100 కి.మీటర్లు నడిచిన గర్భిణీ..రోడ్డుపైనే డెలివరీ..పసికందు మృతి

  • Published By: madhu ,Published On : May 25, 2020 / 09:15 AM IST
100 కి.మీటర్లు నడిచిన గర్భిణీ..రోడ్డుపైనే డెలివరీ..పసికందు మృతి

కరోనా రాకాసి వలస కూలీల కడుపుపై దెబ్బ కొట్టింది. ఉపాధి కోసం వలస వచ్చిన వారంతా..తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. కొందరు క్షేమంగా చేరుకుంటుంటే..మరికొందరు ప్రాణాలు విడుస్తున్నారు. వేలాది కిలో మీటర్లు ప్రయాణించలేక నానా అవస్థలు పడుతున్నారు. వీరిలో చంటి పిల్లల నుంచి మొదలుకొని వృద్ధులు, గర్భిణీలున్నారు. తాజాగా ఓ నిండు చూలాలు వంద కిలో మీటర్లు ప్రయాణించి..రోడ్డుపైనే డెలివరీ అయ్యింది. ఫలితంగా..పసికందు చనిపోయింది. దీంతో తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. 

వివరాల్లోకి వెళితే….
బిందియా..ఆమె భర్త జతిన్ రామ్..లకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. లుథియానాలో ఓ ఫ్యాక్టరీలో రామ్ కూలీ పని చేసేవాడు. గత సంవత్సరం బీహార్ రాష్ట్రం నుంచి లుథియానకు బిందియా వచ్చింది. కరోనా వైరస్ ప్రబలడంతో లాక్ డౌన్ విధించారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు మూత పడడంతో రామ్ ఉపాధి కోల్పోయాడు. ఈ క్రమంలో వలస కార్మికులు సొంత గ్రామాలకు పయనమయ్యారు. కొందరు నడిచారు. ఇతరులు వేరే వేరే వాహనాల్లో ఎక్కుతూ వెళ్లిపోయారు. రామ్ దంపతులు కూడా..సొంత ఊరికి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. అప్పటికే బిందియా 9 నెలల గర్భవతి. ప్రత్యేక రైళ్లలో వెళ్లడానికి ప్రయత్నించినా..అది నెరవేరలేదు. గత వారం లుథియానా నుంచి బీహార్ లోని సొంత గ్రామానికి బయలుదేరారు. 

పంజాబ్ నుంచి బీహార్ రాష్ట్రంలోని వారి సొంత గ్రామానికి వెళ్లాలంటే..వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. 100 కిలోమీటర్ల వరకు నడిచిన..బిందియాకు ఆహారం సరిగ్గా అందకపోవడంతో బలహీనంగా తయారైంది. తగినంత డబ్బు కూడా లేదు. అంబాలా నగరానికి చేరుకొనే సరికి బిందియాకు ప్రసవనొప్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే శిశువుకు జన్మనిచ్చింది. కానీ..పసికందు చనిపోయింది. మొదటి సంతానమే ఇలా కావడంతో తీవ్ర దుఖంలో మునిగిపోయారు.

బాధను దిగమింగుకుంటూ..శిశువుకు అంత్యక్రియలు చేశారు. అక్కడనే ఉన్న పోలీసులు వీరిని ఆసుపత్రికి తరలించేందుకు సహాయం చేశారు. అంబాలా వద్ద ఏర్పాటు చేసిన కంటెన్ మెంట్ వద్దనున్న ఎన్జీవో సిబ్బంది వారి బస కోసం ఏర్పాట్లు చేసింది. శ్రామిక్ రైలులో పంపిస్తామని రామ్ దంపతులకు హామీనిచ్చారు. 

Read: పిచ్చి పిచ్చి వేషాలేస్తే..రూమ్‌లో వేసి బెల్టుతో చితక్కొడతాం : అధికారులపై కేంద్ర మంత్రి చిందులు