10వేల కోసం 12ఏళ్ల కూతురిని అమ్మానాన్నలే అమ్మేశారు, గుండెలు పిండే విషాదం

10వేల కోసం 12ఏళ్ల కూతురిని అమ్మానాన్నలే అమ్మేశారు, గుండెలు పిండే విషాదం

parents sold daughter for money: ఏ తల్లి అయినా తండ్రి అయినా పిల్లలను కళ్లలో పెట్టుకుని చూసుకుంటారు. వారికి చిన్న కష్టం వచ్చినా విలవిలలాడిపోతారు. పిల్లల సంతోషం కోసం ఏమైనా చేస్తారు. తాము తిన్నా తినకున్నా.. పిల్లలకు కడుపు నిండా తిండిపెడతారు. అదీ అమ్మానాన్న ప్రేమంటే.

అయితే ఆ అమ్మా, నాన్న మాత్రం.. కన్నకూతురినే అమ్మేశారు. 10వేల రూపాయలకు విక్రయించారు. పాపను కొనుక్కున్న 46ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరులో ఈ ఘటన జరిగింది. కన్నతల్లిదండ్రులే పాపను ఎందుకు అమ్మేశారని ఆరా తీస్తే, అసలు విషయం తెలిసింది. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, ఆసుపత్రిలో ఉన్న మరో కూతురిని బతికించుకోవడానికి ఇలా చేశారని తెలిసింది.

నెల్లూరు నగరంలోని కొత్తూరుకు చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆస్పత్రిలో ఉంచి వైద్యం చేయిస్తున్నారు. రోజూ పనికి వెళితేగానీ కుటుంబం గడవదు. దీంతో పాప చికిత్సకు డబ్బులేక ఇబ్బందులు పడ్డారు. దంపతుల ఇంటికి సమీపంలోనే ఉండే మానికల చిన్నసుబ్బయ్య (46) కన్ను ఈ కుటుంబంపై ఉంది.

భార్య కొన్నేళ్ల కిందటే ఎటో వెళ్లిపోవడంతో అతడు ఈ బాలికను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తెలుసుకుని రూ.10 వేలకు ఆ బాలికను కొనుక్కున్నాడు. రెండు రోజుల కిందట ఆ బాలికను పెళ్లి చేసుకున్న అతడు బుధవారం(ఫిబ్రవరి 24,2021) రాత్రి విడవలూరు మండలం దంపూరులోని తన బంధువుల ఇంటికి తీసుకొచ్చాడు.

కాగా, రాత్రి సమయంలో బాలిక పెద్దగా ఏడవడంతో స్థానికులు ఆరాతీశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడివారు వెంటనే సర్పంచి దృష్టికి తీసుకెళ్లారు. బాలికను మరొకరి ఇంట్లో ఉంచారు. గురువారం(ఫిబ్రవరి 25,2021) సచివాలయ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్‌ అధికారులు దంపూరు వచ్చారు. స్థానికులు బాలికను వారికి అప్పగించారు. అధికారులు ఆ బాలికను నెల్లూరులోని శిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు.

చిన్న పాప, కన్న కూతురు అని కూడా చూడకుండా, డబ్బు కోసం తల్లిదండ్రులే అమ్మేశారని తెలిసి తొలుత అంతా కోప్పడ్డారు. ఆ తల్లిదండ్రులను తిట్టిపోశారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అంతా జాలి చూపించారు. అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం ఎంత పని చేయించింది అని కంటతడి పెట్టారు. అధికారులు స్పందించి ఆ అమ్మానాన్నలకు ఆర్థికసాయం చేయాలని కోరుతున్నారు.