Normal Delivery : గర్భిణీ స్త్రీలు నార్మల్ డెలివరీ కోసం!

సాధారణ కాన్పుకు నిద్రకూడా ఉపకరిస్తుంది. ప్రశాంతమైన నిద్ర ద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదుగుదలతోపాటు, తల్లి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.

Normal Delivery : గర్భిణీ స్త్రీలు నార్మల్ డెలివరీ కోసం!

Pregnant Women (1)

Normal Delivery : నవమాసాలు గర్భంతో ఉండటమంటే స్త్రీలకు పెద్ద పరీక్ష లాంటిది. అందులోను నవమాసాల తరువాత సాధారణంగా డెలివరీ అంటేనే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవలి కాలంలో సాధారణ డెలివరీల కంటే ఆపరేషన్ చేయటం ద్వారా బిడ్డను బయటకి తీసే ప్రక్రియలు కొనసాగుతున్నాయి. అయితే చాలా మంది స్త్రీలు సాధారణ డెలివరీ కావాలని కోరుకుంటుంటారు. గర్భం దాల్చింది మొదలు డెలవరీ అయ్యేంత వరకు తనకు సుఖప్రసవం జరగాలని అకాంక్షిస్తుంటారు.

అయితే ప్రసవ సమయంలో అనుకోని పరిస్ధితులు ఎదురైతే సాధారణ డెలివరీకి బదులుగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. గర్భం దాల్చింది మొదలు కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే నార్మల్ డెలివరీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. డెలివరీ సమయంలో వచ్చే నొప్పులను ఎదుర్కోవటానికి, కండరాల బలోపేతాని తేలికపాటి వ్యాయామాలు ఎంతగానో దోహదపడతాయి. తల్లి బిడ్డల్లో శక్తిని పెంచటానికి సైతం వ్యాయామాలు ఉపకరిస్తాయి. ఈ వ్యాయామాలు డెలివరీ సమయంతోపాటు, డెలివరీ తరువాత కూడా ఉపయోగకరంగా ఉంటాయి.

గర్భం దాల్చిన నాటి నుండి తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే శిశువు అభివృద్ధి ,పెరుగుదలకు సహాయపడటమే కాకుండా తల్లిని ఆరోగ్యంగా ఉంచుతుంది. గర్భధారణ సమయంలో సమస్యలను ఎదుర్కోవడానికి ఉపకరిస్తుంది. అంతేకాకకుండా సులభంగా సుఖంగా ప్రసవించటానికి దోహదపడుతుంది. అయితే వైద్యుల సలహా మేరకు ఆహారాలను తీసుకోవటం మంచిది.

శ్వాస వ్యాయామాలు ప్రసవాన్ని సులభతరం చేయడానికి ఉపకరిస్తాయి. వైద్యులు ఈ శ్వాస వ్యాయామాలను ప్రసవానికి సిద్ధం చేయడానికి ముందుగానే ఆచరించాలని సిఫార్సు చేస్తారు. గర్భం దాల్చిన తొలి మాసం నుండే సరైన శ్వాస పద్ధతులను ఆచరించడం వల్ల సాధారణ ప్రసవానికి అవకాశం ఉంటుంది. గర్భం దాల్చిన చివరి నెలల్లో మూత్రాశయం పై ఒత్తిడి కారణంగా మహిళలు తరచుగా తగినంత నీరు తాగడం మానేస్తారు. గర్భిణీ స్త్రీలు సాధారణంగా వచ్చే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లను నివారించడానికి ప్రతిరోజూ కనీసం 7-8 గ్లాసుల నీరు తీసుకోవడం అవసరం. హైడ్రేషన్ లోపించడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్, అలసట, వికారం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

ప్రసవ సమయంలో సంకోచాలకు కారణమయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ అధిక ఉత్పత్తిని నివారించడానికి గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో ఒత్తిడి లేకుండా ఉండటం అవసరం. గర్భధారణ సమయంలో మానసిక ఆరోగ్య సమస్యలు తల్లి,బిడ్డలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఒత్తిడిని తగ్గించుకోవటానికి కుటుంబసభ్యులతో సరదాగా గడపటం, పుస్తకాలు చదవటం వంటివి చేయాలి. ప్రసావానికి ముందే డెలివరీ సమయంలో ఎదురయ్యే సమస్యలపై అవగాహన కలిగి ఉండటం మంచిది. సమస్యలు ఉత్పన్నం అయిన సందర్భంలో ధైర్యంగా ఎలా ఉండాలో కూడా ఇతర మహిళల ద్వారా, వైద్యులను అడగటం ద్వారా తెలుసుకోని ఆమేరకు సన్నధ్ధం కావాల్సి ఉంటుంది.

సాధారణ కాన్పుకు నిద్రకూడా ఉపకరిస్తుంది. ప్రశాంతమైన నిద్ర ద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదుగుదలతోపాటు, తల్లి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. నిద్రలేమి కారణంగా కొన్ని సందర్భాల్లో నెలలు నిండకుండానే కాన్పులు జరిగే ప్రమాదాలు ఉంటాయి. నిద్ర గర్భిణీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో కలిగే అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది.