సండే కూడా సెలవు లేదు

సండే కూడా సెలవు లేదు

కరోనా, ఆర్థికమాంద్యం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో ఆదాయాన్ని పెంచుకోవడంపై సర్కార్ దృష్టి సారించింది. ఖజానా పెంచుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ప్రభుత్వానికి ఎక్సైజ్‌శాఖతోపాటు.. రిజిస్ట్రేషన్ల ద్వారా కూడా భారీగా ఆదాయం వస్తోంది. రిజిస్ట్రేషన్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈనెలలో రెండో శనివారంతోపాటు ఆదివారాలు కూడా రిజిస్ట్రేషన్లు జరపాలని నిర్ణయం తీసుకుంది.

మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో ఆదివారాలు, రెండో శనివారం కూడా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు పనిచేయనున్నాయి. మహాశివరాత్రి, హోళి పర్వదినాలు తప్ప.. అన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ధరణి పోర్టల్‌ రూపకల్పన కోసం.. గత సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ 14 వరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. వ్యవసాయ భూమల రిజిస్ట్రేషన్‌ డిసెంబర్‌ 29 నుంచి ధరణి పోర్టల్‌ ద్వారా ప్రారంభం అయ్యాయి.

రాష్ట్రంలోని 574 మండలాల రెవెన్యూ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మరోవైపు 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల కూడా జరుగుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఆస్తుల క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. ఒక్కో కార్యాలయంలో రోజుకు దాదాపు రెండు వందల డాక్యుమెంట్లు రిజిస్ట్రర్‌ అవుతున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్న ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సెలవు దినాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరుపనున్నట్టు రెవెన్యూశాఖ తెలిపింది.

ఎక్సైజ్‌ శాఖ నుంచి కూడా సర్కార్‌కు భారీగా ఆదాయం సమకూరుతోంది. 2020 ఏప్రిల్‌ నుంచి గత ఫిబ్రవరి వరకు ఏకంగా 24వేల 814 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో వ్యాట్‌పోగా.. ఎక్సైజ్‌శాఖకు 15వేల కోట్ల ఆదాయం చేకూరింది. కరోనా వైరస్‌ కొన్ని నెలలు ఇబ్బందులు సృష్టించినా.. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. ప్రతిరోజు 5క్షల 60వేల బీర్లు, 8 లక్షల 22వేల లీటర్ల లిక్కర్‌ అమ్ముడుపోతున్నట్టు ఎక్సైజ్‌శాఖ తెలిపింది. జనవరి మాసంలో 33 లక్షల బీర్లు, 28 లక్షల కేస్‌ల లిక్కర్‌ విక్రయించారు. దీంతో జనవరిలోనే ప్రభుత్వ ఖజానాకు 2వేల 727 కోట్ల ఆదాయం వచ్చింది.

ఈరెండు శాఖలేకాదు.. ట్రాఫిక్‌ పోలీస్‌ , విద్యుత్‌, ఆస్తి పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈనెలతోనే ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో… ఖజానా పెంచుకోనే చర్యలు స్పీడప్‌ చేసింది. తెలంగాణలో సండే కూడా రిజిస్ట్రేషన్‌ ఆఫీసులు పనిచేయనున్నాయి. ఈనెలంతా సండే… సెకండ్‌ సాటర్‌డే అన్న తేడా లేకుండా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు తెరిచే ఉంటాయి. ఒక్క మహాశివరాత్రి, హోళీ పండుగ రోజుల్లో తప్ప మిగతా రోజులన్నీ పనిచేస్తాయి. ఈ మేరకు రెవెన్యూశాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు.