Podu Land in Telangana :పోడు భూముల సమస్యలను ప్రభుత్వం ఎందుకు పరిష్కరించలేకపోతోంది? అటవీ చట్టాలు ఏం చెబుతున్నాయ్?

పోడు భూముల రగడ రావణకాష్టంలా రగులుతోంది.. పచ్చని తెలంగాణ అడవుల్లో.. ఎర్రని రక్తం చిందుతోంది. ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతంలో.. నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయ్. ఫారెస్ట్ ఆఫీసర్లకు.. ఆదివాసీ బిడ్డలకు నిత్యం పోరు నడుస్తోంది. వీటన్నింటికి కారణం పోడు భూములు. మొన్నటిదాకా అటవీ అధికారుల అడ్డగింత, పరస్పరం దాడులు మాత్రమే ఉండేవి. కానీ.. ఇప్పుడు అవే గొడవలు.. ప్రాణాలు పోయే దాకా, తీసే దాకా వచ్చేశాయ్. ఈ పోడు గొడవల్లోనే.. ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు చనిపోయారు. దీంతో.. పోడు భూముల ఇష్యూ.. మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Podu Land in Telangana :పోడు భూముల సమస్యలను ప్రభుత్వం ఎందుకు పరిష్కరించలేకపోతోంది? అటవీ చట్టాలు ఏం చెబుతున్నాయ్?

Podu Land Dispute in Telangana.

Podu Land Dispute in Telangana : పోడు భూముల రగడ రావణకాష్టంలా రగులుతోంది.. పచ్చని తెలంగాణ అడవుల్లో.. ఎర్రని రక్తం చిందుతోంది. ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతంలో.. నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయ్. ఫారెస్ట్ ఆఫీసర్లకు.. ఆదివాసీ బిడ్డలకు నిత్యం పోరు నడుస్తోంది. వీటన్నింటికి కారణం పోడు భూములు. మొన్నటిదాకా అటవీ అధికారుల అడ్డగింత, పరస్పరం దాడులు మాత్రమే ఉండేవి. కానీ.. ఇప్పుడు అవే గొడవలు.. ప్రాణాలు పోయే దాకా, తీసే దాకా వచ్చేశాయ్. ఈ పోడు గొడవల్లోనే.. ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు చనిపోయారు. దీంతో.. పోడు భూముల ఇష్యూ.. మరోసారి చర్చనీయాంశంగా మారింది.

అసలు.. పోడు భూముల సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుంది? ఈ ప్రశ్నకు.. కచ్చితమైన కట్ ఆఫ్ తేదీ చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయ్. తెలంగాణలో.. పోడు భూముల రచ్చ కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచే.. కొన్నేళ్లుగా ఉన్న ఈ సమస్య.. ఇటీవలికాలంలో మరింత ఎక్కువైంది. అటవీశాఖ అధికారులు, ఆదివాసీ, గిరిజనుల మధ్య.. తరచుగా అడవి మధ్యలో పోరు నడుస్తూనే ఉంది. తాము సాగు చేసుకుంటున్న పోడు భూముల్లోకి.. ఫారెస్ట్ ఆఫీసర్లు చొరబడుతున్నారని.. తమ పంటలను నాశనం చేస్తున్నారని గిరిజన బిడ్డలు గగ్గోలు పెడుతున్నారు. అటవీశాఖ భూముల్లోని చెట్లను నరుకుతూ.. అటవీ సంపదను నాశనం చేస్తూ.. భూములను ఆక్రమించుకుంటున్నారని.. ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నామని వాళ్లు.. అవి ప్రభుత్వ భూములను అధికారులు.. ఇలా ఎడతెగని రచ్చ జరుగుతోంది.

ప్రతి ఏటా వర్షాకాలం సీజన్‌లో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉంటుంది. ఆదివాసీలు, గిరిజనులు సాగు చేస్తున్న భూముల్లో.. ఫారెస్ట్ ఆఫీసర్లు వెళ్లి మొక్కలు నాటడం, దానికి వాళ్లు అభ్యంతరాలు చెప్పడం సాధారణమైపోయింది. ఇక్కడే.. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తుతోంది. పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. కొన్ని కొన్నిసార్లు అటవీశాఖ అధికారులకు గాయాలు కూడా అవుతున్నాయ్. అంతేకాదు.. ఆదివాసీలను ఫారెస్ట్ ఆఫీసర్లు తీవ్రంగా కొట్టిన ఘటనలూ ఉన్నాయ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గుత్తికోయల దాడిలో ఏకంగా ప్రాణాలే కోల్పోయారు.

Telangana : ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య వెనుక మావోయిస్టుల హస్తం ఉందా?

వాస్తవానికి.. తెలంగాణలో కొంత కాలంగా పోడు సమస్య తీవ్రమవుతూ వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుపెడితే.. చివరన ఉన్న పాలమూరు నల్లమల దాకా పోడు భూముల సమస్య ఉంది. ఈ అంశంలో రాజకీయంగానూ ప్రభుత్వానికి చికాకులు వస్తున్నాయ్. నిత్యం జరుగుతున్న గొడవలు తలనొప్పిగా మారడంతో.. ఈ సమస్యకు పుల్‌స్టాప్ పెట్టాలని సర్కార్ కూడా నిర్ణయించింది. పొలిటికల్‌గానూ పోడు భూములు ఎఫెక్ట్ చూపుతున్నాయని.. స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగి.. దీనిని పరిష్కరిస్తామని ప్రకటించారు. అందుకోసం.. అర్హులైన, పోడు భూములు సాగు చేసే ఆదివాసీ, గిరిజనులకు వాళ్లు సాగు చేసుకుంటున్న భూమిపై హక్కులు కల్పిస్తామని ప్రకటించారు. సీఎం ఆదేశాలతో.. గతేడాది నవంబర్‌లో అధికారులు అర్హులైన వారి జాబితా కోసం చర్యలు చేపట్టారు. డిసెంబర్‌లోనే పట్టాలివ్వాలని.. అఫీసర్లు పని మొదలుపెట్టారు. దీంతో.. అటవీ భూములపై హక్కుల కోసం ప్రభుత్వానికి 4 లక్షల 14 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా.. దాదాపు 12 లక్షల 49 వేల ఎకరాల పోడు భూములు సాగు చేసుకుంటున్నామని తెలిపారు. వాటికి.. హక్కు పత్రాలు కల్పించాలని కోరుతున్నారు.

భారీ ఎత్తున ధరఖాస్తులు రావడంతో.. అధికార యంత్రాంగం వాటిని పరిష్కరించే పనిలో నిమగ్నమైంది. పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలంటే.. ప్రభుత్వం కొన్ని రూల్స్ పెట్టింది. కేంద్ర అటవీ చట్టం-2006 ప్రకారం.. స్థానికంగా ఉంటూ నిజంగానే భూమిని సాగు చేసుకున్నట్లయితేనే.. హక్కు పత్రాలు లభిస్తాయి. గతంలో అటవీ చట్టం ప్రకారం.. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 93 వేల 494 మందికి 3 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చారు. అయితే.. అప్పట్లో లక్షా 83 వేల 107 మంది దరఖాస్తు చేసుకుంటే.. 93 వేల 494 మందికి మాత్రమే హక్కు పత్రాలు లభించాయి. మిగతావారి దరఖాస్తులు.. పెండింగ్‌లోనే ఉండిపోయాయ్. కానీ.. ఇప్పుడు పోడు భూములపై హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. 4 లక్షల 14 వేల మంది అడవి బిడ్డలు.. భూ హక్కుల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. వీళ్లందరిలో.. చాలా మంది అనర్హులు ఉన్నారని.. అటవీశాఖ చెబుతోంది. దీంతో.. అర్హుల జాబితా రూపొందించేందుకు.. ప్రభుత్వమే రంగంలోకి దిగింది.

భూ హక్కుల కోసం దరఖాస్తులు కుప్పలు, తెప్పలుగా రావడంతో.. ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్రామాల్లో అధికారులు సర్వే చేపట్టారు. గిరిజన సంక్షేమ శాఖ, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు కలిసి.. నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. వాళ్లు చేస్తున్న సర్వేలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయ్. పోడు భూముల సాగు విషయంలో.. నిజంగానే ఆదివాసీలు, గిరిజనులు సాగు చేస్తున్నారా? అనే విషయంలో.. అధికారులకు, స్థానికులకు మధ్య వివాదం చోటు చేసుకుంటోంది. తమకు గతంలో ఇచ్చిన భూములను సైతం మళ్లీ సర్వేకు పెడుతుండటంతో.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. గతంలో ఇచ్చిన హక్కు పత్రాలను చాలా మంది పోగొట్టుకున్నారు. అంతేకాదు.. గతంలో ఉమ్మడిగా ఉన్న గిరిజనులు.. ఇప్పుడు విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి.. రేషన్ కార్డులు లేకపోవడంతో.. అధికారులు కూడా అర్హుల జాబితాలో చేర్చడం లేదు. దీంతో.. ఆదివాసీ కుటుంబాల్లోనూ చిచ్చు రేగుతోంది.

Forest Officer Killed : ఫారెస్ట్ రేంజర్ హత్య.. తుపాకులు ఇస్తేనే డ్యూటీ చేస్తామంటున్న అటవీశాఖ సిబ్బంది

పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం.. కింది స్థాయిలో చేపట్టిన చర్యలతో.. అగ్గికి ఆజ్యం పోసినట్లుగా తయారైంది పరిస్థితి. ఓ వైపు రూల్స్, మరోవైపు గిరిజన బిడ్డల అమాయకత్వానికి తోడు.. దళారులు ఎంట్రీ ఇవ్వడంతో.. సమస్య మరింత జఠిలమవుతోంది. దీంతో.. అటవీ ప్రాంతాల్లో నిత్యం ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. గ్రామ సభల ఆమోదం మేరకు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. డిసెంబర్‌లో పట్టాలిస్తుందా? లేదా? అనేది.. ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్‌గా మారింది. గ్రామ సభల ఆమోదం మేరకు పట్టాలు ఇచ్చినట్లయితే.. పోడు భూముల సమస్యకు పుల్ స్టాప్ పడుతుంది. కానీ.. కేంద్ర అటవీచట్టం-2006 ప్రకారం.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అస్సలు పొసగడం లేదు. దీంతో.. మున్ముందు.. ఈ అంశం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది.. ఆందోళన రేపుతోంది.

అటవీ ప్రాంతాల్లో తరచుగా జరుగుతున్న గొడవలపై.. ఫారెస్ట్ సిబ్బంది తీవ్రంగా స్పందిస్తున్నారు. గుత్తికోయల హ్యాబిటేషన్లను ఎత్తివేయాలంటున్నారు. అడవులను కాపాడాలంటే.. ఫారెస్ట్ సిబ్బందికి భద్రత పెంచాలని.. ఆయుధాలు ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాదు.. మండల కేంద్రాల్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలంటున్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం వల్లే దాడులు పెరిగాయని.. చివరకు అవి ప్రాణాలు తీసే దాకా వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి.. ఫారెస్ట్ సిబ్బందిపై చిన్న చూపు ఉందని.. ఇలా తరచుగా దాడులు జరుగుతుంటే.. విధులు ఎలా నిర్వర్తించాలని ప్రశ్నిస్తున్నారు అటవీ పోలీసులు. ఇక.. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును హత్య చేసిన వాళ్లను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.