ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. ఏపీలో కాషాయ నేతలకు కొత్త చిక్కులు

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. ఏపీలో కాషాయ నేతలకు కొత్త చిక్కులు

ముందునుయ్యి.. వెనుకగొయ్యి అన్నట్టు తయారైంది ఏపీ బీజేపీ నేతల పరిస్థితి. మోదీ ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయంతో కాషాయ నేతలకు కొత్త చిక్కులను తీసుకొస్తుంది.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం… రాబోయే మున్సిపల్ ఎన్నికలపై పెను ప్రభావం చూపే ప్రభావం ఉండటంతో కాషాయ నేతలు ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయం ఏపీ బీజేపీ నేతలను ఇరుకున పడేయగా.. మరికొన్ని రోజుల్లో ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేంద్రం చేపట్టిన ప్రైవేటీకరణ అంశం తెరముందుకు వచ్చింది. ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం తథ్యమన్నట్టు బీజేపీ అగ్రనేతల ప్రకటనలు ఉండగా.. ప్రధాని మోదీ కూడా పరోక్షంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. జీవీఎల్ నరసింహరావు కూడా విశాఖ ఉక్కు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కూడా ఇప్పటికే ప్రకటించారు.

దీంతో మున్సిపల్ ఎన్నికల వేళ కాషాయదళ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో ఉద్యమాలు ఉధృతం అవుతుండగా.. అధికార, విపక్ష నేతలు సైతం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఆందోళనలకు దిగుతున్నారు.. దీంతో స్థానిక బీజేపీ నేతలు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించలేక.. స్థానిక ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడలేక సతమతం అవుతున్నారు.

మరికొన్ని రోజుల్లో జరగబోయే గ్రేటర్‌ వైజాగ్‌ మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ మౌనం తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్థానిక పరిస్థితులను గమనించిన కాషాయ నేతలు కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు.. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఇప్పుడే జరగదని జనానికి సర్థిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌పై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ మండిపడుతున్నారు. కేంద్రం నిర్ణయంతో స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగబోదని హామీ ఇచ్చారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.

ఏపీలో బీజేపీ ఒక్క సీటు గెలవకపోయినా… అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చారు జీవీఎల్‌. టీడీపీ, వైసీపీలు బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని అంటున్నారు. విశాఖలో పర్యటించిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం విశాఖ నగరానికి చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ కరపత్రికను విడుదల చేశారు. మున్సిపల్‌ ఎన్నికలకు ముందు బీజేపీపై పెరిగిన వ్యతిరేకతను తగ్గించడానికే జీవీఎల్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.