వైసీపీని ఓడించేందుకు టీడీపీతో కుమ్మక్కు, బొత్స సోదరుడిపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు

వైసీపీని ఓడించేందుకు టీడీపీతో కుమ్మక్కు, బొత్స సోదరుడిపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు

nellimarla mla Appala Naidu on botsa brother: పంచాయతీ ఎన్నికల సమయంలో విజయనగరంలో వైసీపీ నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలో నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. పంచాయతీ ఎన్నికల వేళ నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్సల లక్ష్మణరావు వర్గాలు రెండుగా విడిపోయాయి. ప్రతిపక్ష టీడీపీతో కుమ్మకై వైసీపీని దెబ్బతీస్తున్నారని మంత్రి బొత్స సోదరుడిపైన ఎమ్మెల్యే అప్పలనాయుడు ఆరోపణలు చేశారు. స్వయంగా మంత్రి బొత్స వచ్చినా తనను ఏమీ చెయ్యలేరని అప్పలనాయుడు హెచ్చరించారు.

పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అప్పలనాయుడు.. మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావుపై నిప్పులు చెరిగారు. బొత్స సోదరుడు టీడీపీతో కుమ్మక్కయ్యారని, వైసీపీని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. తన నియోజకవర్గంలో బొత్స సోదరుడు రాజకీయ సంక్షోభాన్ని తెస్తున్నారని, టీడీపీతో కలిసి డబ్బులు వెదజల్లి ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అన్నదమ్ములకి, వదినకి పదవులున్నా సంతృప్తి చెందక బొత్స లక్ష్మణరావు రాజకీయ ఉన్మాదిగా మారారని విమర్శించారు.

గత ఎన్నికల్లో తనకు వచ్చిన ముప్పైవేల మెజారిటీ చూసి ఓర్వలేక రాజకీయ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రమంతా ఒకటైతే.. తన నియోజకవర్గంలో మరోలా ఉందన్నారు. బొత్స తన సోదరుడిని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారని ఎమ్మెల్యే అన్నారు. డబ్బు ఎక్కువైతే దానధర్మాలు చేసుకోవాలే తప్ప… గ్రూపు రాజకీయాలు చేస్తూ సొంత పార్టీలోనే చిచ్చు పెడతారా? అని ఫైర్ అయ్యారు.

దీనిపై మంత్రి బొత్సకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే అప్పలనాయుడు అసహనం వ్యక్తం చేశారు. అందుకే నేరుగా పార్టీ అధిష్ఠానానికే ఫిర్యాదు చేస్తానని అన్నారు. అప్పలనాయుడు చేసిన వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి.

కాగా, పంచాయతీ ఎన్నికల తరుణంలో పలు చోట్ల అధికార వైసీపీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో మంత్రులు బొత్స, అనిల్ యాదవ్ ల సమక్షంలోనే ఎమ్మల్యే ఆర్థర్, నియోజకవర్గ ఇంచార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలు ఘర్షణ పడ్డారు.