No Mid-day Meal without Aadhaar card : ఆధార్‌కార్డు ఉంటేనే విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం .. ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఆధార్ కార్డు లేకపోతే స్కూల్ విద్యార్ధులకు అన్నం పెట్టేదిలేదంటోంది ప్రభుత్వం. ఈ ప్రభావం లక్షలాది చిన్నారులపై పడనుంది.

No Mid-day Meal without Aadhaar card : ఆధార్‌కార్డు ఉంటేనే విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం .. ప్రభుత్వం సంచలన నిర్ణయం

No mid-day meal without Aadhaar card

No mid-day meal without Aadhaar card : ఆధార్ కార్డు. అన్నింటికి ఆధారం అదే. ఈ ఆధార్ కార్డు పేరుతో చిన్నారుల చిరుబొజ్జలు నింపటానికి కూడా కావాలంటోంది ప్రభుత్వం. స్కూళ్లలో చిన్నారులకు మధ్యాహ్నా భోజనం (మిడ్డే మీల్స్) పెట్టాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి అంటోంది మహారాష్ట్రలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం. అంతేకాదు ఆధార్ కార్డు లేకపోతే భోజనంతో పాటు స్కూల్‌ యూనిఫాంలూ కూడా ఇచ్చేది లేదంటోంది ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం. ఈ నిర్ణయం లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది. బిడ్డలకు అన్నం లేకుండా కడుపులో మాడ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఈ నిర్ణయాన్ని అన్ని స్కూళ్లలోను 2023 జనవరి నుంచి అమలు చేస్తామని ఉత్తర్వులు జారీ చేసింది షిండే ప్రభుత్వం.

షిండే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 59 లక్షల మంది చిన్నారులపై ప్రభావం పడనుంది. చాలామంది చిన్నారులకు ఆధార్‌ లేకపోవడమో..లేదా ఉన్నా వివరాలు తప్పుగా ఉండటం వంటి సమస్యలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యలు ఉన్న చిన్నారులు కడుపు కాల్చుకోవాల్సిన పరిస్థితి రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్స్, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 2,33,13,762 మంది విద్యార్థులు చదువుకొంటున్నారని.. వీరిలో 19,55,515(8 శాతం) మంది పిల్లలకు అసలు ఆధార్‌ కార్డులే లేవని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డాటా చెబుతోంది. ఇకపోతే 40,01,250(18%) విద్యార్థులకు వాలిడ్‌ ఆధార్‌ కార్డులు( అంటే పేరు, పుట్టిన తేదీ, వంటివి తప్పులు ఉండటం) లేవు.

ప్రభుత్వ బడిలో అడ్మిషన్‌కు ఆధార్‌ తప్పనిసరి కాదని..కానీ భోజనం వంటి ఇతర సదుపాయాలు పొందాలంటే ఆధార్‌ తప్పనిసరని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులందరూ డిసెంబర్‌ 20లోగా ఆధార్‌ కార్డు పొందేలా చర్యలు తీసుకోవాలని టీచర్లకు డెడ్‌లైన్‌ కూడా పెట్టింది విద్యాశాఖ. పిల్లలకు ఆధార్ కార్డు ఉండేలా చర్యలుతీసుకోవాలని టీచర్లకు అదనపు పని పెట్టారు. ఆధార్‌ తప్పనిసరితో ప్రతికూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. సాధారణంగా నమోదు చేసుకొన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రతి పాఠశాలకు ఉపాధ్యాయుల పోస్టులు కేటాయిస్తారు. ఈ కొత్త నిబంధన ఉపాధ్యాయ రిక్రూట్‌మెంట్‌పై ప్రభావం చూపుతుందని అంటున్నారు విశ్లేషకులు.

కాగా..మధ్యాహ్న భోజన పథకం అనేది భారతదేశంలో పాఠశాల భోజన కార్యక్రమం. దేశవ్యాప్తంగా పాఠశాల వయస్సు పిల్లల పోషకాహార స్థితిని మెరుగుపరచడానికి రూపొందించబడింది. ఈ కార్యక్రమం పిల్లలకు పని దినాలలో ఉచిత భోజనాన్ని సరఫరా చేస్తుంది. మరి ముఖ్యంగా గ్రామీణ లేదా గిరిజన ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పాఠశాలల్లో నమోదుకు ఇది ఒక ప్రధాన అంశం. అటువంటి ఉద్ధేశ్యంతో రూపొందిన ఈ కార్యక్రమం ఆధార్ కార్డు పేరుతో ఇటువంటి రూల్స్ పెట్టటంతో చిన్నారులు పోషకాహారానికి దూరమయ్యే ప్రమాదం ఉంది.