రోడ్లపై గుంత కనిపిస్తే.. ఫోన్లో క్లిక్‌ కొట్టు.. వాట్సాప్‌‌లో షేర్ కొట్టు!

  • Published By: srihari ,Published On : June 13, 2020 / 08:37 AM IST
రోడ్లపై గుంత కనిపిస్తే.. ఫోన్లో క్లిక్‌ కొట్టు.. వాట్సాప్‌‌లో షేర్ కొట్టు!

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌‌లో రోడ్లు ఎంత అధ్వన్నంగా ఉంటాయో చెప్పనక్కర్లేదు. అందుకే ముందుగానే తక్షణ పరిష్కారాలు చూపేందుకు నగర జీహెచ్‌ఎంసీ రెడీ అయింది. గ్రేటర్‌ ప్రధాన రహదారుల మార్గాల్లో గుంతలు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే రోడ్ల నిర్వహణ బాధ్యతల్ని ఐదేళ్లపాటు కాంట్రాక్టు ఏజెన్సీలకిచ్చింది. ఈ ఒప్పందంతో ఆయా మార్గాల్లో రోడ్ల నిర్మాణాలతో పాటు మరమ్మతులు చేయాల్సి ఉంది. రోడ్లు దెబ్బతిన్నా, గుంతలు ఏర్పడినా సమస్యలను పరిష్కరించే బాధ్యత కాంట్రాక్ట్ ఏజెన్సీలపైనే ఉంది. 

అలాగే నగర వాసుల ఫిర్యాదులను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఆయా ఏజెన్సీలదే. వర్షాకాలం ప్రారంభంతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏజెన్సీలు ఫోన్‌/వాట్సాప్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చాయి. అందుకే ఎవరైనా రోడ్లపై గుంతలు వంటి సమస్యలు కనిపించినప్పుడు వెంటనే ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. అంతేకాదు.. ఫొటోతీసి వాట్సాప్‌ ద్వారా కూడా పంపించవచ్చు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా సమస్య పరిష్కరించాల్సి ఉంటుంది. లేదంటే సంబంధిత కాంట్రాక్టు ఏజెన్సీకి జీహెచ్‌ఎంసీ జరిమానా విధిస్తుంది. 

మ్యాన్‌హోల్‌ కవర్, క్యాచ్‌పిట్‌ కవర్‌ ఇతర సమస్యల్ని ఆరు గంటల్లోనే పరిష్కరించాలి. ఫుట్‌పాత్‌ల మరమ్మతు పనులు మాత్రం 48 గంటల్లో,  పెద్ద ప్యాచ్‌లు 72 గంటల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. కాంటాక్ట్‌ ఏజెన్సీలు ప్రధాన కూడళ్లలో సైన్‌బోర్డులపై ఫోన్, వాట్సాప్‌ నంబర్‌లను అందుబాటులో ఉంచాలి. ప్రధాన మార్గాల్లో రోడ్లపై ప్రయాణ సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యే ఫిర్యాదు చేయొచ్చు. జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌ 040– 21 11 11 11 నెంబర్ ఫోన్ చూసి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.