Cow Village : ఆ ఊరిలో అవులేని ఇల్లే లేదు..

ఎ.రంగంపేట గ్రామస్థులు పశువులే పంచ ప్రాణాలుగా భావించారు. ఇంటికి ఒక గోవును పెంచుకుంటూ మూగజీవాల పట్ల అంతులేని అనురాగాన్ని చూపుతున్నారు.

Cow Village : ఆ ఊరిలో అవులేని ఇల్లే లేదు..

One Cow In Every House In A Rangampet

One cow in every house : గంగి గోవు పాలు గరిటడైనను చాలు.. అన్న ఒక్క మాట చాలు గోసంపద గొప్పతనాన్ని చెప్పటానికి. ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆ గ్రామస్థులు పశువులే పంచ ప్రాణాలుగా భావించి ఇంటికి ఒక గోవును పెంచుకుంటూ మూగజీవాల పట్ల అంతులేని అనురాగాన్ని చూపుతున్నారు. కుటుంబంలో ఒక్కటిగా గుర్తించి కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఆవులే వారి శ్వాస.. ధ్యాస.. అన్నట్లు బతుకుతున్నారు. చంద్రగిరి మండలం ఎ.రంగంపేట గ్రామస్థులు పశు సంపదపై మక్కువతో కన్నబిడ్డతో సమానంగా గోవులపై మమకారాన్ని పెంచుకున్నారు.

ప్రతి ఇంట్లో ఒక గోవు
ఆవుల సంతతి పెంచటం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. లేగ దూడల నుంచి పాడి ఆవుల వరకు గ్రాసం కొరత లేకుండా సంరక్షణ చేస్తున్నారు. ప్రతి ఇంట్లో ఒక గోవును పెంచుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. మహిళలు పాడి ఆవులను పాల కోసం కాక పశు సంపదను పెంచటానికి పోషించటం విశేషం. గ్రామంలో నివాస గృహాల మధ్యన గోశాలలు ఏర్పాటు చేసుకొని తమ కుటుంబంలో ఒక భాగంగా గోవులను ప్రేమిస్తుండటం వారి ప్రత్యేకత.

అడవులే ఆధారం
గ్రామం చుట్టూ అడవులు విస్తరించి ఉండటంతో ఆవులు అన్నీ అడవులపై ఆధారపడి జీవిస్తున్నాయి. నిత్యం మేత కోసం అడవికి వెళ్లే ఆవులు చీకటి పడగానే ఇంటికి చేరుతాయి. గ్రామంలో పశు పోషణ చేస్తున్న వారంతా ఆవులనే ఆస్తులుగా భావిస్తున్నారు. వంద కుటుంబాలు నివసిస్తున్న గ్రామంలో ఇంటికొక ఆవు ఉంది. పశు సంపదపై మక్కువ పెంచుకున్న గ్రామస్థులు మనుషులతో సమానమైన గౌరవాన్ని పశువులకు కల్పిస్తున్నారు. మనిషి పుట్టినప్పటి నుంచి మట్టిలో కలిసేంత వరకు హిందూ సంప్రదాయం ప్రకారం ఏ రకమైన ఆచారాలను అనుసరిస్తారో అవన్నీ గోవులకు వర్తింప చేస్తున్నారు.

గోవులకు సీమంతం
లేగ దూడలు పుట్టిన పది రోజులకు స్నానం చేయించి పసుపు, కుంకుమతో అందంగా అలంకరిస్తారు. గోవులు కట్టుకు వచ్చిన ఆరు మాసాలకు సీమంతం చేస్తారు. అనుకోని దుర్ఘటనలతో గోవులు మరణిస్తే ఖనన సంస్కారాల్లోను కన్నీటి వీడ్కోలు పలుకుతారు. సంక్రాంతి పర్వదినాల్లో ఒక్కటైన కనుమ రోజున గ్రామంలో కనుమ సందడి నెలకొంటుంది. ఇలా గోమాత పట్ల చూపుతున్న ప్రేమానురాగాలను ప్రభుత్వం గుర్తించి రాయితీతో గోశాలల నిర్మాణం, వేసవిలో పశుగ్రాసం సరఫరా చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.