్యదేవాలయం జోగులాంబ ఆలయ ప్రాంగణంలో ఉంది.. ఇక్కడ విష్ణు మూర్తి కి చెందిన సుందరమైన విగ్రహాలు కూడా చెక్కి ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన నరసింహ దేవాలయం కూడా ఇక్కడే ఉంది. తుంగభద్రా నదులు కలిసిన ఈ క్షేత్రాన్ని సంగమేశ్వర క్షేత్రం అని కూడా అంటారు. సకలపాప నివారినిగా ఈ నదిని కొలుస్తారు. అమ్మవారి దర్శనానికి ముందు ఈ నదిలో స్నానం చేసి పవిత్రులుగా వెళ్తారు. ఆలయ సముదాయం చుట్టూ పటిష్టమైన గోడ… దాని రెండోవైపు చుట్టూ అలుముకున్నట్లుగా ఉన్న నీటి ప్రవాహం అద్భుతంగా కనిపిస్తుంది. ఈ నదిలో కోరిన కోర్కెలు తీర్చమని దీపాలు వదులుతారు భక్తులు. కృష్ణా, తుంగభద్ర పుష్కరాల సమయంలో అలంపూర్‌.. భక్తులతో కిటకిటలాడుతుంది. శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు, అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మిక సంరంభం కనిపిస్తుంది.. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు. అలంపూర్ క్షేత్రంలో కార్తీక మాసం పూజలు, శివరాత్రి పర్వ దినాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఇక్కడ వర్ణార్చన, కన్యా పూజల కోసం మహిళలు తరలి వస్తారు.