రేపే గ్రేటర్‌ ఫలితాలు‌.. బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం

  • Published By: bheemraj ,Published On : December 3, 2020 / 08:00 AM IST
రేపే గ్రేటర్‌ ఫలితాలు‌.. బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం

Greater Election Counting : గ్రేటర్ పోరులో.. అభ్యర్థుల భవితవ్యం రేపు తేలిపోనుంది. బల్దియా ఎన్నికల్లో సగానికంటే తక్కువే పోలింగ్‌ నమోదు కాగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కొన్ని డివిజన్లలో మధ్యాహ్నం వరకే ఫలితాలు వచ్చే అవకాశం ఉండగా.. మరిన్ని చోట్ల రిజల్ట్స్‌ ఆలస్యమయ్యే ఛాన్స్‌ ఉంది. మరి ముందు ఏ డివిజన్ ఫలితాలొస్తాయి..? ఏ డివిజన్‌లో ఎన్ని రౌండ్ల కౌంటింగ్‌ జరుగుతుంది.



గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు సిద్ధమవుతున్నారు. స్ట్రాంగ్ రూముల్లో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని శుక్రవారం తేల్చనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లోని.. కౌంటింగ్ సెంటర్లలో 150 హాల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి హాల్‌కు 14 టేబుల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్‌.. ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు.



బల్దియా పోరులో.. మొత్తం 46.55 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 74 లక్షల 67 వేల 256 మంది ఓటర్లలో.. 34 లక్షల 50 వేల 331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18 లక్షల 60 వేల 40 మంది పురుషులు.. 15 లక్షల 90 వేల 219 మంది మహిళలు ఓటేశారు. ఇతరులు 72 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.



పోలైన ఓట్లను అధికారులు ఓ క్రమపద్ధతిలో లెక్కించనున్నారు. బ్యాలెట్ పేపర్లు అన్ని టేబుల్స్‌పై వేసి 25 బ్యాలెట్లను ఒక బండెల్‌గా రూపొందిస్తారు. తర్వాత వాటిని వరుసగా డ్రమ్ముల్లో వేసి కలుపుతారు. అన్ని బాక్సుల్లోని బ్యాలెట్లు బండెల్స్‌గా మార్చిన తర్వాత ప్రతి టేబుల్‌కు వెయ్యి బ్యాలెట్ పేపర్లు.. అంటే 40 బండెల్స్‌ను పంచుతారు. వాటిని బండెల్‌ వారిగా గుర్తులు చూస్తూ.. అభ్యర్థుల వారీగా ఓట్లను వేరు చేస్తారు.



ఇలా సాగే లెక్కింపులో ఒక్క రౌండ్‌కి 14 వేల ఓట్లు లెక్కింపు పూర్తవుతుంది. ఇలా వచ్చే ఫలితాల్లో మొదటి ఫలితం మెహిదీపట్నం డివిజన్‌లో వచ్చే అవకాశం ఉంది. ఈ డివిజన్‌లో 11 వేల 818 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక మైలార్‌దేవరపల్లిలో అత్యధికంగా 37 వేల 445 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ మూడు రౌండ్లలో ఫలితం రానుంది.



ఇక 150 డివిజన్లలో 136 డివిజన్లకు చెందిన ఫలితాలు రెండవ రౌండ్లో రానున్నాయి. వీటిలో 28 వేల కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. దాంతో రెండు రౌండ్లలో ఓటింగ్‌ కంప్లీట్ అవుతుంది. ఇక మూడు రౌండ్లు లెక్కపెట్టాల్సిన డివిజన్లు 13 ఉన్నాయి. ఇందులో ఉప్పల్, కంచన్‌బాగ్, మైలార్‌దేవరపల్లి, అంబర్‌పేట్‌, రహమత్‌నగర్, కొండాపూర్, అల్లాపూర్, ఓల్డ్ బోయిన్‌పల్లి, సుభాశ్‌నగర్‌, గాజుల రామరం, తార్నాక, సీతాఫల్‌మండి, బన్సీలాల్‌పేట్‌ డివిజన్లలో మూడు రౌండ్ల కౌంటింగ్ జరగనుంది.



ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. ప్రతి టేబుల్ దగ్గర సీసీ కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా రికార్డు చేయనున్నారు అధికారులు. కోవిడ్ నివారణ చర్యలో భాగంగా ప్రతి టేబుల్ వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంటుంది. అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాల్‌లోకి రావాల్సి ఉంటుందంటున్నారు అధికారులు. బ్యాలెట్ లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్లను కౌంట్ చేస్తారు.