శిరోముండనం బాధితుడి అదృశ్యంలో ట్విస్ట్, వరప్రసాద్ అరెస్ట్

శిరోముండనం బాధితుడి అదృశ్యంలో ట్విస్ట్, వరప్రసాద్ అరెస్ట్

police arrest tonsured victim vara prasad: సంచలనం రేపిన తూర్పుగోదావరి జిల్లా శిరోముండనం కేసులో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. శిరోముండనం బాధితుడు ఇండుగుమిల్లి వరప్రసాద్ అదృశ్యంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వరప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఎవరో బెదిరిస్తున్నారంటూ ఫిబ్రవరి 3న వరప్రసాద్ ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు సీతానగర్ పోలీస్ స్టేషన్ లో ప్రసాద్ భార్య కౌసల్య ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పోలీసులకు షాకింగ్ నిజం తెలిసింది. ప్రణాళిక ప్రకారమే వరప్రసాద్ కాకినాడలోని తన మిత్రుడు సందీప్ ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పైగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినట్లు దర్యాఫ్తులో వెల్లడైంది. తప్పుడు సమాచారంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు పోలీసులు సీరియస్ అయ్యారు. వరప్రసాద్ తో పాటు సందీప్ ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.

2020 జూలై 18న మునికూడలి, కటావరం దగ్గర ఇసుక రేవు వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రశ్నించిన వరప్రసాద్‌కు పోలీసు స్టేషన్‌లో ఎస్ఐ ఫిరోజ్ శిరోముండనం చేయించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రపతి కార్యాలయం వరకు విషయం చేరడంతో కలకలం రేపింది. సీబీఐ విచారణ కూడా జరుగుతోంది. తనకు శిరోముండనం చేయించిన వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ ఇదివరకు వరప్రసాద్ నిరసన దీక్ష కూడా చేపట్టాడు.

కేసు పురోగతి సాధించకపోవడంతో వరప్రసాద్ మనస్తాపంతో ఉన్నాడు. తనకు న్యాయం జరగదని భావిస్తున్నాడు. శిరోముండనం గురించి వేధిస్తున్నారని చెప్పి వాపోయేవాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. బుధవారం(ఫిబ్రవరి 3,2021) సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి ఆచూకీ కనిపించకపోవడంతో.. కంగారుపడ్డ కుటుంబసభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు.