IT Raids Planning : ఐటీ రైడ్స్ అంటే ఆషామాషీ కాదు..దాని వెనుక ఎలాంటి ప్లాన్ ఉంటుందో తెలుసా..?!!

ఐటీ రైడ్స్ అంటే.. ఆషామాషీ కాదు..దానికో లెక్కా..పక్కా ప్లాన్ ఉండాల్సిందే...టార్గెట్ సక్సెస్ ఫుల్ గా ఫినిష్ అవ్వాల్సిందే..

IT Raids Planning : ఐటీ రైడ్స్ అంటే ఆషామాషీ కాదు..దాని వెనుక ఎలాంటి ప్లాన్ ఉంటుందో తెలుసా..?!!

IT Raids Planning : టార్గెట్ ఫిక్స్ చేశారంటే.. ఎలాంటివారి ఇంట్లో అయినా ఆఫీసుల్లో అయినా నోట్ల కట్టలన్నీ బయట పడాల్సిందే. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ టార్గెట్‌కి స్కెచ్ వేసిందంటే..ఎవరింటి కాలింగ్ బెల్ గణగణా మోగుతుందో చివరి నిమిషం దాకా తెలియదు. కాలింగ్ బెల్ నొక్కి ప్రెస్ చేసిన ఇంట్లోకి ఎంటరైదంటే.. ఇక అంతే ఎక్కడివారు అక్కడ గప్ చుప్. ఎలాంటివారైనా తప్పించుకునే చాన్సే ఉండదు. ఐటీ శాఖ ఒకేసారి ఇంతమంది ఇళ్లలో ఎలా దాడులు చేస్తోంది? వాళ్లందరి అడ్రస్‌లు, సమాచారం వీళ్లకెలా అందుతోంది? సంచలనంగా మారే ఐటీ రైడ్ వెనుక.. సైలెంట్‌గా జరిగే ఆపరేషన్ ఎందుకంత కీలకం?

అంతా ఓకే అనుకున్నాక.. ఇన్‌ఫార్మర్ల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం.. పక్కా అని తేలాకే.. ఐటీ రెయిడ్ జరుగుతుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సోదాలంటే.. అదేమంత ఆషామాషీ వ్యవహారం కాదు. టార్గెట్ చేసిన వ్యక్తులతో పాటు వారి సన్నిహితులు, బంధువులు, ఉద్యోగులు.. ఇలా అందరి ఇళ్లలో ఏకకాలంలో దాడులు జరుగుతాయ్. ఎప్పుడూ.. ఇదే ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవుతారనే క్వశ్చన్‌ వెనుక ఆన్సర్ కూడా చాలా పెద్దదిగానే ఉంది. ఇంతమంది ఇళ్లలో.. ఒకేసారి, ఒకే సమయంలో సోదాలు ఎలా సాధ్యమవుతాయ్? డోర్ పక్కనున్న కాలింగ్ బెల్ నొక్కి.. వియ్ ఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్‌మెంట్ అంటూ.. వెంటనే ఇంట్లోకి వెళ్లి.. అందరి దగ్గర సెల్‌ఫోన్లు తీసుకొని, ల్యాండ్ లైన్ ఫోన్లు ఎలా డిస్‌కనెక్ట్ చేస్తారు. ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరుగుతుండగానే.. గేటు దగ్గర భద్రతా సిబ్బంది లోపలి వారు బయటకు వెళ్లకుండా.. బయటివారు లోనికి రాకుండా పహారా కాస్తారు. ఒకే సమయంలో.. వేర్వేరు ప్రాంతాల్లో.. అంతా ఒకేలా జరిగిపోతుంటుంది. ఇదెలా సాధ్యం?

అంతెందుకు.. తాజాగా తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి ఇంట్లో జరిగిన ఐటీ రైడ్స్ ఎపిసోడ్‌నే పరిశీలిస్తే.. మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఇళ్లు, ఆఫీసులు, విద్యాసంస్థలు, వారి సంస్థల్లో పనిచేసే కొందరు ఉద్యోగుల ఇళ్లు.. ఇలా ఒకే టైంలో.. పదుల సంఖ్యలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐటీ టీమ్స్ రైడ్స్ చేశాయ్. ఒక్క మంత్రి మల్లారెడ్డి మాత్రమే కాదు. ఐటీ దాడులు ఎవరిపై అయినా ఇలాగే జరుగుతాయ్. మరి.. తెల్లారకముందే ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ ఎలా నొక్కుతున్నారు? వారికి.. అన్ని అడ్రస్‌లు ఎలా తెలుసు? ఈ అనుమానం.. ఐటీ దాడులు ఎదుర్కొంటున్నవారిలోనే కాదు సాధారణ ప్రజల్లోనూ, ప్రముఖుల్లోనూ ఉంది. అయితే.. ఐటీ టీమ్ ఎంత పక్కాగా సోదాలకు వెళ్తుందంటే.. వాళ్లు టార్గెట్ చేసిన వ్యక్తికి సంబంధించిన సంస్థలో పనిచేసిన క్లర్క్ అడ్రస్‌ని కూడా వాళ్లు కనుక్కుంటారు. సంస్థ యజమానికి కూడా వాళ్ల క్లర్క్ అడ్రస్ తెలియకుండా ఉండొచ్చేమో గానీ.. ఐటీ వాళ్లు మాత్రం నేరుగా వెళ్లి వాళ్ల కాలింగ్ బెల్ నొక్కుతారు.

