ఇక ఇంటి దగ్గరే కరోనా రోగులకు చికిత్స, ఆ లక్షణాలుంటేనే ఆసుపత్రికి, కేంద్రం కొత్త మార్గదర్శకాలు

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొన్ని

  • Published By: naveen ,Published On : June 14, 2020 / 02:30 AM IST
ఇక ఇంటి దగ్గరే కరోనా రోగులకు చికిత్స, ఆ లక్షణాలుంటేనే ఆసుపత్రికి, కేంద్రం కొత్త మార్గదర్శకాలు

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొన్ని

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రోజులుగా దాదాపుగా 10వేల పాజిటివ్ కేసులు రికార్డ్ అవుతున్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. వారందరికి ట్రీట్ మెంట్ ఇవ్వడం అంత ఈజీగా కాదు. వైద్యులు, వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాప్తి విస్తృతం అవుతున్న నేపథ్యంలో రోగులకు చికిత్స అందిస్తున్న విధానాలకు సంబంధించి కేంద్రం తాజాగా మరికొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. 

పాజిటివ్‌గా నిర్ధారించిన వారందరినీ ఆస్పత్రికి తీసుకెళ్లరు:
ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇకపై పాజిటివ్‌గా నిర్ధారించిన వారందరినీ ఆస్పత్రికి తీసుకెళ్లడం కంటే వ్యాధి తీవ్రతను బట్టి ఇంటి దగ్గరే చికిత్స అందించేలా కొత్త పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘క్లినికల్‌ గైడెన్స్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ కరోనా’పేరిట మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని పాటిస్తూ కరోనా పేషంట్లకు చికిత్స అందించాలని సూచించింది. 

కరోనా రోగులు 3 కేటగిరీలుగా విభజన:
* కరోనా రోగులను మూడు రకాలుగా విభజన. 
* రోగి లక్షణాలు, తీవ్రతను బట్టి మైల్డ్‌ (స్వల్ప లక్షణాలు), మోడరేట్‌ (వ్యాధి తీవ్రత మధ్యస్తంగా ఉంటే జ్వరం, దగ్గు తదితర లక్షణాలు కలిగి ఉండటం), సివియర్‌ (లక్షణాలు తీవ్రంగా ఉండటం) కేటగిరీలుగా గుర్తిస్తారు. 
* స్వల్ప లక్షణాలతో ఉన్న వారికి ఇంట్లోనే క్వారంటైన్‌ చేసి చికిత్స. 
* అయితే వైద్యుల సలహా మేరకు ఇంటి దగ్గర చికిత్స అందించే స్థాయి వాళ్లను మాత్రమే ఈ కేటగిరీగా గుర్తిస్తారు. 
* మోడరేట్, సివియర్‌ కేటగిరీల్లోని రోగులను తప్పకుండా ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందించాలి.

మోడరేట్‌ లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రికి తరలింపు:
తాజా మార్గదర్శకాల ప్రకారం.. మోడరేట్‌ కేటగిరీ రోగులపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. వీరికి లక్షణాలు ఉండటం వల్ల చికిత్సలో నిర్లక్ష్యం జరిగితే సివియర్‌గా మారే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వారి ప్రాణాలు కాపాడేందుకు మోడరేట్‌ స్థాయిలోనే చికిత్స అందించి కోలుకునేలా చేయాలనేది కేంద్రం ప్రధాన ఉద్దేశ్యం. మోడరేట్‌గా గుర్తించిన వారిని జిల్లా ఆస్పత్రి లేదా కరోనా కోసం గుర్తించిన ఆరోగ్య కేంద్రంలోకి తరలించి చికిత్స చేయాలి. కరోనా వైరస్‌ రోగి ఊపిరితిత్తులపైనే కాకుండా రక్తనాళాలపైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో రక్తం గడ్డకట్టకుండా నిర్దేశించిన మందులను ముందే ఇస్తే మంచి ఫలితం ఉంటుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. 

రోగి నుంచి వైరస్‌ ఇలా సోకుతుంది:
కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే విధానంపై కేంద్రం మరింత స్పష్టత ఇచ్చింది. రోగికి వ్యాధి లక్షణాలు ప్రారంభమయ్యే రెండ్రోజుల ముందు నుంచి.. లక్షణాలు మొదలైన 8 రోజుల వరకు ఇతరులకు సోకే వీలుంటుంది. మొత్తంగా 10 రోజుల పాటు వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువని కేంద్రం స్పష్టం చేసింది. అయితే కరోనా వైరస్‌ సోకి, లక్షణాలు లేని వాళ్లు ఎంతమందికి ఈ వైరస్‌ను అంటిస్తారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. 

48 శాతం మందిలో జ్వరం, దగ్గు:
కరోనా వైరస్‌ సోకిన వారిలో ఎక్కువ మంది జ్వరం, దగ్గుతో బాధ పడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేసిన పరిశోధనలో తేలింది. కరోనా సోకిన వారి దరఖాస్తుల్లోని సమాచారం ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చింది. 15,366 మంది దరఖాస్తులను పరిశీలించి విశ్లేషించగా.. అందులో జ్వరం 27%, దగ్గు 21%, గొంతులో గరగర 10%, దమ్ము 8%, బలహీనత 7%, ముక్కు నుంచి నీరు కారడం 3%, ఇతర లక్షణాలున్న వారు 24% మంది ఉన్నట్లు గుర్తించారు.

కరోనా కొత్త లక్షణాలు.. వాసన, రుచి తెలియకున్నా ప్రమాదమే 
కరోనా లక్షణాల్లో తాజాగా వాసన(anosmia), రుచి(ageusia) గుర్తించలేకపోవడాన్ని కేంద్రం తాజాగా జతచేసింది. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తికి జ్వరం, దగ్గు, త్వరగా అలసిపోవడం, దమ్ము రావడం, కీళ్లు, కండరాల నొప్పులు, గొంతులో గరగర, ముక్కు నుంచి నీరు కారడం, విరోచనాలు తదితర లక్షణాలుంటాయి. తాజాగా కేంద్రం కరోనా లక్షణాల్లో వాసన, రుచి గుర్తించకపోవడాన్ని జోడించింది. కరోనా వైరస్‌ సోకిన పిల్లల్లో మాత్రం ఈ లక్షణాలు కనిపించవు. వారికి త్వరగా నయమయ్యే అవకాశం ఉన్నా.. ఎక్కువ వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది. మరోవైపు వయసు పైబడ్డ వారిలో, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ లక్షణాలకు బదులుగా చికాకుగా ఉండటం, ఒక్కసారిగా మంచం పైనుంచి లేవలేని పరిస్థితికి వెళ్లడం, సోయి లేకుండా పోవడం, విరోచనాలు ఉంటాయి.

వెంటిలేటర్ చివరి ప్రయత్నం:
కరోనా వైరస్‌ సోకిన రోగికి కృత్రిమ శ్వాస అందించడం చివరి ప్రయత్నంగా ప్రభుత్వం నిర్దేశించింది. అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాతే ఈ పద్ధతి ఎంచుకోవాలి. అయితే ఈ ప్రయత్నాన్ని అమలు చేసే ముందు రోగి మూత్రపిండాలు, కాలేయం పని తీరు సంతృప్తికరంగా ఉంటేనే చేయాలి. కృత్రిమ శ్వాసలో భాగంగా ఎక్కువ ఆక్సిజన్‌ను అందిస్తారు. ఎన్-95 మాస్కులు ఐసీయూలో ఉండే వైద్యులు, వైద్య సిబ్బంది మాత్రమే వాడాలి. మిగతా రోగులకు మాత్రం ట్రిపుల్‌ లేయర్‌ మాస్కులు ఇస్తే సరిపోతుంది. కరోనా రోగుల్లో 60 ఏళ్లు పైబడిన వాళ్లు, షుగర్, బీపీ, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు, అవయవాలు మార్పిడి చేసుకున్న వాళ్లతో పాటు ఇతర కారణాలతో రోగనిరోధక శక్తి తగ్గించే మందులు వాడే వాళ్లలో రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది.

భారత్‌లో కరోనా ఉగ్రరూపం:
దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. శుక్రవారం(జూన్ 12,2020) ఉదయం నుంచి శనివారం(జూన్ 13,2020) ఉదయం వరకు దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 11,458 మందికి వైరస్‌ సోకింది. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల మొత్తం 3,08,993కు చేరాయి. గత 24 గంటల్లో 386 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 8,884కు చేరింది. 1,54,329 మంది (49.9 శాతం) వ్యాధి నుంచి కోలుకోగా, 1,45,779 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.