అధికారులకు రక్షణ కవచం ఉంటుందంటూ నిమ్మగడ్డ భరోసా

అధికారులకు రక్షణ కవచం ఉంటుందంటూ నిమ్మగడ్డ భరోసా

Nimmagadda: రాజ్యాంగ రక్షణ ఉంటుందని ఎటువంటి విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భరోసా ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు, ఇతర స్టాఫ్ లకు ధైర్యం చెబుతూ సూచనలు ఇచ్చారు. ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులు ఎస్‌ఈసీ రక్షణ కవచంలో ఉంటారని అన్నారు. ఎలక్షన్ డ్యూటీలో ఉన్న అధికారులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా ఎస్‌ఈసీ ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, దీనిపై సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన గైడ్‌లైన్స్ ఉన్నాయని స్పష్టం చేశారు.

ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్‌పై ముందస్తు పర్మిషన్ లేకుండా చర్యలను నిషేధిస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీచేస్తామన్నారు. ఎలక్షన్ స్టాఫ్‌ను బెదిరించే ప్రకటనలు అవాంఛనీయమని, అధికారులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు అనైతికమని ఆక్షేపించారు. ఎలక్షన్ స్టాఫ్‌ను భయపెట్టే చర్యలను ఉపేక్షించేది లేదన్నారు. మనుషులు మారుతుంటారని.. వ్యవస్థలనేవి శాశ్వతంగా నిలిచిపోతాయనే విషయం గుర్తించాలని నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సూచించారు.

అంతకంటే ముందు పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. :
ఎస్ఈసీ చర్యలపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు కట్టుబడి ఉంటానని తెలిపారు. నిమ్మగడ్డ, చంద్రబాబు కలిసి ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల అధికారి చట్టబద్ధంగా వ్యవహరించకుంటే వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏపీ పంచాయతీ మంత్రి తాను కాబట్టి తనతో మాట్లాడాలి..కానీ నిమ్మగడ్డ.. చంద్రబాబుతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో నిమ్మగడ్డ పని చేస్తున్నారన్నారు.