ఐటీ శాఖ ఇంత దూకుడుగా దాడులు చేయడానికి ప్రధాన కారణం.. పక్కా సమాచారం. పన్ను ఎగ్గొట్టేవాళ్లు, పెద్దమొత్తంలో బ్లాక్ మనీ కలిగి ఉన్న వాళ్ల సమాచారం.. ఐటీ శాఖకు రెండు రకాలుగా అందుతుంది. ఒకటి.. పబ్లిక్‌లో నుంచి ఎవరైనా కంప్లైంట్ చేయడం. రెండోది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంటే.. తన ఇన్‌ఫార్మర్ వ్యవస్థ ద్వారా నిఘా పెట్టి.. మొత్తం కూపీ లాగడం. అయితే.. ఐటీ శాఖ ఇన్‌ఫార్మర్‌ సిస్టమ్.. ఇంటలిజెన్స్‌లాగే అత్యంత గోప్యంగా ఉంటుంది. వాళ్లు.. ఎవరి సమాచారం సేకరిస్తున్నారనేది బయటి వ్యక్తులకు తెలిసే చాన్సే లేదు. ఆరోపణలు వచ్చిన వ్యక్తి, అతని సన్నిహితులకు సంబంధించి ఆధారాలతో పాటు భారతీయ టెలిగ్రాఫ్‌ చట్టం ప్రకారం అవసరమైన వివరాలన్నీ సేకరిస్తారు. మెయిన్ టార్గెట్‌తో పాటు అతని సన్నిహితులు, ఎవరెవరి దగ్గర నగదు, ఆధారాలు ఉండే అవకాశం ఉంటుందో వారి ఇళ్లు, ఆఫీసులు, గెస్ట్‌హౌజులు, ఫామ్‌హౌజుల వివరాలు తెలుసుకుంటారు. ఏ టైంలో.. ఎక్కడెక్కడికి వచ్చి వెళుతుంటారు? ఏం చేస్తుంటారు? ఇలా.. ప్రతి ఎలిమెంట్‌కి సంబంధించి పక్కాగా సమాచారం సేకరిస్తారు.

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ బృందాలు.. సోదాలు నిర్వహించాల్సిన వ్యక్తి స్థాయిని బట్టి.. కొన్ని రోజులు, నెలల పాటు అత్యంత గోప్యంగా సమాచారం సేకరిస్తాయి. తర్వాత.. ఆ వివరాలను.. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి అందజేస్తారు. ఐటీ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ డైరెక్టర్ పర్మిషన్‌తో.. రైడ్స్ చేసేందుకు వారెంట్ తీసుకుంటారు. సోదాలకు అనుమతులు ఇచ్చిన తర్వాత.. స్థానికంగా ఉండే ఐటీ అధికారులు ఎన్ని ప్రాంతాల్లో సోదాలు జరపాల్సి ఉంటుందనే సమాచారం మేరకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకుంటారు. ఒకటి, రెండు ప్రాంతా ల్లో సోదాలకు 20, 30 మంది సరిపోతారనుకుంటే స్థానికంగా ఉండేవారిని వినియోగించుకుంటారు. వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు జరపాల్సి రావడం, వందల సంఖ్యలో సిబ్బంది అవసరం ఏర్పడితే ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తారు.

సోదాలకు ఒకరోజు ముందుగానే లోకల్ ఐటీ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు హోటళ్లలో బస చేస్తారు. ఎక్కడా తాము ఐటీ విభాగానికి చెందిన వారమనే విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడతారు. చూసేందుకు సాధారణ వ్యక్తుల్లాగే ఉంటారు. సోదాలు జరిగే రోజు అవసరాన్ని బట్టి అర్ధరాత్రి తర్వాత, తెల్లవారు జామున ప్రధాన కార్యాలయానికి చేరుకుంటారు. ఒక్కో ఐటీ టీమ్‌ని లీడ్ చేసే బాధ్యత ఒక్కో అధికారికి అప్పగిస్తారు. వారికి.. సీల్డ్ కవర్‌లో టార్గెట్‌కు సంబంధించిన వివరాలు అందజేస్తారు. సోదాలు జరిపే వ్యక్తి నివాసం, ఆఫీస్ సమీపంలోని ల్యాండ్‌మార్క్‌ చెప్పి.. రెయిడ్‌కి పంపిస్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత సీల్డ్‌ కవర్‌ తెరిచి చూస్తే టార్గెట్‌ ఎవరు, అడ్రస్‌ ఎక్కడ అనేది తెలుస్తుంది.