Imran Khan To Get Arrested : FIA రెండోసారి నోటీసులు .. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తప్పదా?

పదవిపోయిన తర్వాత పాకిస్తాన్‌లో అత్యంత సహజంగా జరిగే పరిణామం ఏమిటంటే..అప్పటిదాకా అధికారంలో ఉన్న వారు జైలు ఊచలు లెక్కపెట్టడం. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కూడా ఇది తప్పేలాలేదు. అతి త్వరలో ఆయన అరెస్టు కానున్నారని పాక్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

Imran Khan To Get Arrested :  FIA రెండోసారి నోటీసులు .. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తప్పదా?

Imran Khan To Get Arrested

Imran Khan To Get Arrested : పదవిపోయిన తర్వాత పాకిస్తాన్‌లో అత్యంత సహజంగా జరిగే పరిణామం…అప్పటిదాకా అధికారంలో ఉన్న వారు జైలు ఊచలు లెక్కపెట్టడం. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కూడా ఇది తప్పేలాలేదు. అతి త్వరలో ఆయన అరెస్టు కానున్నారని పాక్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అక్రమ ఫండింగ్ కేసుతో పాటు…ఇప్పుడు ఆయనపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదయింది. అటు ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాలను టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయకుండా పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అధారిటీ నిషేధం విధించింది.

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయనపై నమోదైన అక్రమ ఫండింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మరోసారి ఇమ్రాన్‌కు నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజరుకావాల్సిందిగా గత బుధవారం ఇచ్చిన మొదటి నోటీసుకు ఇమ్రాన్ స్పందించకపోవడంతో రెండో నోటీసిచ్చింది FIA. ఈ నోటీసుకు కూడా ఇమ్రాన్ స్పందించలేదు. విచారణకు హాజరయ్యేందుకు నిరాకరించారు. దీంతో మరోసారి నోటీసులివ్వనుంది దర్యాప్తు సంస్థ. ఆ తర్వాత కూడా ఇమ్రాన్ స్పందింకపోతే..ఆయన అరెస్టుపై FIA నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇమ్రాన్‌ఖాన్ పార్టీకి సంబంధించి ఐదు కంపెనీలు…అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, బెల్జియంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు FIA గుర్తించింది. కానీ ఈ కంపెనీల వివరాలను ఇమ్రాన్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించలేదని దర్యాప్తులో తేలింది.

మొదటి నోటీసుల తర్వాత వాటిని వెనక్కి తీసుకోకపోతే న్యాయపరమైన చర్యలకు దిగుతానని ఇమ్రాన్ FIAను హెచ్చరించారు. ఆ తర్వాతే ఆయనకు మరో నోటీసుచ్చింది FIA. ఈ వారంలో మూడో నోటీసు ఇవ్వనుంది. ఇమ్రాన్ నేరం చేసినట్టు నిరూపితమయ్యే ఆధారాలను FIA సేకరించినట్టు ప్రచారం జరుగుతోంది. భారత సంతతి మహిళా వ్యాపారవేత్తలు సహా 34 మంది విదేశీయుల నుంచి ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ నిధులు అందుకున్నట్టు ఈ నెల మొదట్లోనే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇమ్రాన్‌కు షోకాజ్ నోటీసులు కూడా జారీచేసింది. విదేశీయులు, విదేశీ కంపెనీల నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిధులు పొందడంపై ఇమ్రాన్ వివరణ ఇవ్వాలని కోరింది. అయితే ఎన్నికల కమిషన్‌పై ఇమ్రాన్ ఎదురుదాడి చేస్తున్నారు. ఎన్నికల కమిషనర్ తన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

అవిశ్వాసతీర్మానంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో పదవి కోల్పోయారు ఇమ్రాన్. అప్పటినుంచి ఆయన అరెస్టుపై ప్రచారం జరుగుతోంది. అక్రమార్జన, విదేశాల నుంచి నిధులు పొందారన్న ఆరోపణలపై ఆయన్ను తక్షణమే అరెస్టు చేస్తారని భావించారు. ప్రభుత్వం కూలిపోయిన వెంటనే, పదవుల్లో ఉన్నవారు దిగిపోయిన వెంటనే…ఏదో ఓ కేసులో వారు నేతలు అరెస్టు కావడం, జైలు జీవితం గడపడం పాకిస్తాన్‌లో సహజసిద్ధ పరిణామం. అయితే ఇప్పటిదాకా షెహబాజ్ షరీఫ్‌ ప్రభుత్వం ఇమ్రాన్‌ను అరెస్టు చేయలేదు. దీంతో ఇమ్రాన్‌పై ప్రభుత్వం కక్షసాధింపుకు దిగలేదని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఆయన అరెస్టు ఖాయమని భావిస్తున్నారు. గత వారం ఇమ్రాన్ అనుచరుడు షాబాజ్ గిల్‌ అరెస్టు కావడంతో తర్వాతి వంతు మాజీ ప్రధానిదేనన్న ప్రచారం సాగుతోంది.

అటు పదవి నుంచి దిగిపోయిన దగ్గర నుంచి ఇమ్రాన్ ఖాన్ ప్రజల్లో కలియతిరుగుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేసి…మళ్లీ ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తూ..భారీ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ సభలు, సమావేశాల్లో ఆయన సహజంగానే ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే నోటీసుల తర్వాత ఆయన పోలీసులను, అధికారయంత్రాంగాన్ని, ఎన్నికల కమిషన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనిపై పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అధారిటీ అభ్యంతరం వ్యక్తంచేసింది ఇమ్రాన్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ప్రజల ప్రశాంతతను చెదరగొడుతున్నారని ఆరోపిస్తూ ఆయన ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం చేయకుండా నిషేధం విధించింది. తాజాగా ఓ జడ్జిని, ఇద్దరు పోలీసు అధికారులను బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదయింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే…ఈ వారం తర్వాత ఇమ్రాన్ ఏ క్షణమైనా అరెస్టయ్యే అవకాశం కనిపిస్తోంది.