టోల్ బాదుడు.. పెరిగిన ఛార్జీలు

టోల్ బాదుడు.. పెరిగిన ఛార్జీలు

Pay More Toll Charges From April 1st As Govt Will Increase Toll Rates Find Out How Much

దేశంలో ఏం నడుస్తుంది అంటే ధరల పెరుగుదల నడుస్తుందని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటుంది కదా? పప్పు, ఉప్పు, నూనెలు, నిత్యావసర వస్తువుల రేట్లు అమాంతం పెరిగిపోతూ ఉండగా.. పెట్రోల్ నుంచి ప్రతీ ఒక్కటి పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సామాన్యుడిపై మరో గుదిబండ పడింది. టోల్ చార్జీలు పెంచుతూ గుత్తేదారు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

జాతీయ రహదారిపై ఒక్క వాహనానికి రానుపోను.. మొత్తంగా కలిపి కనిష్టంగా రూ. 5 నుంచి గరిష్టంగా రూ. 25 వరకు పెరిగింది. నెలవారి పాస్‌కు కనిష్టంగా రూ. 90 నుంచి గరిష్టంగా రూ. 590 వరకు పెరిగింది. లోకల్ పాస్‌కు రూ.10వరకు పెంచారు. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-భూపాలపల్లి జాతీయ రహదారులను BOT పద్దతిలో నిర్మించారు. ఇలా నిర్మించిన రహదారులపై ఏడాదికి ఓ సారి టోల్ ఛార్జ్ పెంచుతారు గుత్తేదారులు. పెరిగిన టోల్ ఛార్జ్ బుధవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది.

ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదించడంతో యాదాద్రి జిల్లాలోని పంతంగి, గూడురు, నల్గొండ జిల్లాలోని కొర్లపహాడ్‌, ఏపీలోని జగ్గయ్యపేట చిల్లకల్లు వద్ద జాతీయ రహదారులపై కొత్త రేట్లు వసూలు చేస్తున్నారు. రేట్ల వివరాలను ఒకసారి చూస్తే..

పంతంగి టోల్‌ప్లాజా వద్ద:

కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ మోటార్‌ వెహికల్‌కు ఒకవైపు రూ. 80, ఇరువైపులా 120, లైట్‌ కమర్షియల్‌, గూడ్స్‌ వెహికల్‌, మినీ బస్సుకు ఒకవైపు రూ. 130, రెండు వైపులా కలిపి రూ. 190, బస్సు, ట్రక్కు ఒకవైపు రూ. 265, ఇరువైపులా కలిపి రూ. 395గా నిర్ణయించారు.

కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద :

కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ మోటార్‌ వెహికల్‌కు ఒకవైపు రూ. 110, ఇరువైపులా కలిపి రూ. 165, లైట్‌ కమర్షియల్‌, గూడ్స్‌ వెహికల్‌, మిని బస్సుకు ఒక వైపు రూ. 175, ఇరువైపులా కలిపి రూ. 260, బస్సు, ట్రక్కు ఒక వైపు రూ. 360, ఇరువైపులా కలిపి రూ. 540గా నిర్ణయించారు.

హైదరాబాద్‌-భూపాలపట్నం:

గూడురు టోల్‌ప్లాజా వద్ద కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ మోటార్‌ వెహికల్‌కు ఒకవైపు రూ. 100, ఇరువైపులా కలిపి రూ. 150, లైట్‌ కమర్షియల్‌, గూడ్స్‌ వెహికల్‌, మినీ బస్సుకు ఒకవైపు రూ. 150, ఇరువైపులా కలిపి రూ. 225, బస్సు, ట్రక్కు ఒకవైపు రూ. 305, ఇరువైపులా కలిపి రూ. 460గా నిర్ణయించారు. హెవీ ట్రక్కులకు భారీగా పెరిగింది. వాటిని 50 నుంచి 600 మధ్య పెంచారు.