ఆ పార్టీకి పని చేయనన్న ప్రశాంత్ కిశోర్

  • Published By: madhu ,Published On : June 3, 2020 / 05:56 AM IST
ఆ పార్టీకి పని చేయనన్న ప్రశాంత్ కిశోర్

ఉప ఎన్నికల్లో 24 అసెంబ్లీ స్థానాల కోసం ప్రచారం నిర్వహించడానికి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతిపాదనను తాను అంగీకరించినట్లు వస్తున్న వార్తలను ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఖండించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా, ఇతరులు బీజేపీలోకి జంప్ కావడంతో ఇక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయి.

దీంతో త్వరలో ఇక్కడ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. తమ పార్టీని గెలిపించేందుకు వ్యూహాలు రచించాలని కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిశోర్ ను కోరినట్లు సమాచారం. తనకు ప్రచార బాధ్యతలు అప్పగించాలని కమల్ నాథ్ తో పాటు, పంజాబ్ సీఎం అమరీరంద్ సింగ్ లు భావించారని కిశోర్ తెలిపారు. తనను సంప్రదించి రాబోయే ఎన్నికల్లో సహకరించాలని కోరినట్లు, కానీ దానికి తాను అంగీకరించలేదని స్పష్టం చేశారు.

2014లో తొలిసారి ప్రశాంత్…నరేంద్ర మోదీ కోసం పనిచేశారు. ఈ  ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. తర్వాత అమిత్ షాతో వచ్చిన విబేధాల కారణంగా..ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో ఆప్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. ఎన్నికల్లో ఆప్ పార్టీ అఖండమైన విజయం సాధించింది.

గత సంవత్సరం ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీ సాధించింది. వైసీపీ విజయం వెనుక ప్రశాంత్ కిశోర్ టీం విశేష కృషి దాగి ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబోయే..రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్‌లో TMC కోసం, తమిళనాడులో DMK కోసం ఆయన పనిచేస్తున్నారు. 

Read: జడ్జికి కరోనా..కోర్టులో కలకలం