Children : పిల్లల విషయంలో సానుకూలంగా!

పిల్లల చదువుల విషయంలో వారి శక్తి సామర్ధ్యాలను మించిన ఫలితాలను ఆశించటం ఏమాత్రం సరైనది కాదు. ఏదైనా సమస్య ఉత్పన్నం అయిన సందర్భంలో పిల్లల కోణం నుండి ఆలోచించే ప్రయత్నం చేయాలి.

Children : పిల్లల విషయంలో సానుకూలంగా!

Children

Children : పిల్లల పెంపకం అన్నది ఒక కళ లాంటిది. తల్లి దండ్రుల పెంపకాన్నిబట్టి పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. చిన్నప్పటి తల్లిదండ్రుల పెంపక విధానాలపైనే పిల్లల భావి జీవితం అధారపడి ఉంటుంది.పిల్లలను చిన్న వయస్సు నుంచే సక్రమంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల విషయంలో తల్లి దండ్రులు అనుసరించాల్సిన విధానాలపై నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….

పిల్లలకు పాఠ్యాంశాలతో పాటు, ఇతర విషయాల గురించి అర్ధమయ్యేలా చెప్పటం అవసరం. పుస్తకాలను చదివే అలవాటు చేయాలి. కొత్త ప్రదేశాలకు తీసుకువెళ్లటం వల్ల వారి ఆలోచనా పరిధి పెరుగుతుంది. పిల్లలు చదవులో ప్రతిభ చూపినప్పుడు పెద్దలు వారిని ప్రోత్సహించాలి. అప్పుడే వారి శక్తి సామర్ధ్యాలు మరింత పెరుగుతాయి. పిల్లల్లో కలిగే సందేహాలను వారికి అర్ధమయ్యే భాషలో వివరించాలి. అలాకాకుండా విసుక్కోరాదు. దీని వల్ల పిల్లల ఆలోచన , ఆసక్తి సన్నగిల్లుతాయి.

పిల్లల చదువుల విషయంలో కొంత మంది తల్లిదండ్రులు అతిగా జోక్యం చేసుకుంటుంటారు. మరికొంతమంది అస్సలే పట్టించుకోరు. ఈ రెండు పద్దతులూ మంచివి కావంటున్నారు నిపుణులు. విద్య విషయంలో పిల్లల్ని ప్రోత్సహిస్తూనే , వారి అభిరుచికి ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. పిల్లలు తమ అభిరుచికి తగిన చదువుల్లో ముందుకు సాగేలా పెద్దలు ప్రొత్సహించటంలో బాటు అందుకు తగిన వాతావరణాన్ని ఇంట్లో పెద్దలు ఉండేలా చూడాలి.

పిల్లల చదువుల విషయంలో వారి శక్తి సామర్ధ్యాలను మించిన ఫలితాలను ఆశించటం ఏమాత్రం సరైనది కాదు. ఏదైనా సమస్య ఉత్పన్నం అయిన సందర్భంలో పిల్లల కోణం నుండి ఆలోచించే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు అప్పుడప్పుడు పాఠశాలకు వెళ్ళి, ఉపాధ్యాయులను కలసి పిల్లల చదువుల గురించి, నడవడిక గురించి తెలుసుకోవాలి. పిల్లలు చదువులో వెనుకబడి ఉంటే అందుకు గల కారణాలు అవగాహన చేసుకుని వారిని చదువులో ప్రొత్సహించేలా, అదనపు శిక్షణని ఇవ్వాలి. పిల్లలు, ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా చూసుకోవాలి.

చదువు విషయంలో పిల్లలను తోటి విద్యార్ధులతో పోల్చి కించపరచరాదు. వారికి సానుకూలమైన సలహాలు ఇవ్వాలి. ప్రోత్సహించాలి. చదువుతోపాటు ఆటపాటల్లో వారిని ప్రోత్సహించాలి. దీని వల్ల వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినవారవుతారు. పిల్లలు రోజు కొంత సమయాన్ని ఆటలు, వ్యాయామానికి కేటాయించేలా చూసుకోవాలి. పిల్లల్లో ఆరోగ్యసమస్యలు గుర్తిస్తే వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్ళి చికిత్స అందించటం మంచిది.